అర్బన్ ప్రాంతాల్లో నివసిస్తున్న వారి వివరాలను నియోజకవర్గాల వారీగా సేకరించి పంపండి : కలెక్టర్లకు సిఎస్ శాంతికుమారి ఆదేశం
ప్రజాపక్షం/హైదరాబాద్ రాష్ర్టంలో నిరుపేదలకు భూమి పట్టాలను ప్రధానం చేయడానికి అర్బన్ ప్రాంతాల్లో ప్రభుత్వ భూములు, నివాసం ఉంటున్న వారి వివరాలను శాసన సభ నియోజక వర్గాల వారీగా సేకరించి వెంటనే ప్రభుత్వానికి పంపాలని కలెక్టర్‌లకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఆదేశించారు. ప్రభుత్వ ఉత్తర్వులు 58, 59, 76, 118ల కింద లబ్ధిదారుల ఎంపిక పూర్తైన వారికందరికి రిజిస్ట్రేషన్ లను వెంటనే చేపట్టి పూర్తి చేయాలని అన్నారు. కంటి వెలుగు, ఇంటి స్థలాల ఎంపిక, పోడు భూముల కేటాయింపు, హరిత హారం తదితర అంశాలపై గురువారం నాడు జిల్లా కలెక్టర్లతో సి.ఎస్ శాంతి కుమారి బి.ఆర్.కె.ఆర్ భవన్ నుండి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కంటి వెలుగు కార్యక్రమం మే నెలాఖరు వరకు జరుగుతుందని, ఈ కార్యక్రమంలో లబ్దిదారులకు అందించే ప్రిస్క్రిప్షన్ ఆధారంగా ఇచ్చే కంటి అద్దాల పంపిణీలో జాగ్రత వహించాలని సూచించారు. వేసవి ఎండలు తీవ్ర మవుతున్ననందున కంటి వెలుగు పరీక్ష శిబిరాల వద్ద మంచినీటి సరఫరా, నీడకై టెంటులు ఏర్పాటు చేయాలని సూచించారు. పోడు భూములకు సంబంధించి యాజమాన్య పట్టాలను అందించేందుకు జిల్లా స్థాయి కమిటీలో ఆమోదం పొందిన వాటికి పాస్ పుస్తకాల తయారీని చేపట్టాలని చెప్పారు. తెలంగాణకు హరిత హారం కార్యక్రమంలో భాగంగా 2023 -24 సంవత్సరంలో పెద్ద ఎత్తున మొక్కలు నాటేందుకు గాను వెంటనే కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని కలెక్టర్లను ఆదేశించారు. జిల్లాలో పూర్తైన సమీకృత జిల్లా కలెక్టరేట్ కార్యాలయాల్లోకి అన్ని ప్రభుత్వ కార్యాలయాలను తరలించే ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్, పంచాయితీ రాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, రెవిన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్, గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి క్రిస్టినా చోంగ్తు, రోడ్లు భవనాల శాఖ కార్యదర్శి శ్రీనివాస రాజు, వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వి, పిసిసిఎఫ్ డోబ్రియల్, తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ప్రభుత్వ భూముల వివరాలివ్వండి
RELATED ARTICLES