న్యూఢిల్లీ: ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ (ఎఐసిసి) అధ్యక్షుడిగా మల్లికార్జున ఖర్గే బుధవారం నాడు ప్రమాణం చేశారు. ఇటీవల ఎఐసిసి అధ్యక్ష స్థానానికి జరిగిన ఎన్నికలో శశి థరూర్‌పై ఖర్గే విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ ఎన్నిక ధ్రువపత్రాన్ని ఖర్గేకు రిటర్నింగ్ అధికారి మధుసూదన్ మిస్త్రీ అందచేశారు. అనంతరం ఖర్గేకు ఎఐసిసి అధ్యక్ష బాధ్యతలను ప్రస్తుత తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ అప్పగించారు. 214 ఏళ్ల తర్వాత గాంధీయేతర కుటుంబానికి చెందిన వ్యక్తి కాంగ్రెస్ అధ్యక్ష పీఠా న్ని అధిరోహించా రు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఖర్గే మాట్లాడుతూ సవాళ్లను ఎదుర్కోవడానికి తాను సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు.ఈ ఏడాది హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాలకు ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల నోటిఫికేషన్ ఇప్పటికే విడుదలకాగా, గుజరాత్ ఎన్నికల షె డ్యూల్ ఖరారు కావాల్సి ఉంది. ఈ ఎన్నికలు సహజంగానే ఖర్గే కు ప్రధాన సవాలుగా మారనున్నాయి. 2024 సార్వత్రిక ఎన్నికల్లో మోడీ సర్కారును ఓడించకపోతే, కాంగ్రెస్ మరింతగా కష్టాల్లో కూరుకుపోతుందనేది వాస్తవం. కాబట్టి పార్టీని ఇప్పటి నుంచే సంస్థాగతంగా బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. ఇటీవల రాజస్థాన్‌లో నిర్వహించిన చింతన్ శిబిర్‌లో తీసుకున్న నిర్ణయాలను అమలు చేయాల్సిన బాధ్యత కూడా ఖర్గేపై ఉంది. పార్టీలో 50 ఏళ్లలోపు వారినికి 50 శాతం పదువులు ఇవ్వాలన్నది ఆ తీర్మానాల్లో కీలకమైనది. సాధారణ కార్యకర్త నుంచి అంచెలంచెలుగా ఎదిగి, ఎఐసిసి అధ్యక్ష పదవిని దక్కించుకున్న దళిత నేత ఖర్గే పార్టీపై తనదైన ముద్ర వేయాలన్న ఆలోచనలో ఉన్నారు. అందరితోనూ చర్చించి, సలహాలు, సంప్రదింపులు జరిపిన తర్వాతే నిర్ణయాలు తీసుకుంటానని ఆయన ప్రకటించారు. మరో రెండు వారాల్లోనే హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీకి జరిగే ఎన్నికలకు పార్టీ శ్రేణులను సిద్ధం చేయడం ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. అదే విధంగా వచ్చే ఏడాది చత్తీస్‌గఢ్, రాజస్థాన్‌సహా తొమ్మిది రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉంటాయి. కాబట్టి ఖర్గే నిరంతరం శ్రమించక తప్పదు. ఇది అత్యంత సంక్లిష్టమైన సమయమన్న విషయం తనకు తెలుసునని ఖర్గే అన్నారు. కాంగ్రెస్ ద్వారా దేశంలో స్థిరపడిన ప్రజాస్వామిక విలువలను కాలరాసే ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ ఆయన పరోక్షంగా కేంద్రంలోని బిజెపి సర్కారుపై విమర్శలు గుప్పించారు. ఆ ప్రయత్నాలను అడ్డుకోవడం కూడా తమ కర్తవ్యమని అన్నారు.
‘డరో మత్’ నినాదం..
పార్టీ శ్రేణులను కాంగ్రెస్ నూతన అధ్యక్షుడు ఖర్గే ‘డరో మత్’ (భయం వద్దు) నినాదంతో ముందుకు నడపనున్నారు. 80 ఏళ్ల ఖర్గే తన అపారమైన అనుభవంతో పార్టీకి అత్యుత్తమ సేవలు అందిస్తారన్న విశ్వాసం వ్యక్తమవుతున్నది. బిజెపితోసహా మతత్వాన్ని ప్రేరేపించే, ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేసే శక్తులను ఎదుర్కోవాలని, ఈ క్రమంలో భయపడరాడదని ఆయన పార్టీ కార్యకర్తలు, నాయకులకు పిలుపునిచ్చారు. దేశం ఎదుర్కొంటున్న సమస్యలకు సరైన పరిష్కారాలు కాంగ్రెస్ మాత్రమే ఇవ్వగలుగుతుందని పేర్కొన్నారు. బిజెపిని ఓడించడమే ధ్యేయంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. పార్టీ అధ్యక్షుడిగా ఖర్గే బాధ్యతలు స్వీకరించే కార్యక్రమానికి సీనియర్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఎఐసిసి ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా తదితరులు హాజరయ్యారు.
ఎఐసిసి అధ్యక్షుడిగా ఖర్గే ప్రమాణ స్వీకారం

RELATED ARTICLES