HomeNewsBreaking Newsతదుపరి సిఎం కెటిఆరే!

తదుపరి సిఎం కెటిఆరే!

మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు
ప్రజాపక్షం/హైదరాబాద్‌ టిఆర్‌ఎస్‌లో కెసిఆర్‌ తర్వాత మంత్రి కెటి.రామారావే ముఖ్యమంత్రి అవుతారని సాంస్కృతిక, ఆబ్కారీ శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. భవిష్యత్‌లో కెసిఆర్‌ కేంద్రంలో కీలక పాత్ర పోషిస్తే, ఆయన తర్వాత కెటిఆర్‌కే అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు. అందుకే మునుగోడు నియోజకర్గాన్ని దత్తత తీసుకుంటానని కెటిఆర్‌ హామీనిచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. హైదరాబాద్‌లోని టిఆర్‌ఎస్‌ఎల్‌పి కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంఎల్‌ఎ కె. మహేష్‌రెడ్డి, ఎంఎల్‌సి వి.గంగాధర్‌ గౌడ్‌తో కలిసి మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ మాట్లాడుతూ మునుగోడు ఉపఎన్నికల్లో బిజెపి నేతలు మాట్లాడుతున్న తీరు సరిగ్గా లేదని, ప్రజలకు ఆ పార్టీ నేతలు మాయమాటలు చెబుతున్నారని ఆరోపించారు. ఎన్నికల కమిషన్‌, కేంద్ర ప్రభుత్వం తమ చేతుల్లో ఉందని బిజెపి నేతలు కుట్రలు చేస్తున్నారన్నారు. అంబానీ, ఆదానీల డబ్బులతో బిజెపి గెలుద్దామనుకుంటుందని, దేశంలో మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాటం చేసేందుకు మతోన్మాద వ్యతిరేక శక్తులు పోరాటం చేయాలన్నారు. బిజెపిని ఓడించే దమ్ము కాంగ్రెస్‌కు లేదని, మునుగోడులో గెలిచిన తర్వాత దేశంలో బిజెపిని ఎదుర్కొనేందుకు కెసిఆర్‌ బయల్దేరుతారన్నారు. కుట్రతోనే బిజెపి నేతలు మునుగోడు ఉప ఎన్నికకు తెరలేపారని ఆరోపించారు. కాంగ్రెస్‌కు తెలంగాణలో భారత్‌ జోడో యాత్ర ముఖ్యమా?, మునుగోడు ఉప ఎన్నిక ముఖ్యమా అని ప్రశ్నించారు. అందరూ భారత్‌ జోడో యాత్రలో ఉంటే మునుగోడులో కాంగ్రెస్‌కు పని చేసేదేవరని, బిజెపికి సాయం చేయడానికి ఇదోక కుట్ర అని ఆరోపించారు. మునుగోడు ప్రజలు టిఆర్‌ఎస్‌ వైపే ఉన్నారని, అందుకే ప్రజలను గందరగోళ పరిచే పనిలో బిజెపి ఉన్నదన్నారు. కేంద్రంలోని బిజెపి సర్కార్‌ చేసింది ఏమీ లేదని, చెప్పుకోవడం చేతకాకనే కెసిఆర్‌, కెటిఆర్‌ మీద విమర్శలు చేస్తోందన్నారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అడ్డగోలుగా మాట్లాడుతున్నారన్నారు. మోడీ అనగానే ప్రజలకు గుర్తొచ్చేది గ్యాస్‌ సిలిండర్‌ అని,పెరిగిన ధరలను గుర్తుంచుకుని బిజెపికి తగిన బుద్ధి చెబుతారన్నారు. కరోనా వ్యాక్సిన్‌ను మోడీని కనిపెట్టారని చెబుతున్న బిజెపి నేతలు, ఇందుకు మోడీకి నోబెల్‌ బహుమతి ఇవ్వాలని ఎందుకు దరఖాస్తు చేసుకోలేదని ఎద్దేవా చేశారు. పవన్‌ కళ్యాణ్‌ తెలంగాణలో పోటీ చేయవచ్చని, గతంలో చిరంజీవి పార్టీ పోటీ చేయలేదా అని శ్రీనివాస్‌ గౌడ్‌ ప్రశ్నించారు. గంగాధర్‌ గౌడ్‌ మాట్లాడుతూ బిసి గురుకులాలకు కేంద్రం నయా పైసా ఇచ్చింది లేదని ఆరోపించారు. ప్రతి గురుకుల విద్యార్థి పై కెసిఆర్‌ ప్రభుత్వం లక్షా 20 వేల రూపాయలు వెచ్చిస్తోందన్నారు. కె. మహేష్‌ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాలు దేశంలో మరెక్కడా అమలు కావడం లేదన్నారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments