ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న ప్రధాని
సింగరేణిలో ప్రైవేటు ఉత్పత్తిని అడ్డుకుంటాం : కూనంనేని
ప్రజాపక్షం/ ఖమ్మం దేశ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించి పార్లమెం టు భవనానికి ప్రణమిల్లిన మోడీ… ఇప్పుడు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఆరోపించారు. హిట్లర్‌ను మించిన ఫాసిస్టుగా, నియంతగా మోడీ వ్యవహరిస్తున్నారని విమర్శించారు. దోపిడీదారులకు నాయకుడు మోడీనేనన్నారు. ఆదివారం ఖమ్మం సిపిఐ జిల్లా కార్యాలయం గిరిప్రసాద్ భవన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో కూనంనేని మా ట్లాడారు. మోడీ రాక సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా 7వేల మంది సిపిఐ కార్యకర్తలను అరెస్టు చేశారని, గతంలో రాజులను ప్రశ్నిస్తే జైళ్లకు పంపినట్లు మోడీని ప్రశ్నించే వారందరినీ అరెస్టులు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజాస్వామ్య స్ఫూర్తి కొరవడిందని తెలిపారు. రెండేళ్ల క్రితం ప్రారంభమై ఉత్పత్తిని కొనసాగిస్తున్న ఎరువుల కర్మాగారాన్ని ఇప్పుడు జాతికి అంకితం చేయాల్సిన అవసరం ఏముందని, జాతికి అంకితం చేసిన సందర్భంలోనైనా ఎరువుల కర్మాగారాన్ని ప్రైవేటుకు కట్టబెట్టబోమని హామీ ఇస్తారని సిపిఐగా ప్రశ్నించామన్నారు. ప్రధానిగా తెలంగాణ రాష్ట్రంలో పర్యటించే హక్కు ఉండవచ్చు కానీ నైతికంగా ఆ హక్కును మోడీ కోల్పోయారన్నారు. భారతదేశంలో అన్ని రంగాలకు చెందిన జాతీయ స్థాయి సంస్థలన్నింటినీ ప్రైవేటీకరణ పేరుతో అంబాని, ఆదానీలకు కట్టబెడుతున్నారని, ఈ క్రమంలోనే సింగరేణి, బ్యాంకులు, ఎల్‌ఐసి, రైల్వేలు, పౌర విమానయానం, ఉక్కు కర్మాగారాలు సహా అన్నింటినీ విక్రయిస్తుంటే ఎరువుల కర్మాగారాన్ని కూడా విక్రయించేందుకే జాతీయం చేస్తున్నారని ప్రశ్నించడం తప్పా అన్నారు. ఇటీవల పార్లమెంటులో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మానిటైజేషన్ పైపులైన్ పేరుతో రూ. 6 లక్షల కోట్ల ఆదాయాన్ని సంపాదించాలని ప్రతిపాదన చేశారని సాంబశివరావు తెలిపారు. ఇటువంటి పరిస్థితుల్లో మోడీని ఎందుకు ప్రశ్నించకూడదో బిజెపి, దానిని సమర్థిస్తున్న వారు చెప్పారని కూనంనేని డిమాండ్ చేశారు. మోడీ పాలనలో దేశం అదోగతి పాలవుతుందని, ఆకలిలో 107 శాతంగా, సంపద కేంద్రీకరణలో 99 శాతం ఉండగా, ఇక ద్రవ్యోల్బణం గణనీయంగా పెరిగిపోతుందన్నారు. నోట్ల రద్దు ఆర్థికంగా దేశాన్ని దెబ్బతీసిందని… ఇప్పుడు ప్రధాని ఏమి సమాధానం చెబుతారని కూనంనేని ప్రశ్నించారు. ప్రభుత్వాన్ని కూలదోయడానికి కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నారని, ఇప్పటికే ఎనిమిది రాష్ట్రాల ప్రభుత్వాలను కూల్చివేశారని, ఈ ఘనత ప్రధాని మోడీకే దక్కిందన్నారు. దేశంలో శ్రీలంక దేశ పరిస్థితులే కనిపిస్తున్నాయని, పెద్ద దేశం కావడంతో ప్రజల మనోభావాలు బహిర్గతం కావడానికి సమయం పడుతుందన్నారు.
సింగరేణిలో ప్రైవేటు ఉత్పత్తిని అడ్డుకుంటాం :
సింగరేణికి సంబంధించి ప్రధాని మోడీ మాటల గారడీ చేస్తున్నారని, అబద్ధాలతో ప్రజలను నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారని సాంబశివరావు తెలిపారు. కోయగూడెం ఒసిని విజయసాయిరెడ్డి అల్లుడికి చెందిన అరవిందో కంపెనీకి కట్టబెట్టారని, శ్రావణపల్లి కెకె -6, ఒసి-3 మొదలైన బొగ్గు నిక్షేపాలను వెలికితీసేందుకు ప్రైవేటు వ్యక్తులకు సింగిల్ టెండర్ ద్వారా కట్టబెట్టే ప్రయత్నం జరుగుతుందని, దీనిని సిపిఐ, ఎఐటియుసి ఆధ్వర్యంలో అడ్డుకుంటామన్నారు. 2015లో జాతీయ స్థాయిలో తీసుకొచ్చిన చట్టసవరణ కారణంగానే గనులు ప్రైవేటు వ్యక్తులకు అప్పగించే అవకాశం ఏర్పడిందని, దీంతో 88 బ్లాక్‌లను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించే కుట్రకు మోడీ సర్కార్ తెరలేపిందన్నారు. కోయగూడెం సహా ప్రైవేటు సంస్థల బొగ్గుఉత్పత్తిని అడ్డుకుంటామని ఆయన హెచ్చరించారు. బిజెపి వ్యతిరేక పోరాటం మరింత ఉధృతం చేస్తామని, కమ్యూనిస్టులను విమర్శించే వారికి నైతికత లేదని సాంబశివరావు తెలిపారు. మతోన్మాద చర్యలకు పాల్పడే వారిని, పేదలను విస్మరించి పాలన సాగించే వారిని తమ పోరాటాలతో నిలువరిస్తామని పేర్కొంటూ ఎన్నికలు, పొత్తులు కేవలం తాత్కాలిక ఎత్తుగడలు మాత్రమేనన్నారు. ఈ సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దండి సురేష్, రాష్ట్ర సమితి సభ్యులు జమ్ముల జితేందర్‌రెడ్డి, ఎస్‌కె జానిమియా, కొండపర్తి గోవిందరావు, సిద్దినేని కర్ణకుమార్ పాల్గొన్నారు.
దోపిడీదారులకు మోడీయే నాయకుడు
RELATED ARTICLES