సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు
\ప్రజాపక్షం/కొత్తగూడెం రాజ్యాంగ వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నప్పటికీ న్యాయవ్యవస్థ జ్యోక్యం చేసుకోరాదని ఉప రాష్ట్రపతి జగదీశ్ ధన్కర్ వ్యాఖ్యానించడం దేశంలో అధ్యక్ష తరహా పాలనకు సంకేతమని, రాజ్యాంగంపై ప్రమాణం చేసి పదవి చేపట్టిన జగదీశ్ ధన్కర్ అదే రాజ్యాంగాన్ని దిక్కరిస్తూ వ్యాఖ్యలు చేయడం తగదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. సిపిఐ భద్రాది కొత్తగూడెం జిల్లా కార్యాలయం శేషగిరిభవన్‌లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజ్యాంగ వ్యవస్థలపై విధ్వంసానికి పాల్పడుతూ ఎనిమిదేళ్ళుగా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం పాలన సాగిస్తోందని, అందుకు ఉదాహరణే జగదీశ్ ధన్కర్ వ్యాఖ్యలని, రాజ్యాంగాన్ని కాపాడాల్సిన వ్యక్తే రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని విచ్ఛిన్నం చేసే చర్యలకు పూనుకోవడం దారుణమని, ఇది అంతిమంగా రాష్ట్రపతి పాలనకు, అధ్యక్షతరహా పాలనకు దారితీసే పరిస్థితులకు తెరలేపారన్నారు. లెజిస్లేచర్‌లో, ఎక్సుక్యూటీవ్‌లో ఎలాంటి తప్పులు జరిగినా అంతిమంగా న్యాయవ్యవస్తే తప్పులు ఎత్తిచూపి సరిదిద్దాల్సి ఉంటుందని, దీన్ని అంగీకరించబోమని పేర్కొనడం చెప్పడాన్ని తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామన్నారు. న్యాయవ్యవస్థ హక్కులను కాలరాసే చర్యలను కేంద్రం మానుకోవలని, ప్రజాస్వామ్య పద్ధతిలోనే దేశం నడవాల్సిన అవసం ఉందన్నారు. బిజెపి వ్యతిరేక శక్తులవైపు ప్రజలు ఆకర్షితులవుతున్నారని ఇటీవల జరిగిన ఎన్నికల ఫలితాలు రుజువు చేశాయన్నారు. దేశంలో బిజెపిని నిలువరించే శక్తి కేవలం కమ్యూనిస్టులకే ఉందని, మతోన్మాద బిజెపిని నిలువరిచేందుకు రాష్ట్రంలోని బిఆర్‌ఎస్‌తోపాటు డిఎంకె, ఆర్‌జెడి, ఆమ్‌ఆద్మీ వంటి పార్టీలతో కమ్యూనిస్టులు కలిపి పనిచేస్తున్నాయని స్పష్టం చేశారు. బిజెపిని నిలువరించే క్రమంలో కలిసొచ్చే ప్రజాతంత్ర శక్తులను కూడగడతామన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉభయ కమ్యూనిస్టులదే నిర్ణయాత్మక పాత్ర అని, గెలుపోటములను ప్రభావితం చేసే శక్తి కమ్యూనిస్టులకు ఉందని, కమ్యూనిస్టుల పాత్ర లేకుండా ఏ పార్టీ ఇక్కడ మనుగడ సాగించలేవని పునరుద్ఘాటించారు. ఈ నెల 18న ఖమ్మంలో జరిగిన బిఆర్‌ఎస్ సభకు కమ్యూనిస్టు పార్టీలను ఆహ్వానించారని, బిజెపికి వ్యతిరేకంగా బిఆర్‌ఎస్ బలమైనగొంతు వినిపిస్తున్న క్రమంలో కమ్యూనిస్టుల గొంతు కలిపి మరింత బలాన్ని అందించేందుకు కమ్యూనిస్టు పార్టీ జాతీయ నాయకత్వం సభకు హాజరవుతుందని తెలిపారు. దళితబందు పథకం అమలు కలెక్టర్లకు అప్పగించాలని, పోడు సమస్య పరిష్కరించాలని, ఆర్‌టిసి, స్కీమ్ వర్కర్ల సమస్య, నిరుద్యోగ సమస్యపై అటు కేంద్రంతోనూ, ఇటు రాష్ట్రంతోనూ తమ పోరాటం ఉంటుందని స్పష్టం చేశారు. మీడియా సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్‌కె.సాబీర్ పాషా, జిల్లా కార్యవర్గ సభ్యులు బందెల నర్సయ్య, వై.శ్రీనివాసరెడ్డి, జిల్లా సమితి సభ్యులు కందుల భాస్కర్, కంచర్ల జమలయ్య, వంగా వెంకట్, జి.వీరస్వామి, మునిగడప వెంకటేశ్వర్లు, కె.రత్నకుమారి, భూక్య శ్రీనివాస్, నాయకులు జె.గట్టయ్య, కిష్టాఫర్, నాగయ్య తదితరులు పాల్గొన్నారు.
ఉప రాష్ట్రపతి వ్యాఖ్యలు అధ్యక్ష పాలనకు సంకేతం
RELATED ARTICLES