HomeNewsBreaking News‘మధ్యాహ్న భోజన’ వంటకార్మికుల వేతనాలు పెంచాలి

‘మధ్యాహ్న భోజన’ వంటకార్మికుల వేతనాలు పెంచాలి

ఎఐటియుసి జాతీయ కార్యదర్శి బివి విజయలక్ష్మి డిమాండ్‌
హనుమకొండలో ఘనంగా మధ్యాహ్న భోజన వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర ద్వితీయ మహాసభలు
ప్రజాపక్షం/వరంగల్‌ ప్రతినిధి
ప్రభుత్వ మధ్యాహ్న భోజన పథకంలో పనిచేస్తున్న వంట కార్మికుల వేతనాలు పెంచాలని ఎఐటియుసి జాతీయ కార్యదర్శి బివి విజయలక్ష్మి డిమాండు చేశారు. ఆదివారం హనుమకొండలోని అమృతగార్డెన్స్‌లో తెలంగాణ మధ్యాహ్న భోజన వర్కర్స్‌ యూనియన్‌ (ఎఐటియుసి అనుబంధం) రెండవ రాష్ట్ర మహాసభలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మధ్యాహ్న భోజన వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షురాలు పి.ప్రేమ్‌పావని, రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జంపాల రవీందర్‌ అధ్యక్షతన జరిగిన రెండవ మహాసభల్లో బివి విజయలక్ష్మి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. తొలుత మహాసభల ప్రాంగణంలో యూనియన్‌ జాతీయ ఉపాధ్యక్షులు కమలారెడ్డి జెండావిష్కరించారు. మహాసభల సందర్భంగా బివి విజయలక్ష్మి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలనే లక్ష్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ప్రవేశపెట్టిన మధ్యాహ్న భోజన పథకంలో పనిచేస్తున్న వంట కార్మికులకు కనీస వేతన చట్టాన్ని అమలు చేయడం లేదని, దీంతో శ్రమ దోపిడీకి గురవుతున్నారన్నారు. పాఠశాలల్లో కార్మికులు సొంత డబ్బులతో సరుకులు కొనుగోలు చేసి విద్యార్థులకు భోజనం అందిస్తే బిల్లులు సకాలంలో రావడం రాక కార్మికులు అప్పుల పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యపై ఎఐటియుసి ఆందోళన నిర్వహించగా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు వంట కార్మికులకు రూ.3 వేలు గౌరవ వేతనం ఇస్తామని అసెంబ్లీలో ప్రకటించినప్పటికీ, అది నేటికీ అమలు కావడం లేదన్నారు. ప్రభుత్వం పెంచిన వేతనాలు అమలు చేయడంతో పాటు వంటపాత్రలు, గ్యాస్‌ ఉచితంగా అందించాలని కోరారు. ఎఐటియుసి రాష్ట్ర అధ్యక్షుడు ఎస్‌.బాలరాజు మాట్లాడుతూ వంట కార్మికులకు జరుగుతున్న శ్రమదోపిడీ విధానంపై పోరాటం నిర్వహించాలన్నారు. వంట కార్మికుల న్యాయమైన పోరాటానికి ఎఐటియుసి అండగా ఉంటుందన్నారు. ఈ మహాసభల్లో తెలంగాణ మధ్యాహ్న భోజన వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొరిమి సుగుణ నివేదిక ప్రవేశపెట్టగా ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నేదునూరి జ్యోతి, హనుమకొండ జిల్లా కార్యదర్శి కె.భిక్షపతి, ఎఐటియుసి జిల్లా అధ్యక్షుడు తోట భిక్షపతి, నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ ఉద్యోగుల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేష్‌ ఖన్నా, మధ్యాహ్న భోజన వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర నాయకులు పూసాల రమేష్‌, ఎస్‌.విజయలక్ష్మి, కుంటాల రాములు, బోయిన ప్రసాద్‌, ఎ.లక్ష్మన్‌, జిల్లా ఎఐటియుసి, సిపిఐ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments