HomeNewsBreaking News‘బండ’ బాదుడుపై రోడ్డెక్కిన ప్రజానీకం

‘బండ’ బాదుడుపై రోడ్డెక్కిన ప్రజానీకం

కేంద్రంపై భగ్గుమన్న ప్రజాప్రతినిధులు

ప్రజాపక్షం/హైదరాబాద్‌ మోడీ ప్రభుత్వం పెంచిన ఎల్‌పిజి గ్యాస్‌ ధరలపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు భగ్గుమన్నాయి. సిపిఐ, సిపిఐ(ఎం), బిఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీల నాయకులు, కార్యకర్తలు గురువారం పెద్దఎత్తున నియోజకవర్గ, జిల్లా, మండల కేంద్రాలలో ఆందోళన నిర్వహించారు. ఖాళీ గ్యాస్‌ సిలిండర్‌లతో ప్రదర్శనలు జరిపారు. వెంటనే గ్యాస్‌ ధరలు తగ్గించాలని ప్రజలు పెద్దపెట్టున నినాదాలు చేశారు. పలు చోట్ల రోడ్లపై వంటలు చేసి నిరసన తెలియజేశారు. హైదరాబాద్‌లో జరిగిన ఆందోళనలో సిపిఐ జాతీయ కార్యదర్శి సయ్యద్‌ అజీజ్‌ పాషా, కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్‌ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, కార్యదర్శివర్గ సభ్యులు వి.ఎస్‌.బోస్‌, ఇ.టి.నర్సింహా, ఎన్‌.బాలమల్లేశ్‌, ఎం.బాలనర్సింహా పాల్గొన్నారు. భారీ ఆకారంలో సిలిండర్‌ బెలూన్‌తో వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. మహిళా కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షురాలు సునీతారావు ఆధ్వర్యంలో చాంద్రాయణగుట్టలో గ్యాస్‌ సిలిండర్‌కు దండ వేసి నిరసన తెలియజేశారు. వంట గ్యాస్‌ ధరల పెంపును నిరసిస్తూ బిఆర్‌ఎస్‌ నిర్వహించిన ఆందోళన కార్యక్రమాల్లో రాష్ట్ర మంత్రులు పాల్గొని వివిద రూపాల్లో కేంద్ర ప్రభుత్వానికి నిరసన తెలిపారు. మేడ్చల్‌ జిల్లా ఘట్‌కేసర్‌లో మంత్రులు సిహెచ్‌.మల్లారెడ్డి, టి.హరీష్‌రావు ఆధ్వర్యంలో జరిగిన బిఆర్‌ఎస్‌ నిరసన కార్యక్రమంలో భాగంగా వరంగల్‌ రహదారిపై బైఠాయించి వంట చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ మోడీ అంటేనే ప్రజలపై దాడి అని, పెంచిన గ్యాస్‌ ధరలు తగ్గించే వరకు నిరసనలు కొనసాగిస్తామని ప్రకటించారు. కరీంనగర్‌లో మంత్రి గంగుల కమలాకర్‌ రోడ్డుపైనే కట్టెల పొయ్యి మీద వంట చేసి నిరసన తెలియజేశారు. మహబూబ్‌నగర్‌ లోని తెలంగాణ చౌరస్తాలో మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌ ఆధ్వర్యంలో మహిళలు భారీ సంఖ్యలో ఖాళీ సిలిండర్‌లను ఉంచి ఆందోళనలో పాల్గొన్నారు. నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, సికింద్రాబాద్‌ గాంధీ విగ్రహం వద్ద మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ నిరసన కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఖైరతాబాద్‌లో జరిగిన నిరసన కార్యక్రమంలో రాష్ట్ర హోంమంత్రి మహ్మద్‌ మహమూద్‌అలీ పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లా మీర్‌పేట మున్సిపల్‌ కార్పొరేషన్‌ కార్యాలయం వద్ద జరిగిన నిరసన ప్రదర్శన, ధర్నాలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు. నిత్యావసర వస్తువుల ధరలను పెంచుతూ ప్రజలపై భారాలు మోపుతున్నారని మంత్రులు ఈ సందర్భంగా విమర్శించారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments