అసెంబ్లీలో అధికార, విపక్షాల మధ్య వాడివేడి చర్చ
ధరణి పోర్టల్ సమస్యలకు, వివాదాలకు నెలవైంది : శ్రీధర్‌బాబు
చిన్న లోపం జరిగితే మొత్తానికే ఆపాదిస్తారా : మంత్రి కెటిఆర్
ప్రజాపక్షం/హైదరాబాద్ ధరణి అంశంపై శాసనసభలో వాడివేడి చర్చ జరిగింది. భూ సమస్యలపై మంత్రులు కెటి.రామారావు, కాంగ్రెస్ సభ్యులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు మధ్యవాదోపవాదనలు జరిగాయి. శాసనసభలో గురువారం రెవెన్యూపద్దుపై జరిగిన చర్చలో కాంగ్రెస్ సభ్యులు శ్రీధర్‌బాబు మాట్లాడుతూ ధరణి పోర్టల్ అనేక సమస్యలకు, వివాదాలకు కారణమవుతోందని, ఇప్పటికే భూమి విషయంలో నలుగురు ఆత్మహత్య చేసుకున్నారన్నారు. దీనిపైన మంత్రి కెటి. రామా రావు స్పందించారు.
ప్రగతిభవన్‌ను బాంబులతో కాల్చడం..‘ధరణి’రద్దు కాంగ్రెస్ వైఖరా?: కెటిఆర్
ఎక్కడో ఒక చిన్న లోపం జరిగితే దానిని ప్రసారమాధ్యమాల్లో భూతద్దంలో పెట్టి చూపిస్తున్నారని, ఒకటి,రెండు లోపాలు జరిగితే రాష్ట్రమంతా
గందరగోళం నెలకొన్నదనడం సరికాదని కెటిఆర్ అన్నారు. ధరణితో రైతులకు ఏ లాభం లేదని,రద్దు చేస్తామని, కాంగ్రెస్ హయాంలో లంచం లేకుండా రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు చేయకుండా రైతులను రాక్షసంగా ఇబ్బంది పెట్టినట్లే, ఇప్పుడు కూడా ఇబ్బంది పెట్టాలని చూస్తున్నామని శ్రీధర్ బాబు చెప్పదలుచుకున్నారా? అని కెటిఆర్ ప్రశ్నించారు. రైతులను పీడించడం, వారి పట్ల కర్కశకంగా వ్యవహరించడమే ‘మీ’ విధానమా? అని ప్రశ్నించారు. ఆధారాలు లేకుండా నిందారోపణలు చేయడం సరికాదన్నారు. కాంగ్రెస్ నాయకులను ప్రజలు పట్టించుకోవడం లేదని, ఎన్నికల్లో వారికి డిపాజిట్లు కూడా రావడం లేదన్నారు. ప్రగతి భవన్‌ను పేల్చేయాలని వారి అధ్యక్షుడు దుర్మార్గంగా మాట్లాడుతున్నారని, ఆ వ్యాఖ్యలను సమర్థిస్తూ ఇక్కడ వారి సభ్యురాలు మాట్లాడుతారని, అసలు కాంగ్రెస్ పార్టీకి ఒక వైఖరంటూ ఉన్నదా? లేదా? స్పష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అధ్యక్షుడికి, నాయకులకు సమన్వయం లేకపోతే తమకు సంబంధం లేదని, ధరణిని ఎత్తివేయడం మీ ఉద్దేశమా?, ప్రగతి భవన్‌ను బాంబులతో పేల్చేయాలనడం ఒక సిద్ధాంతమా..? ఇది కాంగ్రెస్ పార్టీ వైఖరా..? ఇంత అరాచకంగా, అడ్డగోలుగా మాట్లాడొచ్చా..? అధ్యక్షుడి మాటలను సమర్థిస్తూ వారి సభ్యురాలు మాట్లాడొచ్చా..? అని కెటిఆర్ మండిపడ్డారు. అందుకే కాంగ్రెస్ పార్టీ ఎక్కడా కాకుండా పోతుందని, ఇకనైన వారి వైఖరి మార్చుకోవాలి సూచించారు.
దీంతో సిఎల్‌పి నేత మల్లు భట్టి విక్రమార్క స్పందిచగా అందుకు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. పద్దుపైన చర్చలో పాల్గొనే వారే సమాధానం చెప్పాలని, ఇద్దరికి అవకాశం ఎలా ఇస్తారనడంతో శ్రీధర్‌బాబు మాట్లాడుతూ తమ నోరు నొక్కుతున్నారన్నారు. ధరణి పోర్టల్‌లో అనేక కాలమ్స్‌ను తొలగించారని అందుకే ధరణిని రద్దు చేయాలన్నారు. అందుకు మంత్రి వేములప్రశాంత్ రెడ్డి స్పందిస్తూ పాత రోజులే రావాలని, లంచాలు కావాలని కోరుకుంటున్నారా?, ప్రగతిభవన్ వ్యాఖ్యలపైన కూడా స్పందించాలన్నారు.
ప్రభుత్వం విఫలమైతే మరో వ్యవస్థ పుట్టుకొస్తది: భట్టి:
ఆ తర్వాత సిఎల్‌పి నేత మల్లు భట్టి విక్రమార్క ప్రతిస్పందిస్తూ ధరణిలో తొలగించిన మిగతా కాలమ్స్‌ను పెట్టాలన్నారు. సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలమైతే ఇంకో వ్యవస్థ పుట్టుకొస్తుందని, ఆ వ్యవస్థ రావడం మంచిది కాదన్నారు.
ఫార్మ కంపెనీలకు భూములు అమ్ముకున్నారు..
ఆ తర్వాత శ్రీధర్‌బాబు తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ మాజీ సైనికులు, స్వాతంత్య్రసమరయోధుల ఆధార్‌కార్డులను రిజిస్ట్రేషన్‌కు అనుసంధానం చేయకపోవడంతో ఆ భూములు వారి వారసలుకు బదిలీ కావడం లేదన్నారు. ఫార్మసిటీ నిమిత్తం ప్రభుత్వం ఎకరానికి రూ ఒక లక్ష చొప్పున భూ సేకరణ చేపట్టిన ప్రభుత్వం, కోటీన్నర రూపాయలకు ఫార్మ కంపెనీలకు ఆ భూములను అమ్ముకుంటుందని ఆరోపించారు. భూపాలపల్లిలో జర్నలిస్టులకు కేటాయించిన స్థలాలకు చెందిన పట్టాలను అక్కడి కలెక్టర్ రద్దుచేశారని, ఆ భూములను తిరిగి జర్నలిస్టులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
బ్లాక్ మెయిల్‌కు పాల్పడుతున్న కాంగ్రెస్ అధ్యక్షుడు: కెటిఆర్
శ్రీధర్‌బాబు వ్యాఖ్యలపై కెటిఆర్ ప్రతిస్పందిస్తూ హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా భూములపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి వద్ద ఒక దఫ్తర్ నడుస్తోందన్నారు. ఒక ప్రత్యేక కార్యాలయంలో రిటైర్డ్ తహసిల్దార్లతో సహా కొంతమందిని కూర్చోబెట్టుకుని ప్రభుత్వాన్ని, ప్రయివేటు వ్యక్తులను బ్లాక్ మెయిల్ చేసి కోట్లాది రూపాయాలు వసూళ్లు చేసే వారికి ధరణి వల్ల ఇబ్బందిగా ఉంటుందన్నారు. ఫార్మా సిటీలో ఇప్పటి వరకు ఎకరం కాదు కదా, గజం కూడా కేటాయించలేదని, తెలువకపోతే తెలుసుకోవాలని ఆయన శ్రీధర్ బాబుకు సూచించారు. సభను తప్పుదోవ పట్టించేలా సత్య దూరమైన మాటలు మాట్లాడుతూ, ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం సరికాదన్నారు. ఫార్మాసిటీలో ఒక గజం భూమి అమ్మినట్లు రుజువు చేయగలుగుతారా? అని సవాల్ విసిరారు. శ్రీధర్‌బాబు తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని కెటిఆర్ సూచించారు. అయితే అయితే శ్రీధర్‌బాబు తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోకపోవడంతో ఆయన వ్యాఖ్యలను రికార్డ్‌లో నుంచి తొలగిస్తున్నట్టు స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు.