HomeNewsBreaking Newsఒక శాతం మంది చేతిలో 40% దేశ సంపద

ఒక శాతం మంది చేతిలో 40% దేశ సంపద

ఆక్స్‌ఫామ్‌ నివేదిక స్పష్టీకరణ
న్యూఢిల్లీ:
మన దేశ సంపదలో 40 శాతం కేవలం ఒక శాతం మంది బిలియనీర్ల చేతికే వెళుతున్నది. ఆక్స్‌ఫామ్‌ తాజా నివేదిక పలు ఆశ్చర్యకరమైన గణాంకాలను వెల్లడించింది. ఈ నివేదికను అనుసరించి, దేశంలో సంపద కొద్ది మంది చేతుల్లోనే కేంద్రీకృతం అవుతున్నది. పైనుంచి కింది స్థాయి వరకూ ఆర్థిక ఫలాలు చేరే ‘ట్రికిల్‌ డౌన్‌’ మన దేశంలో సాధ్యం కావడం లేదు. కరోనా మహమ్మారి దేశాన్ని అతలాకుతలం చేసినప్పుడు, లక్షలాది మంది ఉపాధి కోల్పోయి వీధిన పడ్డారు. కానీ, కొంత మంది బిలియనీర్ల ఆదాయం వంద రెట్ల కంటే ఎక్కువ పెరిగింది. సగం జనాభా వద్ద ఉన్నది కేవలం మూడు శాతం మాత్రమే అంటే, దేశ సంపదను కేంద్ర ప్రభుత్వం ఏ స్థాయిలో దోచిపెడుతున్నదో స్పష్టమవుతుంది. దేశంలోని పది మంది అత్యంత ధనవంతుల ఆదాయంపై ఐదు శాతం పన్ను విధిస్తే, కేంద్రం ఎన్నో ప్రజాసంక్షేమ పథకాలు చేపట్టవచ్చు. ఎలాంటి ఆటంకాలు లేకుండా అమలు చేయవచ్చు. కానీ, కరోనా సమయంలోనే తీసుకోని ఈ నిర్ణయాన్ని మోడీ సర్కారు ఇప్పుడు తీసుకుంటుందనుకోవడం పొరపాటే. ప్రభుత్వ మద్దతు ఉంది కాబట్టే, కరోనా మహమ్మారి మొదలైనప్పటి నుంచి గత ఏడాది నవంబర్‌ వరకు భారత బిలియనీర్ల సంపద 121 శాతం పెరిగింది. ఎక్కువ శాతం పన్నులు కడుతున్నది పేదలు, మధ్యతరగతి ప్రజలు. కానీ, దర్జా అనుభవిస్తున్నది మాత్రం రెండు వందలు కూడా లేని బిలియనీర్లు. దేశంలోని టాప్‌ 100 మంది సంపన్నుల సంపద సుమారు రూ. 54.12 లక్షల కోట్లు. అంటే సుమారు 18 నెలలకు సరిపోయే కేంద్ర బడ్జెట్‌ మొత్తానికి సమానం. ప్రభుత్వ విధానాల పుణ్యాన బిలియనీర్లు ఇంకా.. ఇంకా కూడబెట్టుకుంటున్నారు. సామాన్యుడు ఆర్థికంగా మరింత పతనమవుతున్నాడు. ఇలావుంటే, దేశంలోని స్త్రీ, పురుషుల సంపాదనలో తేడా చాలా ఎక్కువగా ఉందని ఆక్స్‌ఫామ్‌ నివేదిక తెలిపింది. పురుషుల సంపాదనతో పోలిస్తే స్త్రీల సంపాదన రూపాయిలో కేవలం 63 పైసలు మాత్రమేనని వెల్లడించింది. సమాజంలోని మిగతా వర్గాలు సం పాదించే మొత్తంలో రైతులు ఆర్జిస్తున్నది 55 శాతంగానే ఉంది. ప్రపంచంలోని 500 మంది ధనవంతులు గత ఏడాది తమ నికర విలువలకు కనీసం ట్రిలియన్‌ డాలర్ల కంటే ఎక్కువే జోడించినట్లు తేలింది. భారతదేశంలో గత మేలో పట్టణ నిరుద్యోగం 15 శాతం పెరిగ్గా, ఆహార అభద్రత మరింత దిగజారింది, ఇప్పుడు ఫ్రాన్స్‌, స్వీడన్‌, స్విట్జర్లాండ్ల కంటే ఎక్కువ మంది బిలియనీర్లు భారత్‌లో ఉన్నట్లు ఆక్స్‌ఫామ్‌ నివేదిక చెబుతోంది. 2016లో సంపద పన్ను రద్దు, కార్పొరేట్‌ లెవీల్లో భారీగా కోతలు, పరోక్ష పన్నుల పెంపుతో సహా పలు విధానాలు సంపన్నులను ధనవంతులుగా మార్చడంలో సహాయపడిన అంశాలలో ఉన్నా యి, అయితే 2020 నుంచి చూసుకుంటే జాతీయ కనీస వేతనం రోజుకు రూ. 178గా ఉంది. ఆరోగ్యం, విద్యా రంగాలలో పెరుగుతున్న ప్రైవేటీకరణల మధ్య స్థానిక పాలనకు కేంద్రం నిధులు తగ్గించడం అసమానతలను మరింత పెంచిందని తాజా నివేదిక చెబుతోంది. ప్రపంచంలోని పోషకాహార లోపం ఉన్న వారిలో నాలుగింట ఒక వంతు మంది భారత్‌ లోనే నివసిస్తున్నారని ప్రపంచ ఆహార కార్యక్రమాన్ని ఉటంకిస్తూ ఆక్స్‌ఫామ్‌ నివేదిక వెల్లడించింది. కేంద్ర పన్నుల విధానం ధనవంతులకు అనుకూలమైనదిగా ఉండటమే కాకుండా, ఇది రాష్ట్రాలకు ముఖ్యమైన ఆర్థిక వనరులను కూడా కోల్పోయేలా చేస్తోందని ఆక్స్‌ఫామ్‌ నివేదిక తెలిపింది. ఈ రెండూ కోవిడ్‌ సంక్షోభం సందర్భంలో ముఖ్యంగా నష్టం కలిగించాయని నివేదిక పేర్కొంది. ఆరోగ్యం, విద్యా రంగాల్లో పెట్టుబడి పెట్టడానికి జనాభాలోని ధనవంతులైన 10 శాతం మందిపై 1శాతం సర్‌చారి విధించాలని ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. భారతదేశంలోని 10 మంది సంపన్న బిలియనీర్ల సంపద 25 సంవత్సరాలకు పైగా దేశంలోని పిల్లల పాఠశాల. ఉన్నత విద్యకు నిధులు సమకూర్చడానికి సరిపోతుందని పేర్కొంది. కరోనా ప్రారంభంలో 84 శాతం కుటుంబాలు ఆదాయంలో క్షీణతతో బాధపడుతున్నాయని, భారతదేశం పేదరికంలో అత్యధిక పెరుగుదలకు సబ్‌-సహారా ఆఫ్రికా తరహాలోనే ఉందని పేర్కొంది. కాగా, పన్ను ఎగవేత కోసం ప్రపంచవ్యాప్తంగా సృష్టించిన 29 వేల ఆఫ్‌షోర్‌ కంపెనీలు, ప్రైవేట్‌ ట్రస్ట్‌ వివరాలతో కూడిన 11.9 మిలియన్‌ పత్రాల సేకరణ, లీకైన పండోర పేపర్స్‌ ప్రకారం 380 కంటే ఎక్కువ మంది భారతీయులు 200 బిలియన్‌ రూపాయల విలువైన విదేశీ, స్వదేశీ ఆస్తులను కలిగి ఉన్నారని ఆక్స్‌ ఫామ్‌ నివేదిక తెలిపింది. బ్లూమ్‌బెర్గ్‌ బిలియనీర్స్‌ ఇండెక్స్‌ ప్రకారం, గౌతమ్‌ అదానీ గత సంవత్సరం దేశంలోనే అతిపెద్ద సంపదను, ప్రపంచంలో ఐదవ అతిపెద్ద సంపదను కలిగి ఉన్నట్లు తేలింది. కరోనాకాలంలో అదానీ సంపద 42.7 బిలియన్‌ డాలర్లు పెరిగిందని ఈ నివేదిక వెల్లడించింది. ఇది ఇప్పుడు దాదాపు 90 బిలియన్‌ డాలర్లతో సమానమని పేర్కొంది. 2021లో ముఖేష్‌ అంబానీ నికర విలువ 13.3 బిలియన్‌ డాలర్లు పెరిగి ఇప్పుడు 97 బిలియన్‌ డాలర్లుగా ఉందని బ్లూమ్‌బెర్గ్‌ నివేదిక వెల్లడించింది.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments