జోడుగుర్రాళ్లా సంక్షేమం, అభివృద్ధి పథంలో ప్రభుత్వం
తెలంగాణ అభివృద్ధి మోడల్‌పై దేశవ్యాప్తంగా చర్చ
పెట్టుబడులకు స్వర్గధామంగా, ప్రపంచస్థాయి సంస్థలకు గమ్యస్థానంగా, ఐటికి మేటి రాష్ట్రంగా…
2,21,774 ఉద్యోగాల నియామకం చరిత్రలో అపూర్వ ఘట్టం
అసెంబ్లీ ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై ప్రసంగం
ప్రజాపక్షం/హైదరాబాద్ సంక్షేమం, అభివృద్ధి జోడుగుర్రాలుగా తన ప్రభుత్వం ప్రగతి పథంలో వేగంగా పయనిస్తోందని, ఎనిమిదిన్నరేళ్ల వయసున్న తెలంగాణ రాష్ట్రం, యావత్ దేశానికే ఆదర్శప్రాయంగా నిలుస్తోందని గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ అన్నారు. తెలంగాణ అభివృద్ధి మోడల్‌పై చర్చ దేశ వ్యాప్తంగా,ఇదే స్ఫూర్తి,నిబద్థతతో తన ప్రభుత్వం ముందుకు సాగుతందని ప్రజలకు హామీనిచ్చారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఉభయ సభలనుద్ధేశించి గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ ప్రసంగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సాధిస్తున్న సమ్మిళిత సమగ్రాభివృద్ధి యావత్ దేశానికి ఆదర్శప్రాయంగా నిలుస్తున్నదన్నారు. ప్రతి రంగంలోనూ దేశం ఆశ్చర్యపోయేలా అద్భుతమైన ప్రగతిని ఆవిష్కరిస్తూ పురోగమిస్తున్నదన్నారు. ఒకప్పుడు కరెంటు కోతలతో అంధకారంలో కొట్టుమిట్టాడిన తెలంగాణ ,ప్రభుత్వ అవిరళ కృషితో నేడు 24 గంటల విద్యుత్ సరఫరాతో వెలుగు జిలుగుల రాష్ట్రంగా విరాజిల్లుతున్నదని తెలిపారు. తాగునీటి కోసం తల్లడిల్లిన పరిస్థితుల నుంచి పూర్తిగా బయటపడి, 100 శాతం గ్రామాల్లో ఇంటింటికీ ఉచితంగా స్వచ్ఛమైన, సురక్షితమైన జలాలను సరఫరా చేస్తున్నదని వెల్లడించారు. పెట్టుబడులకు స్వర్గధామంగా, ప్రపంచ స్థాయి సంస్థలకు గమ్యస్థానంగా, ఐటి రంగంలో మేటి రాష్ట్రంగా ప్రగతిపథంలో పరుగులు పెడుతున్నదని, పర్యావరణ పరిరక్షణలోనూ, పచ్చదనం పెంపుదలలోనూ ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్నదన్నారు. గురుకుల విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ చాటుతున్నారన్నారు. రూ.11వేల కోట్ల వ్యయంతో 7.3 లక్షల యూనిట్ల గొర్రెల పంపిణీ చేపట్టిందని, మాంసం ఉత్పత్తిలో తెలంగాణ దేశంలోనే 5వ స్థానంలో నిలిచిందన్నారు. యాదాద్రి- పునర్నిర్మాణం చారిత్రాత్మక అద్భుతమన్నారు. నూతన సచివాలయ నిర్మాణానికి డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ పేరును పెట్టినందుకు గవర్నర్ తమిళిసై రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినంధించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాలను, అభివృద్ధి కార్యక్రమాలు గవర్నర్ వివరించారు.
జిఎస్‌డిపిలో 18.2 శాతం వ్యవసాయం రంగానిదే
రాష్ట్ర జిఎస్‌డిపిలో 18.2 శాతం వ్యవసాయ రంగం నుంచే సమకూరుతుందని గవర్నర్ తమిళి సై అన్నారు. 2014-15లో తెలంగాణలో కేవలం 20 లక్షల ఎకరాల సాగునీటి సౌకర్యాలు ఉండేవని, ఆ సౌకర్యాలు ఇప్పడు 73.33లక్షల ఎకరాలకు పెరిగిందని, దీనిని కోటి ఎకరాలకు మించి సాగునీటిని సమకూర్చే లక్ష్యాన్ని సాధించేందుకు ప్రభుత్వం దృడ నిశ్చయంతో ఉన్నదని, ఈ లక్ష్యం త్వరలోనే సాకారం అవుతుందని ఆశాభావం వ్యక్తం శారు. 2014-15లో తెలంగాణ తలసరి విద్యుత్ వినియోగం 1356 యూనిట్లు మాత్రమే ఉండేదని, 2021 -22 నాటికి 2126 యూనిట్లకు పెరిగిందని గవర్నర్ తెలిపారు
పెరిగిన ఆదాయం
2014-15లో రూ.62 వేల కోట్లుగా ఉన్న రాష్ట్ర ఆదయం, ప్రభుత్వ కృషితో 2021 నాటికి రూ.1,84,000 కోట్లకు పెరిగిందని గవర్నర్ తెలిపారు. రాష్ట్రం సిద్ధించేనాటికి రూ.లక్షా 24 వేలుగా ఉన్న తలసరి ఆదాయం, 2022-23 నాటికి రూ.3.17 లక్షలకు చేరిందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అన్ని రంగాల్లోనూ అభివృద్ధి రెట్టింపుస్థాయిలో జరిగిందన్నారు.
2,21,774 ఉద్యోగ నియామకాలు
రూ.3.31 లక్షలకు పైగా పెట్టుబడులు
రాష్ట్ర ప్రభుత్వం మొత్తంగా 2,21,774 ఉద్యోగ నియామకాలను చేపట్టడం తెలంగాణ చరిత్రలో ఒక అపురూపమైన ఘట్టమని గవర్నర్ తమిళి సై చెప్పారు. ఇంత కష్టకాలంలో కూడా రాష్ట్రంలో కొలువుల జాతర కొనసాగుతోందన్నారు. 2014 నుంచి 2022 ఫిబ్రవరి వరకు 1,41,735 ప్రత్యక్ష ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగిందని, వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 80,039 ఉద్యోగాలను ఒకేసారి భర్తీ చేసే ప్రక్రియకొనసాగుతోందన్నారు. గత ఎనిమిదిన్నరేళ్ల కాలంలో పారిశ్రామిక , ఐటి రంగాల్లో రూ.3.31లక్షలకు పైగా పెట్టుబడులను తెలంగాణ రాష్ట్రం ఆకర్షించిందని, ఐటి ఉద్యోగ నియామకాల్లో 140 శాతం వృద్ధి సాధించిందన్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ ప్రక్రియ కొనసాగుతోందన్నారు.
దేశంలోనే తెలంగాణ అగ్రగామి
RELATED ARTICLES