70 ఏళ్లుగా వస్తున్నదే అమలు చేస్తున్నాం
కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారమన్
ప్రజాపక్షం / హైదరాబాద్ రాష్ట్రాల రుణాలపై పరిమితి విధించడం కొత్తేగా వచ్చింది కాదని, 70 ఏళ్ళ నుండి వస్తున్నదే తాము అమలు చేస్తున్నామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం వసూలు చేసిన సెస్‌లు, సర్ ఛార్జీల వసూలు గురించి ఇప్పటికే తాను పార్లమెంటులో జవాబు చెప్పానని, ఎవరైనా ప్రశ్నిస్తే పార్లమెంటులో చెప్పింది నిజం కాదా? అని జర్నలిస్టులు ప్రశ్నించాలని సూచించారు. అమృత్ కాల్ బడ్జెట్ డైలాగ్స్ పేరుతో కేంద్ర బడ్జెట్ 2023- 24పై దూరదర్శన్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని హెచ్‌ఐసిసిలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌తో మంగళవారం నాడు చర్చాగోష్ఠి నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు అడిగిన ప్రశ్నలకు ఆమె సమాధానమిచ్చారు. రాష్ట్రాలను రుణాలు తీసుకోనివ్వకుండా కేంద్ర ప్రభుత్వం అడ్డుపడుతున్నదనే విమర్శలపై స్పందిస్తూ రాజ్యాంగంలోని 293 అధికరణప్రకారమే తాము రుణాలు పరిమితిలోపు ఉండేలా చూస్తున్నామన్నారు. ఇది కొత్తేమి కాదని, అప్పుల గురించి ఎవరో ఒకరు చూడాలని, రాజ్యాంగం ప్రకారం అది కేంద్రమే చూడాల్సి ఉంటుందని చెప్పారు. 15వ ఆర్థిక సంఘం సిఫార్సు చేసిన 41 శాతం టాక్స్ డివల్యూషన్‌లో రాష్ట్రాలకు కేవలం 29 శాతమే వస్తున్నాయని రాష్ట్రాలు అంటున్నాయని, మిగతా 11 శాతం సెస్, సర్ ఛార్జ్‌ల రూపంలో కేంద్రం పంపిణీ చేయకుండా తన ఖాతాలో వేసుకుంటున్నాయని ప్రశ్నకు ఆమె జవాబిచ్చారు. తాము రాష్ట్రాలకు ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువే ఇచ్చామని, కేంద్ర సంచిత నిధిలో చేరిన మొత్తం నుండి విద్య, వైద్యం సెస్‌ల రూపంలో వసూలు చేసిన దానికంటే ఎక్కువే పంపిణీచేసామన్నారు. అయినా దీనిపై ఇప్పటికే పార్లమెంటులో సమాధానమిచ్చానని, పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో అత్యున్నత స్థానమైన పార్లమెంటులో చెప్పింది నిజం కాదా? అని దీనిపై ప్రశ్నించే వారిని నిలదీయాలని జర్నలిస్టులకు సూచించారు.
5 ట్రిలియన్‌లు జోక్ కాదు
దేశం 2022 నాటికి 5 ట్రిలియన్ డాలర్ల్ ఎకానమి అవుతుందని కేంద్రం చెప్పిన విషయం జోక్ కాదని, సిఎం గారు దయచేసి దీనిపై జోక్ చేయవద్దని తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ను ఉద్దేశించి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యానించారు. జోక్ అని వెటకారంగా మాట్లాడితే ప్రజలను వెక్కిరించినట్లవుతుందన్నారు. 5 ట్రిలియన్ ఎకానమి అయ్యేందకు తమ వంతుగా ఇంత చేస్తామని రాష్ట్రాలు మందుకు వస్తున్నాయన్నారు. మరి మీ దగ్గర 2014లో రూ.60వేల కోట్ల అప్పు ఉంటే, ఇప్పుడు రూ.3.5లక్షల కోట్లకు చేరిందని అన్నారు. 5 ట్రిలియన్ విషయంలో సిఎం బాధ్యతగా మాట్లాడితే మంచిదన్నారు. తెలంగాణక కేంద్రం నుండి 2014 నుండి -23 వరకు రూ.1.23 లక్షల కోట్లు టాక్స్ డెవల్యూషన్ ద్వారా వచ్చాయని, గ్రాంట్స్ అండ్ ఎయిడ్ కింద రూ. 1.39 లక్షల కోట్లు వచ్చాయని తెలిపారు. తెలంగాణకు 150 మెడికల్ కాలేజీలలో ఒక్కటి రాలేదనడం సరైంది కాదని, తాము మెడికల్ కాలేజీ జిల్లాల పేర్లు ఇవ్వాలని కోరితే ఖమ్మం, కరీంనగర్ జిల్లాల పేర్లను రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందని, అప్పటికే ఆ రెండు చోట్ల మెడికల్ కాలేజీలు ఉన్నాయని చెప్పారు. అవి కాకుండా వేరే పేర్లు ఇవ్వాలని కోరితే రాష్ట్ర ప్రభుత్వమే ఇవ్వలేదని ఆరోపించారు. ఉపాధి హామీపథకం నిధులు తగ్గించమనడం సరైంది కాదని, తాము ప్రతి సారి బడ్జెట్‌లో కేటాయించిన దాని కంటే చివర్లో ఎక్కువే ఖర్చు చేసామని తెలిపారు. మైనారిటీ సంక్షేమానికి, స్కాలర్‌షిప్పులకు తక్కువ కేటాయించినట్లు భావించవద్దని, వారికి ఇతర స్కాలర్ షిప్పుల్లో కూడా వాటా ఉందన్నారు.