కేంద్రం అసమర్థత వల్ల తెలంగాణ రూ. 3 లక్షల కోట్లు నష్టపోయింది
మహబూబాబాద్ కలెక్టరేట్ ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు
వచ్చే విద్యా సంవత్సరం నాటికి ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు
ఒక్కో గ్రామ పంచాయతీకి రూ.10 లక్షల నిధులు
మహబూబాబాద్ మున్సిపాలిటీకి రూ.50 కోట్లు, ఇతర మున్సిపాలిటీలకు రూ. 25 కోట్లు కేటాయింపు
ప్రజాపక్షం/ మహబూబాబాద్ ప్రతినిధి మత విద్వేశాలు రెచ్చగొడితే భారతదేశం మరో అఫ్గానిస్తాన్ అవుతుందని, దీనిపై మత పెద్దలు, మేధావులు చర్చ జరపాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. ప్రజలు మత విద్వేశాలు రెచ్చగొట్టే పార్టీల ప్రలోభాలకు లొంగకూడదని, అభివృద్ధి చేసే బిఆర్ఎస్కే తమ సంపూర్ణ మద్దతు ఇవ్వాలని కోరారు. సిఎం కెసిఆర్ గురువారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో పర్యటించారు. నూతన కలెక్టరేట్, జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయ భవనాన్ని ప్రారంభించి జిల్లా కలెక్టర్ కె.శశాంకను కలెక్టర్ సీటులో కూర్చోబెట్టి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జిల్లా కేంద్రంలో నిర్మించిన బిఆర్ఎస్ పార్టీ నూతన కార్యాలయాన్ని కూడా కెసిఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో సిఎం సిఆర్ మా ట్లాడుతూ సమాజం అద్భుతంగా పురోగమించాలంటే… శాంతితో, సహనంతో, సర్వజనుల సంక్షేమాన్ని కాంక్షించి ముందుకు పోవాలని సిఎం హితవు పలికారు. అంతేతప్ప, మత పిచ్చి లేపి, కులపిచ్చి లేపి, ప్రజలను విభజించాలని చూస్తే అదొక నరకంలా, తాలిబన్ వ్యవహారంలా, ఒక ఆప్ఘనిస్థాన్‌లా, నిప్పుల కుంపటిలా తయారవుతుందని స్పష్టం చేశారు. విద్వేషాలతో జాతి జీవనాడి దహించుకుపోయే పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు. అందుకే యువత మేధావులతో చర్చలు ఏర్పాటు చేసి సన్మార్గంలో ముందుకు పోవాలని సూచించారు. తాను ఎంత చెప్పినా, కేంద్రంలో కూడా మంచి ప్రభుత్వం ఉంటేనే యావత్ దేశాభివృద్ధిలో మన అభివృద్ధి కూడా ఇమిడి ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఈ దిశగా చైతన్య వీచికలు తెలంగాణ నుంచి వీయాలని, అందులో మీ అందరూ భాగస్వాములు కావాలని కెసిఆర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాలలో రాష్ట్ర మంత్రులు సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, రాష్ట్ర సిఎస్ శాంతి కుమారి, సిఎం ఓఎస్డి స్మితా సబర్వాల్, మహబూబాబాద్ ఎంపి మాలోత్ కవిత, ఎంఎల్‌సిలు తక్కెళ్లపల్లి రవీందర్రావు, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎంఎల్ఎలు డి.ఎస్.రెడ్యానాయక్, శంకర్‌నాయక్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ గుడిపూడి నవీన్ రావు, వరంగల్ మున్సిపల్ మేయర్ గుండు సుధారాణి, జిల్లా ఎస్పి శరత్ చంద్ర పవార్, అదనపు కలెక్టర్లు అభిలాష అభినవ్, డేవిడ్, బిఆర్ఎస్ రాష్ట్ర, జిల్లా నాయకులు పాల్గొన్నారు.
కేంద్రం అసమర్థత వల్ల తెలంగాణ రూ. 3 లక్షల కోట్లు నష్టపోయింది
కేంద్రం అసమర్థత, వైఫల్యం వల్ల తెలంగాణ రాష్ట్రం రూ.3 లక్షల కోట్లు నష్టపోయిందని సిఎం కెసిఆర్ అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు జిఎస్‌డిపి రూ.5 లక్షల కోట్లు ఉండేదని, ప్రస్తుతం దాన్ని రూ.11.5 లక్షల కోట్లకు పెంచుకోగలిగామని చెప్పారు. ‘కానీ కేంద్రం సరిగా పరిపాలన చేయకపోవడం వల్ల తెలంగాణకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. ఇది నేను చెబుతున్న లెక్క కాదు. ఆర్థిక శాస్త్రవేత్తలు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కాగ్ తేల్చి చెబుతున్న లెక్కలు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ స్థాయిలో పనిచేసినా నేడు మన జిఎస్‌డిపి రూ.14.5 లక్షల కోట్లు ఉండాలి. కానీ మనం రూ.11.5 లక్షల కోట్ల వద్దే ఆగిపోయాం. ఆ తప్పు తెలంగాణది కాదు, కేంద్రానిది‘ అని కెసిఆర్ వివరించారు. తాను ఎంత చెప్పినా, కేంద్రంలో కూడా మంచి ప్రభుత్వం ఉంటేనే యావత్ దేశాభివృద్ధిలో మన అభివృద్ధి కూడా ఇమిడి ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఈ దిశగా చైతన్య వీచికలు తెలంగాణ నుంచి వీయాలని, అందులో మీ అందరూ భాగస్వాములు కావాలని కెసిఆర్ పిలుపునిచ్చారు.
మహబూబాబాద్ జిల్లాకు వరాల జల్లు
మహబూబాబాద్ జిల్లాకు సిఎం వరాల జల్లు కురిపించారు. త్వరలోనే మహబూబాబాద్‌లో మెడికల్, ఇంజనీరింగ్ కళాశాలలను ఏర్పాటు చేసి వచ్చే ఏడాది నుండి తరగతులు ప్రారంభిస్తామని చెప్పారు. మహబూబాబాద్ పట్టణం అభివృద్ధికి రూ.50 కోట్లు, జిల్లాలోని మిగతా మున్సిపాలిటీలకు రూ.25 కోట్ల చొప్పున మూడు మున్సిపాలిటీలకు రూ.75 కోట్ల నిధులు మంజూరు చేస్తున్నట్టు సిఎం ప్రకటించారు. సిఎం ప్రత్యేక నిధి నుండి ప్రతి గ్రామానికి రూ.10 లక్షల నిధులిస్తామని ప్రకటించారు. మానుకోట రాళ్ల బలం, ప్రజల ఆకాంక్ష నెరవేరి మనకు ప్రత్యేక రాష్ట్రం లభించిందన్నారు.
సిఎం పర్యటన నేపథ్యంలో అఖిలపక్ష పార్టీల నాయకుల అరెస్ట్
సిఎం కెసిఆర్ జిల్లా పర్యటిస్తున్న నేపథ్యలో బుధవారం అర్థరాత్రి నుండి జిల్లా వ్యాప్తంగా సిపిఐ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. సిపిఐ నాయకులు పెరుగు కుమార్, చింతకుంట్ల వెంకన్న, కట్టెబోయిన శ్రీనివాస్, మాగం లోకేష్, సారిక శ్రీనివాస్, అఖిలపక్ష నాయకులు డా. మురళీ నాయక్, యాప సీతయ్య, కుర్ర మహేష్, అరుణ్, భూక్య శ్రీనివాస్, సందీప్, బానోత్ ప్రసాద్, ఈశ్వరలింగం, రియాజ్, అన్సారి, శ్రీను, ప్రశాంత్, వెంకన్న, విద్యాసాగర్, రమేష్ తదితరులు పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో ఉన్నారు.
అరెస్ట్‌ను ఖండించిన విజయ సారథి, అజయ్ సారథి రెడ్డి
జిల్లా వ్యాప్తంగా పోలీసులు అరెస్ట్ చేసిన సిపిఐ నాయకులను వెంటనే విడుదల చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి బి.విజయసారథి, సిపిఐ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బి.అజయ్ సారథిరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో అప్రజాస్వామిక పాలన కొనసాగుతోందని, ప్రజాస్వామ్యం ఎటుపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. సిఎం వస్తే నాయకులను అరెస్ట్ చేస్తారా అని ప్రశ్నించారు.
విద్వేషాలు రెచ్చగొడితే… భారత్ మరో ఆఫ్గానే!
RELATED ARTICLES