HomeNewsBreaking Newsమెరుస్తున్న ఎర్ర బంగారం

మెరుస్తున్న ఎర్ర బంగారం

క్వింటా రూ.21వేల పైమాటే
తగ్గుతున్న తెల్ల బంగారం ధర
మొక్కజొన్న పైనే రైతుల ఆశలు
ప్రభుత్వమే కొనుగోలు చేయాలని వినతి
ప్రజాపక్షం/ ఖమ్మం
వ్యవసాయం జూదంగా మారింది. ఏ పంట పండుతుందో, దేనికి ధర ఉంటుందో తెలియని దయనీయ స్థితి. పండితే ధర ఉండదు. ధర ఉం టే దిగుబడి రాదు ఇది ఇప్పటి పరిస్థితి. ప్రస్తు తం ఎర్ర బంగారం (మిర్చి) ధర ఘాటెక్కుతుం ది. క్వింటా రూ.21,000 పైమాటే. రూ. 19000 నుంచి క్రమేపి పెరుగుతూ వచ్చింది. భవిష్యత్తులో మరింత ధర పెరిగే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. ఖమ్మంజిల్లాలో 80వేల ఎకరాల్లో మిర్చి పంటను సాగు చేశారు. ఇప్పుడు ఖమ్మం, ఎనుమాముల మార్కెట్‌లలో మిర్చి క్వింటా ధర రూ.21,000 పైగా పలు కు తుంది. మంగళవారం ఖమ్మంలో రూ. 21,600 ధర పలికింది. ధర ఆశాజనకంగా ఉన్న దిగుబడి మాత్రం రైతుల్లో తీవ్ర నిరాశ నింపింది. ఈ ఏడాది మొక్క నాటిన దగ్గర నుండి రైతులు
తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అతివృష్టి కారణంగా మిరప మొక్కలు బతక లేదు. అష్ట కష్టాలు పడి తోటలను సాకితే ఎర్రనల్లితో కోలుకోలేని దెబ్బతిన్నది. దిగుబడి గననీయంగా తగ్గిపోగా పెట్టుబడి రేట్టింపు అయింది. ఎకరాకు 10 నుంచి 15 క్వింటాళ్లకు మించి దిగుబడి రాని పరిస్థితి. పత్తి పంటను సాగు చేసిన రైతులకు మాత్రం ఈ ఏడాది నష్టాలే మిగిలే పరిస్థితి నెలకొన్నది. అతివృష్టి కారణంగా దిగుబడి తగ్గిందని బాధపడుతున్న రైతులకు పత్తి ధర మరింత నిరాశ మిగిల్చింది. రైతుల వద్ద పత్తి లేనప్పుడు క్వింటా రూ. 9వేల వరకు ధర పలికిన పత్తి ఇప్పుడు క్వింటా రూ. 7,500 అయినప్పటికీ ఒకట్రెండు క్వింటాళ్లను మాత్రమే ఆ ధరకు కొనుగోలు చేస్తున్నారని క్వింటా రూ. 6వేల నుంచి రూ. 7వేల మధ్యనే ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారని రైతులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. సగం మంది రైతులకు పెట్టుబడులు కూడా తిరిగి రాలేదు. మరో పంట మొక్కజొన్న పైనే రైతులు ఆశలు పెంచుకున్నారు. నీటి వసతి కలిగిన భూముల్లో రైతులు ఎక్కువగా మొక్కజొన్న పంటను సాగు చేశారు. ఒక్క ఖమ్మం జిల్లాలోనే దాదాపు లక్ష ఎకరాల్లో మొక్కజొన్న పంట సాగు చేశారు. మక్కల ద్వారా క్వింటా ఒక్కింటికి రూ. 2300 పలుకుతుంది. పంటను చూస్తుంటే దిగుబడి కూడా బాగానే ఉండవచ్చునని రైతులు అభిప్రాయపడుతున్నారు. అయితే మక్క కొనుగోళ్లను ప్రభుత్వం నిలిపివేసింది. పంట చేతికొచ్చే దశలో ప్రైవేటు వ్యాపారులు మక్కల ధర తగ్గించే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ ఏడాది కూడా మక్కలను ప్రభుత్వమే కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. ఇదిలా ఉండగా మిర్చి రానున్న రోజుల్లో మరింత ధర పెరగనుందన్న సమాచారంతో వ్యాపారులు పెద్ద మొత్తంలో రైతుల వద్ద మిర్చి కొనుగోలు చేసి శీతల గిడ్డంగులలో నిల్వ చేస్తున్నారు. అనుకున్నట్లే జరిగితే పండించిన రైతు కన్న నిల్వ చేసిన వ్యాపారికే ఎక్కువ మిగులుబాటు ఉంటుందేమో.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments