వచ్చే నెల 26 నుండి ‘జోడో అభియాన్’ యాత్ర
గ్రామాల్లో మోడీ ప్రభుత్వంపై చార్జిషీట్ పంపిణీ
న్యూఢిల్లీ : వచ్చే ఏడాది ఫిబ్రవరి రెండోపక్షంలో జాతీయ 85వ ప్లీనరీ సమావేశం నిర్వహిస్తామని కాంగ్రెస్‌పార్టీ ప్రకటించింది. చత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో ఈ సదస్సు జరుగుతుంది. భారత్ జోడో యాత్రకు కొనసాగింపుగా ఈ ప్లీనరీ సమావేశం మూడు రోజులపాటు నిర్వహిస్తామని కాంగ్రెస్‌పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కె.సి.వేణుగోపాల్ ఆదివారం ఉదయం పత్రికాగోష్టిలో వెల్లడించారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఏర్పాటు చేసిన కాంగ్రెస్ స్టీరింగ్ కమిటీ మొదటి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వేణుగోపాల్ చెప్పారు. ఈ స్టీరింగ్ కమిటీ సమావేశంలో ఖర్గేతోపాటు సోనియాగాంధీ, అశోక్ గెహ్లాట్, భూపేశ్ భాఘెల్, వేణుగోపాల్, చిదంబరం, ఆనంద్‌శర్మ, మీరా కుమార్, అంబికాసోనీ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా జనవరి 26వ తేదీ నుండి “హాత్ సే హాత్ జోడో అభియాన్” ప్రచార కార్యక్రమం ప్రారంభిస్తామని కూడా వేణుగోపాల్ చెప్పారు. ఈ కార్యక్రమం రెండు నెలలపాటు కొనసాగుతుందని ఆయన చెప్పారు. బ్లాక్ స్థాయి నుండి పంచాయతీస్థాయి, బూత్‌స్థాయి వరకూ పాదయాత్రలు జరరుపుతామనా అన్నారు. మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రభుత్వం చేసిన తప్పులపై చార్జిషీట్ దాఖలు చేస్తామని, దానిని ఈ యాత్రలో ప్రజలందరికీ పంచిపెడతామని చెప్పారు. కాగా ఫిబ్రవరి మూడోవారంలో జరిగే రాయ్‌పూర్ ప్లీనరీ సమావేశాల్లో రాహుల్‌గాంధీ భారత్ జోడో యాత్రపై సమీక్షా సమావేశం జరుగుతుంది. మూడు రోజులపాటు జాతీయ, అంతర్జాతీయ సమస్యలు, సంస్థాగత సమస్యలను పార్టీ చర్చించి కార్యక్రమం నిర్ణయించుకుంటుందని చెప్పారు. ఈ ప్లీనరీ ముగింపు సందర్భంగా భారీ బహిరంగ సభ కూడా చేస్తామని వేణుగోపాల్ అన్నారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, కమ్యూనికేషన్ విభాగం ఇన్‌చార్జి జైరామ్ రమేశ్ మాట్లాడుతూ, జనవరి 26 నాటికి కన్యాకుమారి నుండి ప్రారంభించిన జోడో యాత్ర శ్రీనగర్‌లో ముగుస్తుందని, అదేరోజు భారత్ జోడో అభియాన్ యాత్ర రెండునెలలపాటు గ్రామాలలో ప్రారంభం అవుతుందని చెప్పారు. మోడీ ప్రభుత్వం చేసిన తప్పిదాలపై కాంగ్రెస్‌పార్టీ దాఖలు చేసిన చార్జిషీటును గ్రామ గ్రామానా బూత్ స్థాయిల్లో ప్రజలకు పంపిణీ చేసి మోడీని ప్రజాకోర్టులో నిలబెడతామని అన్నారు. రాహుల్‌గాంధీ భారత్ జోడో యాత్ర డిసెంబరు 24వ తేదీ నాటికి ఢిల్లీలో ప్రవేశిస్తుందని, ఈ సందర్భంగా యాత్రలోని వాహనాలన్నింటీని కొద్ది రోజులపాటు సర్వీసింగ్ చేయిస్తామని చెప్పారు. రాహుల్‌గాంధీ భారత్ జోడో యాత్ర గ్రాండ్ సక్సెస్ అయిందని అన్నారు. ప్రజలు లక్షలాదిమంది భాగసాములు అవుతున్నారని చెప్పారు. ఎంతోమంది వింటున్నారని, వచ్చి మాట్లాడుతున్నారని, ప్రశ్నలు అడుతున్నారని, ఎంతో సమాచారం చెబుతున్నారని, సమస్యలు, కష్టాలు వివరిస్తున్నారని అన్నారు. రైతులు, యువకులు, మహిళలు, పెద్దలు భారీగా తరలి వచ్చారన్నారు. రాజ్యాంగాన్ని సమున్నంతంగా ఉంచడంకోసమే గాంధీ పోరాటాలు జరిగాయని అన్నారు. రాహుల్‌గాంధీ మొక్కవోని దీక్షతో ఒక తపస్సులాగా ఈ యాత్ర కొనసాగిస్తున్నారని, అందుకు ఆయనను అభినందిస్తున్నామని అన్నారు. భారతదేశంపట్ల, ప్రజలపట్ల ఆయనకు ఉన్న ప్రేమాతిశయాలు జోడో యాత్ర విజయంలో కీలకమని జైరామ్ రమేశ్ అన్నారు. భారతదేశం ఎన్నో సవాళ్ళు ఎదుర్కొంటున్నదని, కానీ ప్రధానిమాత్రం వాటన్నింటినీ అదేపనిగా కాదని తిరస్కరిస్తున్నారని విమర్శించారు.
ఫిబ్రవరిలో కాంగ్రెస్ ప్లీనరీ
RELATED ARTICLES