HomeNewsBreaking News‘రోజ్‌ గార్‌' మేళాతో ప్రధాని కొత్త నాటకం

‘రోజ్‌ గార్‌’ మేళాతో ప్రధాని కొత్త నాటకం

నిరుద్యోగ యువతీ యువకులను మరోసారి మభ్యపెట్టేందుకు తెరలేపిన మోడీ
టిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కెటి రామారావు
ప్రజాపక్షం/హైదరాబాద్‌
\‘రోజ్‌ గార్‌’ మేళా పేరుతో తాజాగా 10 లక్షల ఉద్యోగాల రిక్రూట్‌మెంట్‌ అంటూ ప్రధానమంత్రి నరేంద్రమోడీ నిరుద్యోగ యువతీ యువకులను మరోసారి మభ్యపెట్టేందుకు కొత్త నాటకానికి తెరలేపారని టిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కెటి. రామారావు అన్నారు. హిమాచల్‌, గుజరాత్‌ ఎన్నికల నేపథ్యంలో మోడీది కొత్త డ్రామ అని విమర్శించారు. ‘నమో అంటేనమ్మించి మోసం చేసేవాడ’ని రుజువైందన్నారు. చిత్తశుద్ధితో, దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేపట్టాలని ఆయన ప్రధాని మోడీని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్రమోడీకి కెటిఆర్‌ మంగళవారం బహిరంగ లేఖ రాశారు. ‘రోజ్‌ గార్‌’ మేళాతో దేశ యువత సంతోషం ఎక్కువ రోజులు ఉండేది కాదనే విషయం అర్థమైందని, ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలను భర్తీ చేస్తామని ప్రకటించిన మోడీ మాటలు నమ్మి 8 ఏళ్లలో 16 కోట్ల ఉద్యోగాల కోసం నిరుద్యోగ యువత ఆశతో ఎదురు చూస్తున్న పరిస్థితి నెలకొన్నదని కెటిఆర్‌ ఆ లేఖలో పేర్కొన్నారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పి, ఆ సంఖ్యను 10 లక్షలకు కుదించి, కేవలం 75 వేల మందికి మాత్రమే నియామక పత్రాలను అందజేశారన్నారు. మోడీ పరిపాలన వైఫల్యం అడ్డగొలు అర్థిక విధానాలతో దేశ ఆర్థిక వ్యవస్థ నేల చూపులు చూస్తున్నదని గుర్తు చేశారు. కోట్ల ఉద్యోగాలు హామీనిచ్చి, కేవలం వేల ఉద్యోగాలతోనే సరిపెడుతూ పదే పదే నిరుద్యోగ యువతతో పరిహాసం అడుతున్నట్లుగా ఉన్నదని అభిప్రాయపడ్డారు. బిజెపి ప్రభుత్వం నిత్యం ప్రదర్శించే ఆర్భాటపు ప్రచారమే తప్పిస్తే మరొకటి కాదని మరోసారి ప్రజలకు అర్థమైందన్నారు. రోజ్‌ గార్‌ మేళా పేరుతో కబేళాలో బలి పశువుల మాదిరి నిరుద్యోగ యువతను మోసం చేస్తున్నారన్నారు. నిరుద్యోగులను మోసం చేస్తే ‘మీ’ (బిజెపి ప్రభుత్వం) పాలనపైన తిరగబడే రోజు త్వరలోనే వస్తుందనే విషయాన్ని గుర్తించాలని కెటిఆర్‌ సూచించారు. 8 ఏళ్లలో జూన్‌ 2022 నాటికి కేంద్రం భర్తీ చేసిన ఉద్యోగాల సంఖ్య కేవలం 7 లక్షలు మాత్రమేనని, ఇంకా భర్తీ చేయాల్సిన ఉద్యోగాలు సూమారు 16 లక్షలున్నాయని వివరించారు. 38 శాఖల్లో మొత్తం ఇంకా ఎన్ని ఖాళీలు ఉన్నాయో, వాటిని ఎప్పటి వరకు భర్తీ చేస్తారో స్పష్టం చేస్తూ, జాతీయ జాబ్‌ క్యాలెండర్‌ను విడుదల చేయగలరా అని కెటిఆర్‌ ఆ లేఖలో ప్రశ్నించారు.
ఉద్యోగాల భర్తీపై శ్వేతపత్రం విడుదల చేస్తారా?
బిజెపి కేంద్ర ప్రభుత్వ ఎనిమిదేళ్ల పాలనలో ఉద్యోగాల భర్తీపైన శ్వేత పత్రం విడుదల చేయగలరా అని కెటిఆర్‌ ప్రశ్నించారు. మూడున్నర కోట్ల తెలంగాణ జనాభాకు రాష్ట్రం వచ్చిన 8 ఏళ్లలో సుమారు 1,50,000 ఉద్యోగాలను భర్తీ చేశామని, మరో 91 వేలకు పైగా ఉద్యోగాలు భర్తీ చేసే ప్రక్రియ ప్రారంభించామని వివరించారు. రాష్ట్రంలోనే దాదాపు 2,50,000 ఉద్యోగాలకుపైగా భర్తీ చేస్తున్నపుడు, 130 కోట్ల దేశ జనాభాలో కేంద్రం భర్తీ చేసిన ఉద్యోగాలెన్ని? దాని శాతమెంత ? అని ప్రశ్నించారు. దేశంలో ప్రతి ఏటా 2 లక్షలకు పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు రిటైరవుతున్నప్పటికీ కనీసం ఏటా 50 వేల ఉద్యోగాలను కూడా కేంద్రం సరిగ్గా భర్తీ చేయలేదని విమర్శింరారు. ప్రభుత్వ రంగ సంస్ధల అమ్మకాల పందేరంతో సుమారు రెండున్నర లక్షల మంది ఇప్పటికే రెగ్యులర్‌ ఉద్యోగాలు కోల్పోయారని, ప్రభుత్వ రంగ సంస్ధలో సుమారు 50 శాతం ఉన్న రిజర్వుడ్‌ కేటగిరిలకు చెందిన వారికి భవిష్యత్తులోనూ శాశ్వతంగా ఉద్యోగావకాశాలు దొరకకుండా పోతున్నాయని తెలిపారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments