ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి
హైదరాబాద్‌సహా బోసిపోయిన నగరాలు.. పట్టణాలు
పంతంగి, బీబీనగర్ టోల్గేట్ల వద్ద పోటెత్తిన వాహనాలు
ప్రజాపక్షం న్యూస్ నెట్వర్క్
రంగవల్లుల దివ్య కాంతులు ఇళ్ల ముంగిట్లో.. పాడి పంటల ధాన్య రాశులు నిండు పందిట్లో.. ప్రేమ భావనతో.. క్షీర ధారలతో కలికే అందమైన పల్లె సామ్రాజ్యాల మకుటంలేని మహరాజులు రైతులు చేసుకునే భవ్యమైన పండుగ సంక్రాంతి సందడి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తున్నది. కల్లల్లేని మనసులు నడయాడే అందమైన పొదరిళ్లు.. అవి కూరిమి పేర్చిన గూళ్లు.. స్వప్నాల లోగిళ్లు.. ఎన్నెన్నో వృత్తులు.. ఆటాడే పైరులు.. చిందేసే లేగలు.. సంక్రాంతిని తలచుకుంటే మనసును పులకింపచేసే దృశ్యాలివి. భోగి.. సం క్రాంతి.. కనుమ.. మూడు రోజులపాటు రైతులు జరుపుకొనే అపురూపమైన పండగకు అద్దిన నగిషీలు పల్లెల అందాలు. అక్కడ ఉండేవి సమత నేర్పే బళ్ళు.. సత్యాల వాకిళ్ళు.. స్వచ్ఛతకు మారుపేరుగా పంట పొలాల కేరింతలు. ఉరికే ఏరులు.. కులికే నాగళ్లు.. మెరిసే కళలు.. మురిసే పదాలు.. ఊరంతా ఒకటే.. అందరూ ఆత్మీయు లే.. పల్లెల్లో కనిపించే స్నేహాభిరాగం ఓ కమ్మనైన కావ్యం. అక్కడి పాడి పంటల్లో సుఖం.. సౌఖ్యం. చెమట చిందించే జీవితం ధన్యం. ప్రతి క్షణం ఆహ్లాదవనంలో నిండైన రోజులు.. గర్వంతో మురిసే సంబరాలు.. చెమటోడ్చి పండించిన పంట చేతికి అందే కాలం. పంటను చూసుకొని మురిసిపోవడాన్ని మించిన ఆనందం ఒక రైతుకు ఎక్కడ ఉంటుంది? ఒక్కో రాష్ట్రంలో ఒక్కో పేరు తో సంక్రాంతిని ప్రజలు జరుపుకుంటారు. ఉత్తర భారతంలో నివసించే హిందువులు, సిక్కులు సంక్రాంతి పండగను మాఘీ అని పిలుస్తారు. ఆ తర్వాత లోహ్రీ జరుపుతారు. గోవా, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, కర్నాటక, తెలంగాణ రాష్ట్రాల్లో మకర సంక్రాంతిగా పిలుస్తా రు. మధ్యభారత దేశంలో సుకరాత్ అని అసోం లో మఘ్ బిహు అని తమిళనాడులో పొంగల్ అని పిలుస్తారు. గుజరాత్లో గాలి పటాలను ఎగురవేస్తారు. ఏ పేరుతో పిలుస్తున్నా.. పండుగ విశేషం ఒకటే. రైతుల కళ్లల్లో ఆనందమే. పనులు ఎన్ని ఉన్నా.. ఏఏ కార్యాలపై ఎక్కడెక్కడకు వెళ్లినా.. అందరూ తప్పనిసరిగా స్వస్థలాలకు చేరుకునే ఏకైక పండుగ సంక్రాంతి. అందుకే తెలంగాణ రాజధాని హైదరాబాద్‌సహా నగరాలు, పట్టణాలు బోసిపోయాయి. జనమంతా ఊర్లకు తరలివెళ్లడంతో, ఎప్పుడు రద్దీగా ఉండే రహదారులు నిర్మాన్యుమవుతున్నాయి. పల్లెలు నిండుగా కనిపిస్తున్నాయి. ఎప్పటి మాదిరిగానే, ఈ సంవత్సరం కూడా సంక్రాంతి పండుగ సమయాల్లో తెలుగు రాష్ట్రాల్లో బస్సులు, రైళ్ళు కిటకిటలాడాయి. సొంత ఊళ్లకు వెళ్లే వాళ్లతో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు రద్దీగా మారాయి. సూర్యుడి చుట్టూ భూమి పరిభ్రమించే మార్పు క్రమంలో తన చుట్టూ తాను కూడా తిరుగుతుంది. అందువలన సూర్యుడు ఆరు నెలలు ఉత్తరం వైపు ఆరు నెలలు దక్షిణం వైపు కనిపిస్తాడు. ఇలా ఉత్తరం వైపు కనిపించే క్రమమే ఉత్తరాయణం అంటారు. దక్షిణం వైపు కనిపించే క్రమం దక్షిణాయణం. ఉత్తరాయణ సంక్రమణమే సంక్రాంతి. మకర సంక్రాంతిని ’పంటకోతల లేదా పంట నూర్పిడుల’ పండుగగా కూడా పిలుస్తారు. ఎందుకంటే ఈ సమయానికల్లా పంట నూర్పిడులు పూర్తవుతాయి. అందుకే రైతులు దీనిని పెద్ద ఉత్సవాలు జరుపుకుంటారు. ఈ రోజున, పంటలలో వారికి సహాయపడిన వారికి కృతజ్ఞత తెలుపుతారు. పంటలలో పశువులు చాలా పెద్ద పాత్ర పోషిస్తాయి. అందువల్ల పండుగ తరువాతి రోజు వాటి కోసమే, అదే ’కనుమ’ అంటారు. మొదటి రోజు భూమికి, రెండొవ రోజు మనిషికి, మూడవ రోజు పాడి పశువులకు.. ఇలా మూడురోజుల పండుగను విభజించారు.
పంతంగి, బిబినగర్ టోల్గేట్లకు పోటేత్తిన వాహనాలు
సంక్రాంతి పండుగ నేపథ్యంలో టోల్ గేట్ల వద్ద శనివారం కూడా రద్దీ కొనసాగింది. హైదరాబాద్ – విజయవాడ పంతంగి టోల్ గేట్, హైదరాబాద్ – వరంగల్ బిబి నగర్ టోల్ గేట్ల వద్ద భారీ సంఖ్యలో వాహనాలు గ్రామాలకు తరలివెళ్లాయి. టోల్ గేట్లను దాటేందుకు సుమారు 20 నిమిషాల నుంచి అరగంట సమయం పట్టింది. పంతంగి, బిబి నరగ్ టోల్‌ప్లాజాల మీదుగా ప్రయాణించిన వాహనాల సంఖ్యను రాచకొండ ట్రాఫిక్ పోలీసులు విడుదల చేశారు. పంతంగి వద్ద గురువారం ఒక్కరోజే 56,595 వాహనాలు రాకపోకలు సాగించాయి. వీటిలో 42,844 కార్లు, ఆర్టిసి బస్సులు 1,300, ప్రైవేట్ బస్సులు 4,913, గూడ్స్, ఇతర వాహనాలు 7,538) ఉన్నాయి. శుక్రవారం 67,577 మొత్తం వాహనాలు టోల్‌ప్లాజాను దాటగా, వాటిలో కార్లు 53,561, ఆర్టిసి బస్సులు 1,851, ప్రైవేట్ బస్సులు 4,906, ఇతర వాహనాలు 7,259 ఉన్నాయి. బిబి నగర్ టోల్‌ప్లాజా నుంచి శుక్రవారం మొత్తం 25231 దాటాయి. వీటిలో కార్లు – 17844, బస్సులు 872, వరంగల్ వైపు నుండి హైదరాబాద్ వైపు వాహనాలు 13334 వెళ్లాయి. ఎల్.బి.నగర్లో విజయవాడ బస్టాండ్ వద్ద ప్రయాణికుల రద్దీ ఎక్కువగా కనిపించింది. పంతంగి టోల్ గేట్ వద్ద రాత్రి 10 నుండి ఉదయం 01 గంటల మధ్య భారీ వాహనాలు తరలివచ్చాయి. ట్రాఫిక్ణు క్రమబద్ధీకరించేందుకు ట్రాఫిక్ ప్రత్యేక బృందాలతో పాటు ఆర్టిసి ప్రత్యేక బృందాలు పనిచేశాయి. ఒక ట్రాఫిక్ ప్రత్యేక బృందం, జిఎంఆర్ టోల్ నిర్వహణ బృందంతో కలిసి పంతంగి టోల్గేట్లో సమన్యయం చేశారు. ఈ సందర్భంగా ప్రయాణికులు అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రోడ్లపై నిలబడకుండా ఏర్పాటు చేసిన బస్ షెల్టర్ల వద్ద మాత్రమే బస్సుల కోసం వేచి ఉండాలని సిబ్బంది సూచించారు. ప్రైవేట్ బస్ నిర్వాహకులు డ్రైవర్లు రోడ్లపైకి వచ్చే ముందుగానే వాహనం కండిషన్‌ను పరిశీలించాలని, అలాగే బస్సు స్టాండ్లలో టాఫిక్‌కు అంతరాయం కలుగకుండా క్రమ పద్దతిలో నిలిపేల చర్యలు తీసుకున్నారు.
రైతుల పండుగకు… గ్రామాలు సిద్ధం
RELATED ARTICLES