రహదారి నిర్మాణానికి భూములు ఇవ్వం
హన్మకొండ జిల్లా దామెర మండలంలో రైతుల ఆందోళన
ప్రజాపక్షం/వరంగల్ ప్రతినిధి నాగపూర్ గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణానికి తమ భూములు ఇవ్వమని రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఇందులో భాగంగా జాతీయ రహదారి-163 హన్మకొండ జిల్లా దామెర మండలం పసరుగొండ క్రాస్‌రోడ్‌లో రాస్తారోకో, ధర్నా నిర్వహించారు. దీంతో జాతీయ రహదారిలో రెండు గంటలపాటు ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఐదు కిలో మీటర్ల మేర ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. ఏడాది పొడవునా మూడు పంటలు పండించుకునే పంట పొలాలను ఇచ్చేది లేదని రైతులు తేల్చి చెప్పారు. గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణాన్ని వెంటనే రద్దు చేయాలని
రైతులు డిమాండ్ చేశారు. రూ. కోట్లాది రూపాయల విలువచేసే వ్యవసాయ భూములను ఇవ్వబోమని స్పష్టం చేశారు. సంబంధిత ఎన్ హెచ్ అధికారులు తమ తప్పుడు నివేదికలను ప్రభుత్వాలకు అందించడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ వ్యవసాయ బలవంతంగా బలవంతంగా లాక్కుంటే చావే శరణ్యమని తేల్చి చెప్పారు. కేవలం అంబానీ అదానీల సౌకర్యం కోసమే గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణం చేస్తున్నారని రైతులు ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో రైతులు బొల్లు సమ్మిరెడ్డి, తిమ్మాపురం రాజగోపాల్, బొల్లు శ్రీధర్ రెడ్డి, బూర్గుల రామచంద్రరావు, బొల్లు రాజిరెడ్డి, నాగభూషణం తదితరులతో పాటు వరంగల్, భూపాలపల్లి, హనుమకొండ, ఖమ్మం, పెద్దపల్లి, కరీంనగర్ తదితర ప్రాంతాల నుంచి రైతులు పాల్గొన్నారు.