ఐజెయు డిమాండ్
పాత్రికేయులకు ఎదురవుతున్న సమస్యలపై ఆందోళన
ప్రజాపక్షం / హైదరాబాద్ జర్నలిజానికి ఎదురవుతున్న సవాళ్ళు , దాడులు, కేసులు, చివరకు జర్నలిస్టులను హత్యలు చేయడం వరకు వెళ్లిన పరిస్థితులపై ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ (ఐజెయు) జాతీయ కార్యవర్గ సమావేశం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఇలాంటి సంఘటనలపై పాలకుల నిర్లిప్తతను సమావేశం తీవ్రంగా తప్పు పట్టింది. జర్నలిస్టుల భద్రత కోసం మీడియా కమీషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసింది. జర్నలిస్టులకు చాలీ చాలనీ వేతనాలు ,అసలు వేతనాలే లేకపోవడం ఉద్యోగభద్రత , వేతన చట్టాలను వేయకపోవడం, గతంలో వేసిన చట్టాల సిఫార్సులను అమలు జరపక పోవడంపై సమావేశాలు నిరసన వ్యక్తం చేసింది. ఈ సమావేశంలో ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ జాతీయ అధ్యక్షులు కె.శ్రీనివాస్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ జాతీయ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్, ఐజెయు మాజీ అధ్యక్షుడు ఎస్‌ఎన్ సిన్హా, స్క్రైబ్స్ న్యూస్ మ్యాగజైన్ ఎడిటర్ సురేష్ ఆలపాటి, ఐజెయు జాతీయ ప్రధాన కార్యదర్శి బల్వీందర్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. . జమ్మూతో సహా దేశంలోని 21 రాష్ట్రాల నుంచి 100 మందికి పైగా ఐజెయు కార్యవర్గం, ఆయా రాష్ట్రాల యూనియన్ల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు హాజరై వర్తమాన జర్నలిజంలో చోటు చేసుకుంటున్న పరిణామాలపై చర్చించారు. ఐజెయు మాజీ జాతీయ అధ్యక్షుడు ఎస్.ఎన్.సిన్హా మాట్లాడుతూ, ప్రభుత్వాలు మీడియాను అణచివేయడం ప్రారంభించిన నేటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ మీడియా స్వేచ్ఛను హరించేందుకు చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకోవాలన్నారు . అదే సమయంలో, కొన్ని పెట్టుబడిదారీ సంస్థలు మీడియా యాజమాన్యాన్ని స్వాధీనం చేసుకోవడం ద్వారా మీడియాను స్వాధీనం చేసుకోవడం, తమ చెప్పుచేతల్లో ఉంచుకోవాలని చూడటం ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టని అభిప్రాయ పడ్డారు . మంచి సమాజం ఏర్పడాలం మీడియాకు స్వేచ్ఛ ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ఐజెయు ప్రధాన కార్యదర్శి, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మాజీ సభ్యుడు బల్వీందర్ సింగ్ జమ్మూ, పంజాబ్ ,చండీగఢ్ జర్నలిస్ట్ యూనియన్ అధ్యక్షుడు బల్బీర్ సింగ్ జండూ, చండీగఢ్, హర్యానా జర్నలిస్ట్ యూనియన్ అధ్యక్షుడు రామ్ సింగ్ బ్రార్, రాజకీయ నిపుణుడు, పండితుడు పియారా లాల్ గార్గ్ కూడా మాట్లాడారు. ఈ సందర్భంగా సంస్థ ఉపాధ్యక్షులు జైసింగ్ చిబ్బార్, కోశాధికారి బిందుసింగ్ తదితరులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ది ట్రిబ్యూన్ ఎంప్లాయీస్ అసోసియేషన్, ప్రెసిడెంట్ అనిల్ గుప్తా మరియు పంజాబ్ అండ్ చండీగఢ్ యూనియన్ ఆఫీస్ బేరర్ సందీప్ శర్మ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర నివేదిక ను విరాహత్ అలీ సమర్పించగా, ఆంధ్ర ప్రదేశ్ నివేదిక ను జనార్ధన్ ప్రవేశ పెట్టారు.మీడియా స్వేచ్ఛ ప్రమాదంలో పడిందని దాన్ని రక్షించేందుకు మీడియా స్వేచ్ఛను కాపాడాలనే తీర్మానాన్ని జాతీయ కార్యవర్గ సభ్యులు అలపాటి సురేష్ ప్రవేశ పెట్టిన తీర్మానాన్ని సమావేశం ఏకగ్రీవంగా అమోదించింది. ఈనెల 23న సేవ్ మీడియా దినోత్సవాన్ని జయప్రదం చేయాలని కోరారు. పంజాబ్ భవన్ లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో పంజాబ్ అసెంబ్లీ స్పీకర్ కుల్తార్ సింగ్ సందువా పాల్గొని మాట్లాడుతూ సుందరమైన భారత నిర్మాణం లో మీడియా పాత్ర విడదీయరానిదని అన్నారు. దేశంలో ప్రత్యేకించి వివిధ ప్రాంతాల్లో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.
జర్నలిస్టుల భద్రతకు మీడియా కమిషన్
RELATED ARTICLES