HomeNewsBreaking News10 గంటలపాటు కవితపై ప్రశ్నల వర్షం

10 గంటలపాటు కవితపై ప్రశ్నల వర్షం

ఉదయం 11 నుంచి రాత్రి 9 గంటల వరకు ఇడి విచారణ
మళ్లీ నేడు దర్యాప్తు సంస్థ ముందుకు ఎంఎల్‌సి
న్యూఢిల్లీ :
లిక్కర్‌గేట్‌ అవినీతి కేసులో తెలంగాణ జాగృతి నాయకురాలు, బిఆర్‌ఎస్‌ పార్టీ ఎంఎల్‌సి కె.కవితను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు సుమారు పది గంటలపాటు విచారణ చేశారు. వరుసగా రెండోరోజు మంగళవారం కూడా విచారణకు హాజరు కావాలని కోరుతూ అధికారులు ఆమెకు సమన్లు అందజేశారు. ఢిల్లీలోని ఇడి కార్యాలయంలో సోమవా రం రాత్రి తొమ్మిది గంటల వరకూ కవిత విచారణ కొనసాగింది. విచారణ ముగిసిన అనంతరం ఇడి కార్యాలయంలోంచి బయటకు వచ్చిన కవిత విజయ సంకేతం చూపిస్తూ కారు ఎక్కి వెళ్ళిపోయారు. ఈ కేసులో ఇప్పటికే ఇడి అదుపులో ఉన్న అరుణ్‌రామచంద్రపిళ్ళై, ఆడిటర్‌ గోరంట్ల బుచ్చిబాబులను ఎదురుగా కూర్చోబెట్టి కవితను ఇడి అధికారులు విచారణ చేస్తారని ముందునుండీ వార్తలు వచ్చాయి. ఇప్పటికి రెండుసార్లు ఆమె ఇడి విచారణకు హాజరయ్యారు. తొలుత ఒకసారి సిబిఐ అధికారులు హైదరాబాద్‌లోని ఆమె నివాసానికి వెళ్ళి విచారణ జరిపారు. తాను ఎలాంటి తప్పూ చేయలేదని, కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం దర్యాప్తు సంస్థ ఇడిని తనపై ఒక ఆయుధంగా ప్రయోగిస్తోందని, ఈ విధమైన చర్యలద్వారా బిజెపి దొడ్డిదోవన తెలంగాణ రాష్ట్రంలో తిష్టవేయాలని చూస్తోందని, ఎట్టి పరిస్థితుల్లో ఆలాంటి ప్రయత్నాలు ఫలించబోవని కవిత చెబుతూ వస్తున్నారు. ఈ కేసు లో ఇడి అధికారులు ఇప్పటివరకూ 12 మందిని అరెస్టు చేశా రు. వీరిలో ఢిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియా ఉన్నారు. వైఎస్‌ఆర్‌సిపి ఎంపి మాగుంట శ్రీనివాసులురెడ్డి, ఆయన కుమారుడు మాగుంట రాఘవ, అరబిందో ఫార్మా ప్రమోటర్‌ శరత్‌ రెడ్డి, కవిత సహా పలువురు లబ్ధిదారులుగా ఉన్న ఢిల్లీ మద్యం పంపిణీ నియంత్రణ కూటమి “సౌత్‌ గ్రూప్‌” రూ.100 కోట్లు ఆమ్‌ ఆద్మీపార్టీకి ముడుపులుగా సమర్పించిందన్నది
కవితపై ప్రశ్నల వర్షం
ఇడి ఆరోపణ. ఈ కేసులో కవిత పెట్టుబడులకు రామచంద్రపిళ్ళై బినామీగా వ్యవహరిస్తున్నారని కూడా ఇడి అతడి రిమాండ్‌ పత్రాల్లో పేర్కొంది. ఈ ముడుపులను ఆప్‌ పార్టీ గోవా ఎన్నికల ప్రచారంలో ఖర్చుచేసిందని కూడా కోర్టుకు సమర్పించిన ఛార్జిషీటులో ఇడి ఆరోపించింది. నాలుగు రోజుల క్రితం మార్చి 16న తీవ్ర ఉద్రిక్తతలమధ్య కవిత ఇడి కార్యాలయంలో విచారణకు హాజరుకాకుండా తన ప్రతినిధిని పంపించి వివరణ ఇచ్చారు. వ్యక్తిగతంగా రావాలని సమన్లలో ప్రత్యేకంగా చెప్పినందువల్లనే తాను రాకుండా తన ప్రతినిధిని పంపించానని ఆమె వివరణ ఇచ్చారు. ఇడి ఆమె వివరణను తిరస్కరించి ఈనెల 20న తమ ఎదుట హాజరు కావాలని పేర్కొంది. ఈ నేపథ్యంలో కవిత నిర్ణీత ప్రకారం ఇడి ఎదుట విచారణకు హాజరవుతారా? లేదా? అనే ఉత్కంఠ పరిస్థితుల మధ్య ఆమె చట్టానికి సహకరిస్తామని ప్రకటించి విచారణకు హాజరయ్యారు. సోమవారం ఉదయం 10.30 గంటలకు కవిత ఇడి కేంద్ర కార్యాలయంలోకి ప్రవేశించారు. కాగా సిబిఐ అదికారులు తొలుత కవితను హైదరాబాద్‌లోని ఆమె నివాసంలో ప్రాథమికంగా విచారణ జరిపి ఈ కేసు వివరాలను ఆరా తీశారు. ఆ తరువాత మార్చి 11న ఇడి అధికారులు ఢిల్లీకి పిలిపించి కవితను తొమ్మిదిగంటలపాటు విచారణ జరిపారు. ఒక మహిళను రాత్రి వరకూ ఇడి కార్యాలయంలో విచారణ జరపడమేమిటని కవిత తీవ్ర అభ్యంతరం తెలియజేశారు. ఈ మేరకు ఆమె సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసి మహిళను గనుక తనను తన ఇంటి వద్దనే విచారణ చేసేవిధంగా ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. తక్షణ ప్రాతిపదికపై తన పిటిషన్‌ విచారించాలని ఆమె కోర్టును కోరారు. అయితే కోర్టు అందుకు తిరస్కరించి ఆమె పిటిషన్‌పై విచారణకు ఈ నెల 24వ తేదీని కేటాయించింది. మార్చి 11 వ తేదీన విచారణ అనంతరం కవితను అరెస్టు చేస్తారని జోరుగా ఊహాగానాలు సాగాయి. ఆమె తండ్రి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సైతం, “కవితను అరెస్టు చేస్తరట, ఏం చేస్తరో చూద్దాం” అని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో కవిత తన కుటుంబసభ్యులతోపాటు బిఆర్‌ఎస్‌ ఎంపీలతో కలిసి ప్రత్యేక విమానంలో 20వ తేదీ విచారణకు ఒకరోజు ముందుగానే ఆదివారంనాడు ప్రత్యేక విమానంలో ఢిల్లీ చేరుకున్నారు. 11వ తేదీన కవితను విచారణ చేయడంతోపాటు ఆమె వాంగ్మూలాన్ని ఇడి అధికారులు రికార్డు చేశారు. హైదరాబాద్‌కు చెందిన వ్యాపారి అరుణ్‌ రామచంద్రపిళ్ళై ఇడి ఎదుట ఇచ్చిన వాంగ్మూలంతో విచారణ సందర్భంగా ఇడి అధికారులతో కవిత విభేదించారు. పిఎంఎల్‌ఎ (ప్రివెన్షన్‌ ఆఫ్‌ మనీ లాండరింగ్‌ యాక్ట్‌) చట్టం కింద ఆమె వాంగ్మూలాన్ని అధికారులు రికార్డు చేశారు. ఇడి ఇప్పటికే బుచ్చిబాబు వాంగ్మూలాన్ని కూడా రికార్డు చేసింది. కవితకు, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌కు, సిసోడియాకు మధ్య రాజకీయ అవగాహన ఉందని, ఈ క్రమంలో 2021 మార్చి 19, 20 తేదీలలో ఆమె విజయ్‌ నాయర్‌ను కూడా కలుసుకున్నారని బుచ్చిబాబు చెప్పినట్లు ఇడి పేర్కొంది. ఈ కేసులో విజయ్‌ నాయర్‌ను కీలక సూత్రధారిగా పేర్కొంటూ ఇడి, సిబిఐలు ఇప్పటికే అరెస్టు చేశాయి.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments