న్యూఢిల్లీ/పాట్నా : జాబ్ స్కామ్ కేసులో లాలూప్రసాద్ సతీమణి రబ్రీదేవిని సిబిఐ అధికారులు నిలదీశారు. సోమవారం ఉదయం అధికారులు బీహా ర్ రాజధాని పాట్నాలోని లాలూ ప్రసాద్ నివాసా న్ని తమ స్వాధీనంలోకి తెచ్చుకుని ఆమెను ప్రశ్నించారు. అయితే రబ్రీదేవి ఇంటిపై తాము ఎలాంటి దాడులూ, సోదాలూ చేయలేదని అధికారులు అన్నారు. తాము ఆమెను ప్రశ్నించామని చెప్పారు. ‘భూమికి ఉద్యోగం’ అవినీతి కేసులో తదుపరి విచారణ నిమిత్తం ఆమెను ప్రశ్నించామని, చెప్పా రు. ఈ సందర్భంగా రబ్రీదేవికి, లాలూ ప్రసాద్ యాదవ్‌కు ఈ కేసులో తదుపరి విచారణ నిమిత్తం సమన్లు జారీ చేశామని సిబిఐ అధికారులు చెప్పా రు. అయితే తదుపరి వారిద్దరినీ ఈ కేసులో తిరిగి ఎప్పుడు ప్రశ్నిస్తారని అడిగినప్పటికీ అధికారులు పెదవి విప్పి సమాధానం చెప్పలేదు. ఇప్పటికే ఈ ల్యాండ్ ఫర్ జాబ్ కేసులో సిబిఐ ఈ ఇద్దరిపైనా చార్జిషీటు దాఖలు చేసింది. లాలూ ప్రసాద్ సహా ఈ కేసులో సిబిఐ 16 మందిపై కేసులు నమోదు చేసింది. వారినందరినీ నిందితులుగా కోర్టుకు చూ పించింది. అయితే ఈనెల 15వ తేదీన లాలూ సహా వారి కుటుంబ సభ్యులు సిబిఐ ప్రత్యేక కోర్టు ఎదుట హాజరు కావాల్సి ఉంది. గత ఏడాది ఆగస్టునెలలో సిబిఐ అధికారులు ఈ కేసులో పాట్నా లో, ఇతర ప్రాంతాలలో లాలూ ప్రసాద్ నివాసాలపై ఏక కాలంలో దాడులు చేశారు. 11 గంటలసేపు సోదాలు నిర్వహించారు. బీహార్‌లో నితీశ్ కుమార్ బిజెపి జట్టు వదిలేసి ఎన్‌డిఎ కూటమిపై విమర్శలు సంధించి ప్రతిపక్షాల సహాయంతో కొత్త కూటమిగా ఏర్పడి 2022 ఆగస్టు 24 న బీహార్ అసెంబ్లీలో బలనిరూపణ చేసుకున్న రోజునే లాలూ ప్రసాద్ నివాసాలపై కూడా సిబిఐ అధికారులు ఏకకాలంలో దాడులు చేయడం గమనార్హం. నితీశ్ ప్రభుత్వంలో లాలూ ప్రసాద్ కుమారుడు తేజస్వి యాదవ్ ఉపముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. 2004 కాలంలో లాలూ రైల్వే మంత్రిగా ఉండగా ఈ జాబ్ నియామకల్లా అవినీతికి పాల్పడ్డారని సిబిఐ తన చార్జిషీటులో పేర్కొంది.
ఇప్పటికే ఈ కేసులో లాలూ ప్రసాద్, రబ్రీదేవి, వారి ఇద్దరు కుమార్తెలు నిందితులుగా ఉన్నారు. లాలూ ప్రసాద్ యాదవ్ రైలేశాఖామంత్రిగా ఉన్న సమయంలో రైల్వేలో గ్రూప్ డి పోస్టులు భర్తీ చేయడంలో భారీ అవినీతికి పాల్పడ్డారని సిబిఐ కేసు పెట్టింది. “ల్యాండ్ ఫర్ జాబ్” అవినీతిగా ఈ కేసు ఇప్పటికే వెలుగులోకి వచ్చింది. అయితే “తమ రాజకీయ కుటుంబం అవిశ్రాంతంగా బిజెపికి వ్యతిరేకంగా పోరాటం కొనసాగిస్తున్న ఫలితంగానే సిబిఐ అధికారులతో తమను ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం వేధిస్తోందని బీహార్ ఉపముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ విమర్శించారు. ఆప్ పార్టీ నాయకుడు, ఢిల్లీ రాష్ట్ర మాజీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా అరెస్టును వ్యతిరేకిస్తూ ఆదివారంనాడు ప్రధానమంత్రికి ఉమ్మడిలేఖ రాసిన వారిలో నలుగురు ముఖ్యమంత్రులు, నలుగురు మాజీ ముఖ్యమంత్రులతోపాటు లాలూ ప్రసాద్, రబ్రీదేవిల కుమారుడు తేజస్వి యాదవ్ కూడా ఉన్న విషయం గమనార్హం. లాలూ ప్రసాద్ ఈ ‘ల్యాండ్ ఫర్ జాబ్స్’ అవినీతి కేసులో లాలూ తన నివాసాన్నే ఒక పెద్ద కేంద్రంగా మార్చేసి ఈ వ్యవహారాలు నడిపించారని సిబిఐ ఆరోపించింది. ఈ కేసులో ప్రశ్నించేందుకు రబ్రీదేవి సోమవారం తనకు అనుకూలంగా ఉంటుందని చెప్పడంతో తాము సోమవారంనాడు రబ్రీదేవి ఇంటికి వచ్చామని అధికారులు చెప్పారు.
ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకే…
బిజెపిపై ప్రతిపక్షాల విమర్శలు
లాలూ ప్రసాద్, రబ్రీదేవి నివాసంపై సిబిఐ దాడి చేయడాన్ని ప్రతిపక్షాలు తీవ్రగా విమర్శించాయి.అనేక ఏళ్ళ తరబడి లాలూ ప్రసాద్ కుటుంబాన్ని వేధింపులకు గురిచేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రతిపక్షాలను భయపెట్టి వారి గొంతు నొక్కేసేందుకే ఈ విధంగా దాడులకు పాల్పడుతోందని బిజెపిని విమర్శించారు. “ఇది బహిరంగ రహస్యం, సిబిఐ సహా కేంద్ర దర్యాప్తు సంస్థలు మోడీ ప్రత్యర్థులపై ప్రతీకార చర్యలకు పాల్పడుతున్నాయి, బిజెపితో పొత్తు పెట్టుకుంటామని, ఆ పార్టీలో చేరతామని అంగీకరించినవారిపై దాడులు నిలిపివేస్తునారు అని తేజస్వి యాదవ్ పాట్నాలోని తన తండ్రి నివాసం వద్ద పాత్రికేయులతో అన్నారు. తమ కుటుంబం బిజెపికి రాజకీయాలలో అతిపెద్ద శత్రువుగా ఉన్నందువల్లనే ఈ విధమైన వేధింపులు చేస్తున్నారని విమర్శించారు. తన తండ్రి లాలూకు ప్రస్తుతం ఎలాంటి అధికారాలు లేవని, ఆయన ఉద్యోగాలిచ్చి మేలూ చేసే పరిస్థితిలో లేరని సిబిఐని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్, ఆప్ పార్టీలు కూడా బిజెపిపై తీవ్ర విమర్శలు చేశాయి.
తలవంచనివారిపై దాడులు
ప్రియాంకాగాంధీ
“ఈరోజు మళ్ళీ రబ్రీదేవి, లాలూ ప్రసాద్‌ల వంతు వచ్చింది, వారిని వేధింపుకు గురి చేశారు, వారి కుటుంబాన్ని అనేక సంవత్సరాలుగా అధికారులు వేధింపులకు గురిచేస్తున్నారు, అయినాగానీ వారు తలవంచలేదు” అని ప్రియాంకాగాంధీ తన ట్వీట్‌లో విమర్శించారు. బిజెపి ఎదుట ఎవరైతే తలవంచరో వారిపై దాడులు జరుగుతున్నాయని ఆమె విమర్శించారు. ప్రతిపక్షాలు నోరెత్తకుండా వారిని కేంద్రం అణచివేస్తోందని అన్నారు. కాగా కాంగ్రెస్ అధికార ప్రతినిధి సుప్రియా న్రాటే ఢిల్లీలో పాత్రికేయులతో మాట్లాడుతూ, రబ్రీదేవి నివాసంపై సిబిఐ దాడులను ఖండించారు. 2014 నుండి దేశంలో సిబిఐ, ఇడి దాడులు ప్రతిపక్షాలపై 95 శాతం మేరకు పెరిగిపోయాయని అన్నారు.అదానీని మాత్రం ఇడి, సిబిఐ, ఆదాయ పన్ను విభాగం జాగ్రత్తగా కాపాడుతోందని విమర్శించారు. లక్షలకోట్ల మోసానికి పాల్పడిన అదానీపై ఈగ వాలనివ్వడంలేదని విమర్శించారు.
ప్రతిపక్షాలను వేధిస్తున్నారు ః కేజ్రీవాల్
ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ, ప్రతిపక్షాలను లక్ష్యంగా చేసుకుని వారిని వేధింపులకు గురి చేయడం ద్వారా పెద్ద తప్పు చేస్తున్నారని బిజెపిని విమర్శించారు. అయితే బిజెపి నాయకులు ఈ విమర్శలను తిప్పికొడుతూ, సిబిఐ తన పని తాను చేసుకుపోతోందని, ఈ విషయంలో ప్రభుత్వానికి సంబంధం లేదని బుకాయించారు. “లాలూ ప్రసాద్ అనేక సంవత్సరాలుగా సిబిఐతో సహజీవనం చేస్తున్నారు, ఇది ఈరోజు విషయం కాదు, గడ్డి కుంభకోణంలో ఆయన ప్రధాన నిందితుడు, బిజెపి అధికార రాజకీయాల్లోకి రాకముందునుండీ లాలూ ప్రసాద్ యాదవ్ అవినీతికార్యకలాపాలలో మునిగితేలుతూనే ఉన్నారు” అని బీహార్ బిజెపి నాయకుడు నితిన్ నబిన్ అన్నారు. ల్యాండ్ ఫర్ జాబ్ అవినీతి కేసులో లాలూ ప్రసాద్ కుటుంబం దాదాపు 1,05,292 చదరపు అడుగుల భూమిని పాట్నాలో సంపాదించుకుందని సిబిఐ తన చార్జిషీటులో పేర్కొంది. రైల్వే మంత్రిగా ఉండగా ఆయనకు లంచంగా నగదు ఇచ్చేబదులు లాలూ కుటుంబ సభ్యులకు ఐదు సేల్ డీడ్స్ ద్వారా గిఫ్ట్ పేరుతో రిజిస్టర్ చేశారన్న ఆరోపణలున్నాయి. ఈ విలువ రూ.4.39 కోట్లుగా పేర్కొన్నారు.
రబ్రీదేవి ఇంట్లో సిబిఐ తనిఖీలు
RELATED ARTICLES