లండన్ మీడియాతో రాహుల్‌గాంధీ
లండన్ : బ్రిటన్‌లో పర్యటిస్తున్న కాంగ్రెస్ నాయకుడు రాహుల్‌గాంధీ బిజెపి ప్రభుత్వంపై తన దాడిని మరింత ఉధృతం చేశారు. తాజాగా లండన్‌లో రాహుల్‌గాంధీ పాత్రికేయులతో మాట్లాడుతూ, “భారతదేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థలు క్రూరమైన దాడికి గురవుతున్నాయి, దేశంలో సకల ప్రజాస్వామ్య వ్యవస్థలపైన పూర్తిస్థాయీ దాడి జరుగుతోంది” అని విమర్శించారు. ఒక బలమైన ప్రత్యామ్నాయ దృక్పథంతో భారత్‌లో ప్రతిపక్షాల మధ్య ఐక్యత సాధించేందుకు చర్చలు కొనసాగుతున్నాయని చెప్పారు. “ఆర్ఎస్ఎస్, బిజెపిలను సైద్ధాంతికంగా ఓడించాల్సిన అవసరం ఉంది, ఈ విషయం ప్రతిపక్షాల మనసులలో బలంగా నాటుకుపోయింది, ఇందులో సందేహం లేదు, దీనిపై రాజీపడే ప్రశ్నేలేదు, దేశంలో మహిళలపై పెరుగుతున్న హింస, సంపద కేంద్రీకరణ, ధరల పెరుగుదల, పెరిగిపోయిన నిరుద్యోగం వంటి అంతర్గత సమస్యలపై ప్రజల్లో చాపకింద నీరులా నెలకున్న తీవ్ర ఆగ్రహానికి అనుగుణంగా ఈ ఐక్యతా చర్యలు చేపట్టాం” అని రాహుల్ అన్నారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో యుద్ధం కేవలం రాజకీయ పార్టీలమధ్య మాత్రమే కాదు, ఎవరికీ న్యాయబద్ధమైన, సమాన అవకాశాలు, స్థాయికి తగిన న్యాయం లేకపోవడానికి వ్యతిరేకంగా కూడా ఈ ఎన్నికల యుద్ధం జరగనుంది అన్నారు. కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో రాహుల్‌గాంధీ ఇంతకుముందు బిజెపి నియంతృత్వ పాలనను తన ప్రసంగంలో ఎండగట్టారు. తనతో సహా ప్రతిపక్ష నేతలపై ప్రభుత్వం పెగాసెస్ సాఫ్ట్వేర్ ఉపయోగించి నిఘా పెట్టిందని చెప్పారు. దీనిని బిజెపి తీవ్రస్థాయలో వ్యతిరేకించింది. రాహుల్‌గాంధీ బిజెపి ఎదురుదాడిని పట్టించుకోకుండా భారతదేశంలో తాజా పరిస్థితులను బ్రిటన్ మీడియాకు వివరించారు. “భారత్‌లో ప్రజల నోళ్ళు నొక్కేస్తున్నారు, ఈ విషయాలను బిబిసి ఇప్పుడు గ్రహించింది, కానీ గడచిన తొమ్మిదేళ్ళుగా విరామం లేకుండా భారత్‌లో
ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి, ఇది ప్రతి ఒక్కరికీ తెలుసు, జర్నలిస్టులను ప్రభుత్వం భయపెడుతోంది, వారంతా దాడులకు గురతున్నారు, బెదిరింపులకు గురవుతున్నారు, వారిని అరెస్టులు చేస్తున్నారు, ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేసే జర్నలిస్టులకు మాత్రమే ప్రశంసలు దక్కుతున్నాయి, అయితే ఈ దాడులు ఏ రూపంలో అయినా జరగొచ్చు, ఆ విధానం తేడాగా ఉంటుందంతే, ప్రభుత్వానికి వ్యతిరేకంగా విమర్శిస్తూ వ్రాయడం మానేస్తే పరిస్థితులు అన్నీ చక్కబడిపోతాయి, వారిపై పెట్టిన అన్ని కేసులూ మాయమైపోతాయి” అన్నారు. ‘బిబిసి ఇండియా’ న్యూఢిల్లీ, ముంబయి కార్యాలయాలపై ఇటీవల ఆదాయపన్నుశాఖ అధికారుల దాడుల దాడిని ‘దేశవ్యాప్తంగా ప్రజాగళం అణచివేత’గా ఆయన పేర్కొంటూ, ప్రజల నోళ్ళు మూయించడంకోసం అధికార బిజెపి చేస్తున్న ప్రయతాలకు వ్యతిరేకంగా గొంతు వినిపించడంకోసమే తాను దేశంలో పాదయాత్ర చేశానని, ‘భారత్ జోడో యాత్ర’ వెనుకు గల ప్రధాన కారణం ఇదేనని రాహుల్‌గాంధీ చెప్పారు. “భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థలన్నింటిపైనా క్రూరమైన దాడి జరుగుతున్న కారణంగా తప్పనిసరి పరిస్థితుల్లో తాను ఈ యాత్ర చేయవలసి వచ్చిందన్నారు. “ఇండియా ఇన్సైట్” పేరుతో లండన్‌లోని భారత జర్నలిస్టుల అసోసియేషన్ (ఐజెఎ) నిర్వహించిన ఇష్టాగోష్ఠి కార్యక్రమంలో శనివారం సాయంత్రం రాహుల్‌గాంధీ మాట్లాడుతూ ఈ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. రాజ్యాంగ వ్యవస్థలైన చట్టసభలు, కార్యనిర్వాహక వ్యవస్థ, న్యాయచట్రాలలో పనిచేసే వ్యవస్థలన్నీ దాడులకు గురి అవుతున్న పరిస్థితుల్లో తమ అభిప్రాయాలను, తమ ఆలోచనలను సర్వసాధారణమైన పద్ధతులలోప్రజలకు చెప్పడం కష్టమైపోతోందని అన్నారు.
భారత ప్రజాస్వామ్య వ్యవస్థలపై క్రూర దాడి
RELATED ARTICLES