HomeNewsBreaking Newsప్రభుత్వరంగ సంస్థల్లో… కాంట్రాక్ట్‌ విధానానికి స్వస్తి

ప్రభుత్వరంగ సంస్థల్లో… కాంట్రాక్ట్‌ విధానానికి స్వస్తి

ఖాళీగా ఉన్న 20 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలి
ఎఐటియుసి జాతీయ ప్రధాన కార్యదర్శి అమర్‌జీత్‌ కౌర్‌ డిమాండ్‌
ఆదాని, అంబానీలవైపు మోడీ ప్రభుత్వం ఉందని ధ్వజం
ప్రజాపక్షం / హైదరాబాద్‌
రాజ్యాంగం కల్పించిన కార్మిక హక్కులపై మోడీ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుందని ఎఐటియు సి జాతీయ ప్రధాన కార్యదర్శి అమర్‌జీత్‌ కౌర్‌ విమర్శించారు. కార్మికులు పోరాడి సాధించుకున్న చట్టాలను ఒక పథకం ప్రకారం ధ్వంసం చేస్తూ కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్లకు ఊడిగం చేస్తుందని మండిపడ్డారు. రాజ్యాంగ రక్షణ కో సం, కార్మికుల చట్టాల పరిరక్షణ కోసం శ్రామికవర్గం సమరశీల పోరాటాలు సాగించి కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. పోరాడి సాధించుకున్న చట్టాలను ఒక్కొక్కటి విధ్వంసం చేసి పరిశ్రమల అధిపతులకు అనుకూలంగా మార్చి, కార్మిక తిరోగమన విధానాలను అనుసరిస్తుందని ధ్వజమెత్తారు. ఎఐటియుసి రాష్ర్ట కార్యాలయం ఎస్‌.ఎన్‌.రెడ్డి భవన్‌లో “రాజ్యాంగం, కార్మిక చట్టాల రక్షణకై మిలిటెంట్‌ పోరాటాల ఆవశ్యకత” అన్న అంశంపై శనివారం సదస్సు జరిగింది. ఎఐటియుసి రాష్ర్ట అధ్యక్షుడు ఎం.డి.యూసుఫ్‌ అధ్యక్షతన జరిగిన సదస్సులో ప్రధాన కార్యదర్శి ఎస్‌.బాల్‌రాజ్‌, జాతీయ నాయకులు వి.ఎస్‌.బోస్‌, పి.జె.చంద్రశేఖర్‌ పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న అమర్జీత్‌ కౌర్‌ ప్రసంగిస్తూ రాజ్యాంగం కార్మిక హక్కులకు, చట్టాలకు రక్షణగా ఉండాల్సింది ఉండగా… దానిని సైతం మోడీ ప్రభుత్వం కాలరాస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రంలోని వివిధ ప్రభుత్వరంగ సంస్థల్లో అనేక సంవత్సరాలుగా ఖాళీగా ఉన్న 20 లక్షల పోస్టుల ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వరంగ సంస్థల్లో కాంట్రాక్ట్‌ విధానానికి స్వస్తి చెప్పాలని డిమాండ్‌ చేశారు. కాంట్రాక్ట్‌ విధానం అమలు చేస్తూ తక్కువ వేతనాలు ఇస్తూ శ్రామికవర్గాన్ని శ్రమ దోపిడీకి గురిచేస్తున్నారని అన్నారు. మోడీ ప్రభుత్వం కార్మికుల పక్షాన లేదని ఆదానీ, అంబానీలవైపు ఉందని ధ్వజమెత్తారు. పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను నాలుగు కోడ్లుగా మార్చి కార్మికులకు ఉరితాడుగా మార్చి పరిశ్రమల అధిపతులకు, పెట్టుబడిదారులకు అనుకూలంగా మార్చిందన్నారు. యూనియన్‌ పెట్టుకునే హక్కు రాజ్యాంగం కల్పించినప్పటికీ మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు కోడ్లతో యూనియన్‌ పెట్టుకునే హక్కుపై ఉక్కుపాదం మోపుతున్నదన్నారు. సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని రాజ్యాంగంలో పేర్కొనటంతో పాటు సుప్రీంకోర్టు తీర్పు చెప్పినప్పటికీ అమలుకు నోచుకోని దుస్థితి దాపురించిందన్నారు. ప్రతిష్టాత్మకమైన, కీలకమైన ప్రభుత్వరంగ సంస్థలను ఒక పథకం ప్రకారం నిర్వీర్యం చేసి కార్పొరేట్లకు పెట్టుబడిదారులకు ప్రభుత్వం ధారాదత్తం చేస్తుందని ఆరోపించారు. కార్మికవర్గం మహోజ్వల పోరాటాలు సాగించి ప్రభుత్వరంగ సంస్థలను పరిరక్షించుకొని తీరుతామని స్పష్టం చేశారు. రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లు సైతం అమలు చేయటం లేదని, ప్రభుత్వరంగ సంస్థల్లో ఖాళీలను భర్తీ చేయాలని, ప్రైవేటు రంగంలోసైతం తు.చ. తప్పకుండా రిజర్వేషన్లను అమలు చేయాలన్నారు. ప్రభుత్వరంగ సంస్థల్లో పర్మినెంట్‌ విధానం ఉండాలని రాజ్యాంగంలో పేర్కొన్నప్పటికీ మోడీ ప్రభుత్వం అమలు చేయకుండా కాంట్రాక్ట్‌ విధానాన్ని ప్రోత్సహిస్తూ రాజ్యాంగ వ్యతిరేక చర్యలకు పూనుకుంటుందని విమర్శించారు. 2021, 2022 వార్షిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ బ్యాంకులు కోట్లాది రూపాయలు లాభాలు ఆర్జించాయని, ప్రభుత్వ బ్యాంకులు సరైన వ్యాపారం చేయలేవన్న ప్రభుత్వ వాదనకు లాభాలు చూపించి తగిన గుణపాఠం కేంద్ర ప్రభుత్వానికి చెప్పాయని అన్నారు. వలస కార్మికులకు చట్టాలు అమలు కాకపోవటంతో దుర్భర దారిద్య్ర జీవితాలు గడుపుతూ నిర్భాగ్యులుగా మిగిలిపోతున్నారని తెలిపారు. కాంట్రాక్ట్‌ విధానం, వలస విధానం మూలంగా కార్మికవర్గం భేరసారాల పరిస్థితి నిర్వీర్యం అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. వలస కార్మికులు, కాంట్రాక్ట్‌ కార్మికులు సరైన జీతాలు లేక శ్రమదోపిడికి గురవుతున్నారని చెప్పారు. రాజ్యాంగం కల్పించిన, పోరాడి సాధించుకున్న కార్మిక హక్కులు కాపాడుకోవటానికి కార్మికవర్గం సమరశీల పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎఐటియుసి రాష్ర్ట ఉపాధ్యక్షులు కె.ఏసుతరత్నం, కార్యదర్శులు ఎన్‌.కరుణ కుమారి, బి.వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments