HomeNewsBreaking Newsవిఆర్‌ఎల గోడు పట్టదా?

విఆర్‌ఎల గోడు పట్టదా?

రెండేళ్ల నుండి హామీలు, చర్చలే కానీ అమలు లేదు
50 మంది ప్రాణాలు కోల్పోయినా చలించని ప్రభుత్వం

ప్రజాపక్షం/నెక్కొండ గత బడ్జెట్‌ సమావేశాల్లో అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు విఆర్‌ఎలకు ఇచ్చిన అన్ని హామీలు అమలు చేసి 23000 మంది జీవితాల్లో వెలుగులు నింపాలని వేయి కళ్ళతో విఆర్‌ఎలు ఎదురుచూస్తున్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎన్నైతే వినూత్న ధర్నాలు నిరసనలు చేసారో తెలంగాణ ఆవిర్బావం తర్వాత ఉద్యమ నేత ముఖ్యమంత్రిని ఆదర్శంగా తీసుకొని కేవలం విఆర్‌ఎలు మాత్రమే అంత పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రం లో మొట్టమొదటిసారిగా ఉద్యమం చేసారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 23000 మంది విఆర్‌ఎలు ఉన్నారు. ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌ రావు కొత్త రెవెన్యూ చట్టం తీసుకువస్తూ అసెంబ్లీ సాక్షిగా విఆర్‌ఎలు అందరినీ పే స్కెల్‌ ఎంప్లాయిస్‌గా గుర్తిస్తామని, అర్హులకు పదోన్నతులు కల్పిస్తామని, 55 సంవత్సరాలు నిండిన విఆర్‌ఏ వారసులకు ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చి 2 సంవత్సరాలు పూర్తి అయ్యి, రాష్ట్ర వ్యాప్తంగా విఆర్‌ఏలు 80 రోజులు సమ్మె చేసి 50 మంది విఆర్‌ఏలకు పైగా మరణించారు. మునుగోడు ఎన్నికల కోడ్‌ ఉంది ఎన్నికల కోడ్‌ ముగియగానే జీవోలు విడుదల చేస్తాము అని విఆర్‌ఏలతో సమ్మె విరమింపజేశారు. పలుమార్లు మంత్రి కెటిఆర్‌ చర్చలు జరిపినప్పటికి నేటి వరకు విఆర్‌ఏల ఏ ఒక్క సమస్య కూడా పరిష్కరించలేదు. విఆర్‌ఓ వ్యవస్థ రద్దు ద్వారా 5 సంవత్సరాల సర్వీస్‌ పూర్తి అయితే విఆర్‌ఓకి సమానమైన జూనియర్‌ అసిస్టెంట్‌ స్కేల్‌ పదోన్నతి రావాలి. కానీ ఉమ్మడి వరంగల్‌ జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా విఆర్‌ఎలు ఫైనల్‌ పబ్లికేషన్‌ అయ్యి పదోన్నతులు కోల్పోయారు. ప్రస్తుతం విఆర్‌ఓ వ్యవస్థ రద్దు చేయడం వలన ఆ విధులు విఆర్‌ఎలు చేస్తున్నారు. ఉద్యోగ, ఆర్ధిక, మానసిక బాధతో ఎంతో మంది విఆర్‌ఎలు మరణిస్తున్న ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరేత్తినట్టు ప్రవర్తిస్తుంది. 24 ఫిబ్రవరి 2017 ముఖ్యమంత్రి ప్రగతి భవన్‌కు విఆర్‌ఎలను పిలిపించుకొని డైరెక్ట్‌ రిక్రూట్మెంట్‌ విఆర్‌ఏలను ఇతర శాఖలకు పంపిస్తూ రెగ్యులరైజ్‌ చేస్తామని, వారసత్వ విఆర్‌ఏలకు డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లు ఇస్తామని హామీ ఇచ్చారు. 2020 సెప్టెంబర్‌ 9న ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌ రావు కొత్త రెవెన్యూ చట్టం తెస్తూ విఆర్‌ఓ వ్యవస్థ రద్దు చేస్తూ అసెంబ్లీ సాక్షిగా నిండు అసెంబ్లీ లో విఆర్‌ఏ లను అందరినీ పే స్కెల్‌ ఎంప్లాయిస్‌ గా గుర్తిస్తామని, అర్హులకు పదోన్నతులు ఇస్తామని, 55 సంవత్సరాలు నిండిన విఆర్‌ఏ వారసులకు ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు. 2022 మార్చ్‌ 15 వ తేదీన మళ్ళీ అసెంబ్లీలో విఆర్‌ఏ లలో విద్యాధికులు ఉన్నారు. అర్హతను బట్టి పదోన్నతులు ఇస్తాము, వారి సమస్యలు పరిష్కరిస్తాము, అని మరోసారి హామీ ఇచ్చారు. ప్రభుత్వం స్పందించక పోవడంతో 2022 ఫిబ్రవరి 22 వ తేదీన ఇందిరా పార్క్‌ వద్ద 15000 విఆర్‌ఏలతో అతి పెద్ద ధర్నా చేసారు. 2022 జులై 20 నుండి 24 వ తేది వరకు నాలుగు రోజులు జిల్లా కలెక్టర్‌ కార్యాలయాల ముందు రాష్ట్రం మొత్తం విఆర్‌ఏలు రిలే నిరాహార దీక్షలు చేసారు. 25 నుండి నిరవధిక సమ్మె ప్రారంభించారు. దాదాపు రెండు నెలలు వినూత్న నిరసనలు తెలుపుతూ సమ్మె చేసిన తర్వాత 13 సెప్టెంబర్‌, 2022న 10,000 మంది విఆర్‌ఏలతో అసెంబ్లీ ముట్టడి చేశారు. అదే రోజు కెటిఆర్‌ విఆర్‌ఏ నాయకులను పిలిచి స్వతంత్ర భారతదేశ వజ్రోత్సవాలు జరుగుతున్నాయి. అవి అయిపోయాక మీ సమస్యలు అన్ని పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. విఆర్‌ఏలు సమ్మె ఉధృతం చేస్తూ మునుగోడులో నామినేషన్‌లు వేయడం మొదలుపెట్టారు దీనితో ప్రభుత్వం స్పందించి సిఎస్‌ సోమేశ్‌ కుమార్‌ విఆర్‌ఏ నాయకులను ట్రెసా ఆధ్వర్యంలో పిలిపించి ఎలక్షన్‌ కోడ్‌ ముగిసాకా మీకు సంబంధించిన జీవోలు విడుదల చేస్తాము అని హామీ ఇవ్వడం జరిగింది. సమ్మెలో భాగంగా పే స్కేల్‌ జాతర, 48 గంటలు నిరవధిక దీక్షలు, భిక్షాటన, పాదయాత్ర, అర్ధ నగ్న ప్రదర్శన, వంటావార్పు మొదలైన వినూత్న నిరసనల ద్వారా 80 రోజులు సమ్మె చేసి 40 మంది విఆర్‌ఏల ప్రాణాలు కోల్పోయి, కొందరు ఆత్మహత్యాయత్నం చేశారు. విఆర్‌ఏలు అక్టోబర్‌ 12న సమ్మె విరమించడం జరిగింది. అసెంబ్లీ శీతకాల సమావేశాలు ఉన్నాయని మంత్రి కెటిఆర్‌ 21 డిసెంబర్‌ 2022 రోజున మరోసారి జెఎసి నాయకులతో చర్చలు జరిపినా ప్రయోజనం లేకుండా పోయింది. ఇప్పటికీ సమ్మె విరమించి మూడు నెలలు గడిచినా, సమ్మె కాలపు వేతనాలు చెల్లిస్తామని అందులో కూడా ప్రభుత్వం నుండి ఎటువంటి స్పందన లేదు. ఇన్నిసార్లు ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారులు అందరూ హామీ ఇచ్చిన ఇప్పటి వరకు హామీలు నెరవేరలేదు. అసెంబ్లీ సాక్షిగా 9 ఏళ్ల పాలనలో ముఖ్యమంత్రి ఇచ్చిన ప్రతి హామీ ఇలాగే ఉంటుందా? అనే సందేహాలు ముఖ్యమంత్రి హామీలపై ప్రజలకు కలుగుతున్నాయి. ఇదేనా బంగారు ? తెలంగాణ ఇలాగే ఉంటుందా ? కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రం ఇందుకోసమేనా ? కొందరి కోసమేనా అనే సందేహాలు ప్రజలకు కలుగుతున్నాయి.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments