ప్రత్యామ్నాయం చూపడంలో పాలకుల వైఫల్యం
ఐటి సంస్థల్లోనూ ఉద్యోగాల కుదింపు
‘వ్యవసాయ’ సంక్షోభంతో పెరిగిన నిరుద్యోగం
ప్రజాపక్షం/ ఖమ్మం పెరిగిన జనాభాకు అనుగుణంగా పెరగాల్సిన ఉపాధి వనరులు పెరగకపోగా రానురాను వట్టిపోతున్నాయి. దీనితో దేశ వ్యాప్తంగా ఉపాధి కరువై యువశక్తి వృథా అవుతున్నది. ఏటా కోట్లాది మంది వివిధ రంగాల్లో ఉత్తీర్ణులై ఉపాధి కోసం ఎదురు చూస్తున్న క్రమంలో ఉపాధి రంగం కుచించుకుపోతున్నది. లక్షలాది మంది ఉపాధి కోరుతున్న వేళ వందల మందికి కూడా ఉపాధి చూపించలేని పరిస్థితి దేశంలో నెలకొన్నది. సుమారు 140 కోట్లకు చేరుకున్న దేశ జనాభాలో సగానికి పైగా ఉన్న యువత ఉపాధి లేక, పాలక వర్గా లు ప్రత్యామ్నాయ మార్గాలను చూపక, ఏమీ చేయాలో పాలుపోక రోజులు గడిపేస్తున్నారు. పెరిగిన యాంత్రీకరణ కూడా ఉపాధి రంగానికి శాపంగా మారింది. కొన్ని వందల మంది అవసరమయ్యే పారిశ్రామిక ప్రాంతాలలో ఇప్పుడు పదుల సంఖ్యలో కూడా ఉద్యోగులు అవసరం పడని పరిస్థితి నెలకొన్నది. ఉదాహరణకు సింగరేణిలో పదేళ్ల కింద లక్షకు పైబడి కార్మికులు పనిచేసేవారు. యాంత్రీకరణ తర్వాత కార్మికుల సంఖ్య క్రమేపీ తగ్గుతూ వచ్చింది. బొగ్గు ఉత్పత్తి గణనీయంగా పెరగగా కార్మికుల సంఖ్య సగానికి పడిపోయింది. మిగిలిన రంగాలది ఇదే పరిస్థితి. దేశంలోని యువత ప్రధాన ఉపాధి మార్గంగా ఐటి రంగాన్ని ఎంచుకుంటుంది. ఇప్పు డు ఐటి రంగ సంస్థలు ఉద్యోగుల సంఖ్యను తగ్గించే పనిలో పడ్డా యి. గత ప్రభుత్వాలు ఉపాధి కోసమే కొన్ని ప్రత్యేక పనులను చేపట్టేవి. కానీ ఇప్పటి పాలకులకు ఆ ఆలోచన లేదు. భారతదేశంలో నూటికి 65 శాతం మంది ఆధారపడిన వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. ప్రకృతి వైపరీత్యాలు, పాలకుల సహాయ నిరాకరణ, గిట్టుబాటు కానీ ధరలు, పెరుగుతున్న పెట్టుబడుల నేపథ్యంలో సాగంటేనే భయపడే పరిస్థితి వచ్చింది. సన్న, చిన్నకారు రైతులే కాదు ఐదెకరాలు పైబడిన మధ్య తరగతి రైతులు సైతం వ్యవసాయ రంగాన్ని వదిలి ప్రత్యామ్నాయ రంగాల వైపు పయనిస్తున్నారు. పట్టణాల వైపు పరుగులు పెడుతూ ఏదో ఒక పని చూసుకుని జీవించడానికి అలవాటుపడుతున్నారు. కార్పొరేట్ సంస్థలకు కోట్లాది రూపాయల రుణాలను రద్దు చేయడమే గాక వేల కోట్ల రూపాయల ప్రోత్సహకాలను అందిస్తున్న పాలకులు వ్యవసాయ రంగానికి కనీస రాయితీలను కూడా అందించడం లేదు. వ్యవసాయ రంగం సంక్షోభం కారణంగా గ్రామీణ ఉపాధి తగ్గిపోయింది. ఇక చదువుకున్న నిరుద్యోగుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. ఇదే పరిస్థితి మరికొన్నేళ్ల పాటు కొనసాగితే నిరుద్యోగ భరతం సాక్ష్యాత్కరించే అవకాశం కనిపిస్తున్నది. చదువుకునేందుకు అవకాశాలు కల్పించడం ఎంత ముఖ్యమో చదివిన తర్వాత ఉపాధి చూపడం కూడా అంతే ముఖ్యమన్న వాస్తవాన్ని పాలకులు గుర్తెరగడం లేదు. దేశంలో వనరులు లేక ఒక పక్క మేధోవలస పెరుగుతుంటే మరో పక్క గాడితప్పిన యువత చెడు మార్గాల వైపు పయనించే అవకాశం ఉంది. భారతదేశంలో కరోనా తర్వాత ఆర్థిక సంక్షోభం పెరిగిపోతున్నది. పెట్టుబడితో కూడిన వ్యాపారాలు చేయలేని పరిస్థితి ఏర్పడింది. ద్రవ్య వినిమయం క్రమేపి తగ్గుతూ వచ్చింది. ఆదాయ వనరులు సన్నగిల్లిన నేపథ్యంలో పనిచేసే వారి సంఖ్యను క్రమేపి తగ్గిస్తూ వచ్చారు. కరోనా తర్వాత పరిస్థితుల్లో కూడా కోట్లాది మంది తమతమ కోలువులను కోల్పోయి వీధినపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. విద్యలో అత్యుత్తమ ప్రతిభను కనబర్చిన పనిచేసేందుకు స్థానం దొరకని పరిస్థితి. పాలకులు ఇటువంటి విషయాలపై దృష్టి సారించకుండా రాజకీయాలు, ఓట్లు, సీట్లు అంటూ లెక్కలు వేసుకుంటే ఒక ప్రమాదకర సమాజం మనముందు ఆవిష్కృతమయ్యే పరిస్థితి ఏర్పడనుంది. ఇందు కొరకు పాలకులు కేవలం అధికారంలో ఉండడమే కాకుండా భవిష్యత్తు భారతాన్ని కూడా ఊహించగలిగినప్పుడే నిరుద్యోగ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. లేదంటే దేశ ప్రజలు నిరుద్యోగంతో వచ్చే ప్రమాదాన్ని చవిచూడక తప్పదు
ఉపాధి వనరులు వట్టిపోతున్నాయ్!
RELATED ARTICLES