హాజరుకానున్న కెసిఆర్, కేజ్రీవాల్, విజయన్, భగవంత్ మాన్, సిపిఐ నేత డి.రాజా
నేడు నూతన కలెక్టరేట్ ప్రారంభం
రెండవ దశ కంటి వెలుగు ఇక్కడి నుండే షురూ
ప్రజాపక్షం/ ఖమ్మం ఖమ్మంలో జరిగే బిఆర్ఎస్ ఆవిర్భావ సభ చరిత్రలో నిలిచిపోనున్నది. వామపక్షాలకు, ప్రజాపోరాటాలకు నెలవైన ఖమ్మంలో ప్రజలు కనీవినీ ఎరుగని రీతిలో సభను నిర్వహిస్తున్నారు. రాష్ట్ర మంత్రులు తన్నీరు హరీష్‌రావు, పువ్వాడ అజయ్‌కుమార్ నేతృత్వంలో అదిరిపోయే ఏర్పాట్లు చేశారు. 100 ఎకరాలలో సభా స్థలిని ఏర్పాటు చేశారు. 20 అడుగుల ఎత్తులో వేదికను ఏర్పాటు చేశారు. వేదికపై 100 మంది కూర్చునేలా ఏర్పాటు చేయడంతో పాటు లక్ష మంది కూర్చునేలా కుర్చీలను ఏర్పాటు చేశారు. విఐపిలు, ప్రజాప్రతినిధులు, వివిధ కార్పోరేషన్ ఛైర్మన్లు కూర్చునేలా ప్రత్యేక గ్యాలరీని ఏర్పాటు చేశారు. పార్కింగ్ కోసం 428 ఎకరాలను సిద్ధం చేశారు. నియోజక వర్గాల వారీగా, జిల్లాల వారీగా పార్కింగ్‌ను ఏర్పాటు చేశారు. సభకు వచ్చే ప్రజలు ఇబ్బందులు పడకుండా, ట్రాఫిక్ జామ్ కాకుండా ప్రైవేటు వాహనాలను దారి మళ్లించారు. ఖమ్మంకు వచ్చే అన్ని రహదారులను పోలీసులు నియంత్రించారు. మహబూబాబాద్, సూర్యాపేట జిల్లాతో పాటు ఖమ్మంజిల్లాలోని ఖమ్మం, పాలేరు, మధిర, వైరా, సత్తుపల్లి, ఇల్లందు నుంచి జన సమీకరణ చేస్తున్న దృష్ట్యా ఈ ప్రాంతాలలో వాహనాలకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. 4వేల మందికి పైగా పోలీసులను విధి నిర్వహణ కోసం కేటాయించారు. ప్రత్యేక భద్రతా ఏర్పాట్లతో పాటు ట్రాఫిక్ ప్రధాన సమస్యగా భావించి దానిని అధికమించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఖమ్మంజిల్లాలోని ప్రైవేటు వాహనాలతో పాటు ఆర్టిసి బస్సులు జన సమీకరణకు కేటాయించారు. అవి సరిపోకపోవడంతో ఇతర జిల్లాలతో పాటు పక్కన ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి కూడా ఆర్టిసి బస్సులను అద్దెకు తీసుకున్నారు. సభ న భూతో న భవిష్యత్ అన్న రీతిలో నిర్వహించేందుకు బిఆర్ఎస్ నాయకశ్రేణి సర్వం ఒడ్డుతుంది.
ఖమ్మంకు నలుగురు ముఖ్యమంత్రులు, జాతీయ నాయకులు :
బిఆర్ఎస్ ఆవిర్భావ సభను పురస్కరించుకుని నలుగురు ముఖ్యమంత్రులు, పలువురు జాతీయ నాయకులు ఖమ్మం రానున్నారు. ప్రపంచంలోనే అతి పెద్ద కార్యక్రమంగా చెప్పబడుతున్న రెండవ దశ కంటి వెలుగు ప్రారంభ కార్యక్రమంలో వీరు పాల్గొననున్నారు. ఆ తర్వాత బిఆర్ఎస్ సభలో పాల్గొంటారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్, కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్‌మాన్, సిపిఐ జాతీయ కార్యదర్శి డి. రాజా, సమాజ్‌వాది పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ పాల్గొననున్నారు. హైదరాబాద్ నుంచి బయలుదేరి యాద్రాద్రి వెళ్లి అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా నేరుగా ఖమ్మంకు చేరుకుంటారు. ఖమ్మం సమీకృత కలెక్టరేట్‌ను ప్రారంభించి అక్కడే రెండవ దశ కంటి వెలుగు పథకాన్ని ప్రారంభిస్తారు. భోజన అనంతరం సరిగ్గా 2.30కు బహిరంగ సభ ప్రారంభమవుతుంది. ఈ బహిరంగ సభ వేదికపై అతిథులతో పాటు రాష్ట్ర మంత్రులు, ఖమ్మంజిల్లా ప్రజాప్రతినిధులు, సిపిఐ సీనియర్ నేత పువ్వాడ నాగేశ్వరరావు తదితరులు ఆశీనులు కానున్నారు. జాతీయ నాయకులు మాట్లాడిన తర్వాత ముఖ్యమంత్రి కేసిఆర్ మాట్లాడతారు.
ఏర్పాట్లను పరిశీలించిన రాష్ట్ర మంత్రులు
భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ సభకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. వేదికతో పాటు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. ఖమ్మంను బిఆర్ఎస్ జెండాలు, తోరణాలు, ఫ్లెక్సీలతో అత్యంత సుందరంగా అలంకరించారు. ముఖ్యమంత్రి కేసిఆర్‌తో పాటు ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, జాతీయ నాయకులకు స్వాగతం పలుకుతూ భారీ కటౌట్లు ఏర్పాటు చేశారు. రాష్ట్ర మంత్రులు హరీష్‌రావు, పువ్వాడ అజయ్‌కుమార్ గత వారం రోజులుగా సభ ఏర్పాట్లు, జన సమీకరణలో నిమగ్నమయ్యారు. మంగళవారం రాష్ట్ర మంత్రులు సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, మల్లారెడ్డి, రాష్ట్ర రైతుబంధు అధ్యక్షులు పల్లా రాజేశ్వరరెడ్డి, ఎంపిలు నామ నాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్ర తదితరులు సభా స్థలిని పరిశీలించారు. జిల్లాకు చెందిన ఎంఎల్‌సి తాతా మధు, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, శాసన సభ్యులు సండ్ర వెంకటవీరయ్య, ఖమ్మం నగర మేయర్ పునుకొల్లు నీరజ, పార్టీ ఇతర నేతలు సభా స్థలిని పరిశీలించి నిర్వహకులకు పలు సూచనలు చేశారు. ప్రజలు ఇబ్బందులు పడకుండా 1000 మంది వాలంటీర్లను ఏర్పాటు చేశారు. నూతన కలెక్టరేట్ నుంచి వేదిక వద్దకు భారీకేడ్లతో ప్రత్యేక దారిని ఏర్పాటు చేశారు. కంటి వెలుగు ప్రారంభ అనంతరం నేరుగా వేదిక వద్దకు చేరుకునేందుకు అంతరాయం కలుగకుండా ఏర్పాట్లు చేశారు.
ఖమ్మంలో చారిత్రాత్మక సభకు సకలం సిద్ధం
RELATED ARTICLES