HomeNewsBreaking Newsపని భారం… బతుకు దుర్భరం

పని భారం… బతుకు దుర్భరం

చాకిరీతోనే తెల్లవారుతున్న బాల్యం
న్యూఢిల్లీ:
పుస్తకాలు పట్టుకోవాల్సిన చేతుల్లో ఎంగిలి పేట్లు… పనిముట్లు. ఆనందంగా కేరింతలు కొట్టాల్సిన సమయంలో అంతులేని పని భారం. బండెడు చాకిరీతో తెల్లవారుతున్న బాల్యం. హోటళ్లు కావ చ్చు.. ఇటుక బట్టీలు కావచ్చు… మార్కెట్లు కావచ్చు… డబ్బున్న మారాజుల ఇళ్లు కావచ్చు.. ఇక్కడా, అక్కడా అన్న తేడా లేకుండా దేశంలో ఏ మూలన చూసినా బాలకార్మికులు కంటపడుతునే ఉంటారు. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన ఏ తీరున కొనసాగుతున్న దో గుర్తుచేస్తునే ఉంటారు. బడి ఈడు పిల్లలను పని లో పెట్టుకోవడం చట్టరీత్యా నేరం మాత్రమే కాదు. అత్యంత అమానవీయం. దారుణం. ఆక్షేపణీయం. పిల్లలు బాల కార్మికులుగా మారేందుకు సవాలక్ష కారణాలు ఉండవచ్చు… కానీ, ఆ సమస్యలను పరిష్కరించి, వారిని బడికి పంపడం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కనీస బాధ్యత. కుల, మత, ప్రాంత, భాషాది తేడాలు ఏవీ లేకుండా పిల్లలందరికీ ‘నిర్బంధ… ఉచిత విద్య’ అందించాలని రాజ్యాంగం స్పష్టం చేసిం ది. అది సక్రమంగా అమలవుతున్న దాఖలాలు మాత్రం కనిపించడం లేదు. దేశంలో బాల కార్మికుల సంఖ్య పెరుగుతున్నదేగానీ, తగ్గడం లేదు. అవిద్య, అధిక జనాభా, మానవ అక్రమ రవాణా, పేదరికం వంటి ఎన్నో అంశాలు బాలకార్మిక వ్యవస్థకు కారణమవున్నాయి. బానిసత్వ భావనలు రాజ్యమేలుతున్నాయి. బాలలతో ఇంటి పనులు చేయించడం సర్వసాధారణమైంది. ప్రపంచవ్యాప్తంగా 18 మిలియన్ల నిరుపేద లు బానిసల్లాగా ఇటుక బట్టీ లు, కార్పెట్‌ పరిశ్రమలు, వివిధ వస్తు తయారీ కేంద్రాల్లో పని చేస్తున్నారు. అతి ప్రమాదకర వాతావరణంలో కాలం గడుతుపుతున్నారు. శ్రమదోపిడీకి గురవుతున్నారు. పౌర హ క్కుల సంఘాల అంచనా ప్రకా రం 30 మిలియన్ల అభాగ్యులు వెట్టిచాకిరీ ఉచ్చులో కూరుకు పోయారు. దేశ జనాభాలో 1.4 శాతం మందివి బానిస బతుకులే. మన దేశంలోనే కాదు.. దాదాపుగా ప్రపంచంలోని అన్ని దేశాల్లోనూ బాలకార్మిక వ్యవస్థ కనిపిస్తూనే ఉంటుంది. కడు పేదరికం, అవిద్య, అవగాహనలేమి, పొట్ట చేత పట్టుకొని వలసలు వెళ్లడం, మూఢనమ్మకాలు, యాజమాన్యాల దోపిడీ సంస్కృతి, కేంద్ర, రాష్ట్ర స్థానిక ప్రభుత్వ వ్యవస్థల సమన్వయలోపం వంటి ఎన్నో అంశాలు, పరిస్థితులు బాల కార్మిక వ్యవస్థను పెంచి పోషిస్తున్నాయి. పరిస్థితులను చూస్తుంటే, చట్టాలు అమలవుతున్నాయా అన్న అనుమానం తలెత్తక మానదు. అడపాదడపా దాడులు తప్పిస్తే, అధికార యంత్రాంగం శ్రద్ధపెట్టి బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించే ప్రయత్నం చేయడం లేదన్నది చేదు నిజం. నేరం చేసిన యాజమాన్యాలకు శిక్షలు పడకపోవడం దుర్మార్గం. బాల కార్మిక వ్యవస్థను కఠిన చట్టాల అమలుతో కూకటి వేళ్లతో సహా పెరికివేయాలి. చాకిరీ వలలోంచి బయటపడిన వారికి పునరావాసం కల్పించాలి. చదువుకునే సౌకర్యం కల్పించాలి. పిల్లలను బలవంతంగా పనులకు పంపే తల్లిదండ్రులపైనా కూడా కఠినంగా వ్యవహరించాలి. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ఉద్దేశించి ప్రత్యేక చట్టాలు తేవాలి. బడిలో వికసించాల్సిన చిన్నారుల బతుకులు బట్టీల్లో మాడి మసిబొగ్గుగా మారడం అతి విచారకరం. వెట్టిచాకిరీ నిషేధ వ్యవస్థ చట్టం- 1976 ప్రకారం మానభంగాలు, శ్రమ దోపిడీ, హింస, దాడి, కిడ్నాప్‌లు, బలవంతంగా బంధించడం, చాకిరీ కోసమే బాలల్ని కొనడం, చట్టవ్యతిరేకంగా నేర వృత్తిలోకి దించడం వంటి అమానవీయ చర్యలకు పూనుకున్న వారికి 10 ఏండ్ల వరకు జైలుతో పాటు జరిమానా కూడా పడుతుంది. కానీ, ఈ చట్టం అమలు సరిగ్గా లేదనడానికి బాలలపై అకృత్యాలు కొనసాగడమే నిదర్శనం. బాలల న్యాయ చట్టం-1986 ప్రకారం బాలలను బలవంతంగా పనుల్లో వినియోగించడం, నేరప్రవృత్తిని పెంచి పోషించే నేరానికి 3 ఏండ్ల వరకు కారాగారవాసం ఇవ్వవచ్చు. దీని పరిస్థితి కూడా అంతే. బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించే చర్యలను చేపట్టడంలో పూర్తిగా విఫలం అవుతున్నాయన్నది యదార్థం. ఆకలి కోరల్లో బతుకులు ఈడుస్తున్న అభాగ్యులు మరో మార్గం తోచని దుస్థితిలో బాల కార్మికులుగా మారుతున్నారనే వాస్తవాన్ని మరచిపోకూడదు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి ప్రభుత్వాల కర్తవ్యం. ఆ సమస్యకు తెరపడితేగానీ, కొంతవరకైనా బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన సాధ్యం కాదు. ఇటీవల కాలంలో బాలలతో పనులు చేయించుకోవడమేగాదు.. వారిపై లైంగిక వేధింపులు కూడా పెరుగుతున్నాయి. సభ్య సమాజం తలదించుకునేలా అత్యాచార ఘటనలు వెలుగుచూస్తున్నాయి. ఆరు నెలల చిన్నారని కూడా కామాంధులు వదలడం లేదంటే, పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. పొక్సో, నిర్భయ వంటి ఎన్ని చట్టాలు వచ్చినా లైంగిక వేధింపుల కేసులు పెరుగుతునే ఉన్నాయి. నేరం రుజువుకావడానికి, శిక్ష పడడానికి ఏళ్లూపూళ్లూ గడవడం, అప్పటి వరకూ నేరస్థులు స్వేచ్ఛగా తిరిగే అవకాశం ఉండడం కూడా ఈ దుస్థితికి ఓ కారణం. చట్టాలో లొసుగులను సవరించి, పకడ్బందిగా అమలు చేసి, దోషులను వేగంగా శిక్షించే విధానాలను రూపొందిస్తేగానీ, బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించలేం. చిన్నారులపై లైంగిక వేధింపులను నిలువరించలేం. నవంబర్‌ 14న మన దేశంలో బాలల దినోత్సవం ఉత్సాహంగా జరుపుకొంటున్నాం. మంచిదే. కానీ, బాలలకు వెట్టి చాకిరీ నుంచి, వేధింపుల నుంచి విముక్తి లభించనంత వరకూ ఇలాంటి ఎన్ని ఉత్సవాలు నిర్వహించినా ఫలితం ఉండదు

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments