HomeNewsBreaking Newsకార్పొరేట్‌లకు వరాలు… పేదలపై భారాలు

కార్పొరేట్‌లకు వరాలు… పేదలపై భారాలు

ధరలు పెంచి పట్టపగలే ప్రజలను దోచుకుంటున్న మోడీ ప్రభుత్వం
పెంచిన వంట గ్యాస్‌ ధరలను తగ్గించకుంటే బిజెపి పతనం తప్పదు
నిరసన ప్రదర్శనలో సిపిఐ జాతీయ, రాష్ట్ర నేతలు
ప్రజాపక్షం/హైదరాబాద్‌
కార్పొరేట్‌లకు రాయితీలతో వరాలు కురిపిస్తున్న ప్రధాని మోడీ ప్రభుత్వం పేదలపై ధరల భారాలు మోపుతున్నదని సిపిఐ జాతీయ కార్యదర్శి సయ్యద్‌ అజీజ్‌ పాషా, జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఇంధనం, వంట గ్యాస్‌, నిత్యావసర వస్తువుల ధరలను అధికంగా పెంచుతూ బిజెపి ప్రభుత్వం దేశ ప్రజలను పట్టపగలు దోచుకుంటుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొంతమంది కార్పొరేట్‌లకు అనుచిత ప్రయోజనాలు కల్పించేందుకే దేశ ంలోని సామాన్య ప్రజలపై మోయలేని ఆర్థిక భారాలను మోపుతూ వివక్షపూరిత విధానాలు అనుసరిస్తుందని విమర్శించారు. వంట, వాణిజ్య గ్యాస్‌ ధరల పెంపును నిరసిస్తూ సిపిఐ హైదరాబాద్‌ జిల్లా సమితి ఆధ్వర్యంలో గురువారం హైదరాబాద్‌లోని సత్యనారాయణరెడ్డి భవన్‌ నుండి హిమాయత్‌నగర్‌ వై జంక్షన్‌ వరకు ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సయ్యద్‌ అజీజ్‌పాషా, చాడ వెంకట్‌రెడ్డి, కూనంనేని సాంబశివరావు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వి.ఎస్‌.బోస్‌, ఇ.టి. నరసింహ, ఎన్‌.బాలమల్లేష్‌, ఎం.బాలనరసింహ,
సిపిఐ హైదరాబాద్‌ జిల్లా కార్యదర్శి ఎస్‌.ఛాయాదేవిలతో పాటు వందలాది మంది సిపిఐ శ్రేణులు ఎర్ర జండాలు, ప్లకార్డులు చేతబూని ప్రదర్శనలో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేస్తూ పెంచిన గ్యాస్‌ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్‌ చేశారు. ఈ సందర్బంగా అజీజ్‌ పాషా మాట్లాడుతూ దేశంలో నేడు ప్రజలు తమ జీవనోపాధి కోసం పోరాడుతున్న సమయంలో వంట, వాణిజ్య గ్యాస్‌ ధరలను పెంచడం ఆందోళన కలిగిస్తుందన్నారు. ఈ విషయం కోట్లాది కుటుంబాలను, చిరు వ్యాపారులను దెబ్బతీస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మోడీ హయాంలో ప్రతి వస్తువు ధర పెరగడంతో ప్రజలు జీవించలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. గ్యాస్‌ సబ్సిడీ కూడా ఎత్తివేడంతో కేంద్ర ప్రభుత్వం ఎవరికీ సహాయం చేస్తున్నట్లు కనిపించడం లేదన్నారు. కోట్లాది మంది పేద భారతీయ కుటుంబాలు గ్యాస్‌ సిలిండర్లను ఉపయోగించడం మానేయాలని, బదులుగా చాలా హానికరమైన సాంప్రదాయ కట్టెలపై వంటకు తిరిగి వెళ్లాలనే మోడీ ప్రభుత్వం ఒత్తిడి చేసే కుట్రలో ఈ గ్యాస్‌ ధరల పెంపుదల ఒక భాగమని అజీజ్‌పాషా విమర్శించారు. చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ నిత్యావసర వస్తువుల ధరలను అదుపు చేయడంలో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఫుర్తిగా విఫలమైందని విమర్శించారు. గ్యాస్‌తో పాటు ప్రతి వస్తువు ధర రికార్డు స్థాయిలో పెంచి సామాన్య ప్రజల జీవితాలను దయనీయమైన స్థితిలోకి నెడుతుందని దుయ్యబట్టారు. వంట, వాణిజ్య గ్యాస్‌ ధరల పెంపుతో గృహాలు, చిన్న వ్యాపారాలపై తీవ్రంగా ప్రభావం పడుతుందని చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. పెరిగిన ధరల మంటల్లో మోడీ సర్కార్‌ కూలిపోవడం ఖాయమని హెచ్చరించారు. కూనంనేని సాంబశివ రావు మాట్లాడుతూ 2014లో క్రూడ్‌ అయిల్‌ ధర బ్యారెల్‌కు 100 డాలర్లు ఉంటే, ప్రస్తుతం 80 మాత్రమే ఉందని, అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్‌ ఆయిల్‌ ధరలు తగ్గినా బిజెపి ప్రభుత్వం ఇంధన, గ్యాస్‌ ధరలు తగ్గించకుండా పెంచడం దారుణమన్నారు. వంట గ్యాస్‌ రూ.50, వాణిజ్య గ్యాస్‌ రూ. 350 కు పెంచి, ప్రధాని మోడీ ప్రజలను కష్టాల్లోకి నెట్టివేశారని విమర్శించారు. బిజెపి ప్రభుత్వం సామాన్యుల ప్రజల గృహ బడ్జెట్‌ను దెబ్బతీస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మోడీ సర్కార్‌ చర్యలను ప్రజలు గమనిస్తున్నారని, 2024 బిజెపి ప్రభుత్వం పతనం తప్పదన్నారు. పెంచిన వంట, వాణిజ్య గ్యాస్‌ ధరలను తక్షణమే ఉపసంహరించుకోనట్లయితే ప్రజాగ్రహం తప్పదని కూనంనేని సాంబశివ రావు కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ ప్రదర్శనలో సిపిఐ హైదరాబాద్‌ జిల్లా సహాయ కార్యదర్శులు కమతం యాదగిరి, బి.స్టాలిన్‌, ఎఐటియుసి రాష్ట్ర కార్యదర్శి బి.వెంకటేశం, శ్రామిక మహిళా ఫోరమ్‌ రాష్ట్ర కన్వీనర్‌ పి.ప్రేమ్‌ పావని, సిపిఐ హైదరాబాద్‌ జిల్లా కార్యవర్గ సభ్యులు నిర్లేకంటి శ్రీకాంత్‌, పడాల నళిని, నేతలు విజయలక్ష్మి పండిట్‌ తదితరులు పాల్గొన్నారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments