11 మంది బిల్కిస్ బానో గ్యాంగ్‌రేప్ దోషుల విడుదలపై
గుజరాత్ సమాధానం పట్ల సుప్రీంకోర్టు అసంతృప్తి
న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన బిల్కిస్ బానో గ్యాంగ్ రేప్ కేసులో దోషులుగా తేలి, జైలు శిక్ష అనుభవిస్తున్న 11 మందిని విడుదల చేయడం లో గుజరాత్ ప్రభుత్వం ఇచ్చిన సమాధానం పట్ల సుప్రీం కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. స్థూలంగా సమాచారాన్ని ఇచ్చా రే తప్ప వాస్తవ ప్రకటనలు ఎక్కడ? అని ప్రశ్నించింది. దోషులను విడుదల చేయడానికిగల కారణాలు సమగ్రంగా వివరించకుండా, గతంలో వివిధ కోర్టులు ఇచ్చిన తీర్పుల ప్రస్తావనకే ప్రాధాన్యమిచ్చినట్టు పేర్కొంది. గుజరాత్ ప్రభుత్వం సమర్ఫించిన అఫిడవిట్‌పై కౌంటర దాఖలు చేయాలని పిటిషనర్లను కోరు తూ కేసును నవంబర్ 29వ తేదీకి వాయిదా వేసింది. 2002 ఫిబ్రవరి 27న గోద్రా స్టేషన్లో రైలుకు కొంత మంది దుండగులు నిప్పుపెట్టిన ఘటనకు ప్రతీకారంగా గుజరాత్లో అల్లర్లు చెలరేగాయి. మార్చి 3న సుమారు 20 నుంచి 30 మంది బిల్కిస్ బానో కుటుంబంపై దాడి చేశారు. ఆమె ఆరేళ్ల కూతురుసహా ఆ కుటుంబ సభ్యులను హతమార్చారు. బిల్కిస్‌పై సామూహిక అత్యాచారం జరిపారు. ఈ కేసులో 11 మందిని దోషులుగా తేల్చిన కోర్టు 2008లో 15 సంవత్సరాల కారాగార శిక్ష విధించింది. కాగా, ఈ ఏడాది ఆగస్టు 15న జైలు శిక్ష అనుభవిస్తున్న వీరిని గుజరాత్ ప్రభుత్వం విడుదల చేసింది. ఈ నిర్ణయంపై దేశమంతటా నిరసన వ్యక్తమైంది. అత్యాచారానికి పాల్పడిన వారిని విడుదల చేయడం దుర్మార్గమన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది. ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను విచారిస్తున్న సుప్రీం కోర్టు, గుజారాత్ ప్రభుత్వాన్ని వివరణ కోరింది. దోషులను ఎందుకు విడుదల చేశామనే విషయంలో తమ వాదనను వివరిస్తూ గుజరాత్ సర్కారు అఫిడవిట్‌ను కోర్టు ముందు ఉంచింది. దోషులు అప్పటికే 14 సంవత్సరాల జైలు శిక్షను పూర్తి చేసుకున్నారని పేర్కొంది. వారి సత్ప్రవర్తన కారణంగా విడుదల చేసినట్టు వివరించింది. ఆజాదీకి అమృతోత్సవ్‌లో భాగంగా వారికి మినహాయింపు ఇవ్వలేదని, 1992లో ఖైదీల ముందస్తు విడుదలపై జారీ అయిన మార్గదర్శకాలను అనుసరించే ఆ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. అయితే, గుజరాత్ ప్రభుత్వం ఇచ్చిన సమాధానంపై సుప్రీం కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. అసలైన అంశాలను ప్రస్తావించకుండా, కేవలం గతంలో వచ్చిన కోర్టు తీర్పులనే పేర్కొంటూ, వాస్తవ ప్రకటనలు విస్మరించడాన్ని తప్పుపట్టింది.
రేపిస్టులకు మద్దతు…. ప్రధానిపై రాహుల్ విమర్శ
ఎర్రకోట నుంచి చేసే ప్రసంగంలో మహిళల పట్ల ఎంతో గౌరవమర్యాదలు ఉన్నాయని ప్రకటించుకునే ప్రధాని నరేంద్ర మోడీ వాస్తవంలో అందుకు భిన్నంగా రేపిస్టులకు మద్దతునిస్తున్నారని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ విమర్శించారు. మహిళల పట్ల ప్రధానికి ఏమాత్రం గౌరవం లేదని ఆయన ఇచ్చిన హామీలు, చేస్తున్న చేష్టల్లో స్పష్టంగా కనిపిస్తున్నదని రాహుల్ ట్వీట్ చేశారు. బిల్కిస్ బానో కేసు నిందితులను విడుదల చేయడాన్ని సవాలు చేస్తూ సిపిఎం నాయకురాలు సుభాషిణి అలీ, రేవతి లౌల్, జర్నలిస్టు రూప్ రేఖా వర్మ దాఖలు చేసిన పిటిషన్‌పై గుజరాత్ ప్రభుత్వం ఇచ్చిన వివరణను రాహుల్ ప్రస్తావించారు. ప్రధాని రేపిస్టులకు అండగా ఉన్నారనేది బిల్కిస్ బానో కేసులో దోషుల విడుదల స్పష్టం చేస్తున్నదని వ్యాఖ్యానించారు.
వాస్తవ ప్రకటనలు ఎక్కడ?
RELATED ARTICLES