పార్టీ శాఖలకు సిపిఐ నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ పిలుపు
గవర్నర్ వ్యవస్థ రద్దుకు డిమాండ్
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా డిసెంబరు 29వ తేదీన “సమాఖ్య వ్యవస్థ పరిరక్షణ దినోత్సవం” (డిఫెండ్ ఫెడరలిజం డే) పాటించాలని భారత కమ్యూనిస్టుపార్టీ (సిపిఐ) పార్టీ శాఖల కు పిలుపు ఇచ్చింది. గవర్నర్ల వ్యవస్థను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ 29వ తేదీన దేశవ్యాప్తంగా ప్రచార చైతన్య కార్యక్రమాలు నిర్వహించాలని, దేశంలోని ప్రజాస్వామ్య శక్తులు ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలని పార్టీ కోరింది. ఢిల్లీలోని సిపిఐ జాతీయ కార్యాలయం అజయ్ భవన్‌లో పార్టీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ (ఎన్‌ఇసి) సమావేశాలు ఈ నెల 3,4 తేదీలలో జరిగాయి. పార్లమెంటులో సిపిఐ సభ్యుడు బినొయ్ విశ్వం అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా నివేదిక సమర్పించారు. ఈ మేరకు పార్టీ సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు.“సమాఖ్య వ్యవస్థ పరిరక్షణ దినోత్సవం పాటించాలని పార్టీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో దేశవ్యాప్తంగా ఉన్న పార్టీ శాఖలకు పిలుపు ఇచ్చింది. దేశంలో సమాఖ్య వ్యవస్థ సమగ్ర స్వరూప స్వభావాలను సంరక్షించుకోవాల్సిన ఆవశ్యకత మనందరిపైన ఉంది, ప్రజాస్వామ్య శక్తులన్నీ ఒక్కచోట చేరాలి, దేశంలో ఆర్‌ఎస్‌ఎస్ నియంత్రణలో ఉన్న ప్రభుత్వం రాజ్యాంగ మూలాలను క్షీణింపజేస్తున్నది, అందుకే సిపిఐ జాతిని అప్రమత్తం చేస్తున్నది, ఈ ప్రయోజనం కోసమే ఆర్‌ఎస్‌ఎస్ కేంద్రీకృత సైద్ధాంతికత మార్గదర్శనంలో గవర్నర్‌ల వ్యవస్థను, గవర్నర్ల కార్యాలయాలను తమిళనాడు, కేరళ,తెలంగాణ తదితర రాష్ట్రాలలో కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తున్నది.రాజ్‌భవన్‌లను బిజెపి క్యాంప్ కార్యాలయాలుగా మార్చేశారు. ఈ నేపథ్యంలో గవర్నర్‌ల వ్యవస్థను రద్దు చేయాల్సిందేనని డిమాండ్ చేయాల్సిన తరుణం ఆసన్నమైందని భారత కమ్యూనిస్టుపార్టీ విశ్వసిస్తున్నది. ఈ సమస్యపై సిపిఐ నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చర్చించి 29న ‘డిఫెండ్ ఫెడరలిజం డే’ పిలుపు ఇచ్చింది” అని డి.రాజా తన ఎన్‌ఇసి నివేదికలో తెలియజేశారు. కాగా ఎన్‌ఇసి మొదట సమావేశం కాగానే విజయవాడలో అక్టోబరు నెలలో జరిగిన సిపిఐ జాతీయ కాంగ్రెస్ మహాసభలపై సమావేశం సమీక్ష జరిపిందని, సమావేశాలు విజయవంతంగా జరిగాయని, కొత్తగా ఎన్నికైన ఎన్‌ఇసి సభ్యులకు విజయవంతంగా పార్టీ బాధ్యతలు ఇచ్చిందని డి.రాజా తన ప్రకటనలో పేర్కొన్నారు.
29న దేశవ్యాప్తంగా… ‘డిఫెండ్ ఫెడరలిజం డే’
RELATED ARTICLES