యుద్ధ వాతావరణం సృష్టిస్తున్న అమెరికా సామ్రాజ్యవాదం
ప్రజలను సమీకరించే శక్తి వామపక్షాలకే ఉంది
సిపిఐ 24వ జాతీయ మహాసభలో సందేశాల్చిన విదేశీ సౌహర్ధ ప్రతినిధులు
ప్రజాపక్షం/ కామ్రేడ్ గురుదాస్ దాస్ గుప్తానగర్ (విజయవాడ) అంతర్జాతీయంగా అమెరికా సామ్రాజ్యవాద దాహం తో నాటో తోడుగా యుద్ధవాతావరణాన్ని తీసుకువస్తున్నదని, ఇప్పటికే ఆర్థిక మాంద్యం దిశగా సాగుతున్న ప్రపంచ దేశాలను మరింత ప్రమాదకర పరిస్థితులకు నెడుతుందని పలు దేశాల కమ్యూనిస్టు పార్టీ ల ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేశారు. అనేక దేశాలలో మితవాద శక్తులు పేట్రేగిపోతూ ఫాసిజం దిశ గా సాగుతుండడం ఆందోళనకరమని, దీనిని ఎదుర్కొనేందుకు ప్రజలను చైతన్యపరిచి, సమీకరించే శక్తి వామపక్షానికే ఉన్నదని పేర్కొన్నారు. పెట్టుబడిదారీ వ్యవస్థకు ప్రత్యామ్నాయం సోషలిజం మాత్రమేనని స్పష్టం చేశారు. విజయవాడలో జరుగుతున్న సిపిఐ 24వ జాతీయ మహాసభలో పాల్గొంటున్న విదేశీ సౌహార్థ ప్రతినిధుల సందేశాలిచ్చారు. మహాసభలలో పాల్గొంటున్న ప్రతినిధులనుద్దేశించి 17 దేశాలకు చెందిన ప్రతినిధులు తమ సంఘీభావాన్ని తెలియజేస్తూ ప్రసంగించారు.అలాగే మహాసభకు హాజరుకాలేకపోయిన 32 దేశాల కమ్యూనిస్టు, వర్కర్స్ పార్టీలు సందేశాలు పంపారు. మహాసభలో ప్రసంగించిన పలు దేశాల కమ్యూనిస్టు పార్టీల సందేశాలలో ముఖ్య భాగం.
ఉక్రేన్ను నాజీ కబంధ హస్తాల నుండి విముక్తి కల్పించాలి: రష్యా
ఈ మహాసభలో అనేక మంది సోవియెట్ యూనియన్లో చదువుకున్న వారు కలిశారని, సోవియెట్ గురించి వారు గొప్పగా చెప్పడాన్ని విని సంతోషం కలిగిందని కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ రష్యన్ ఫెడరేషన్ ప్రతినిధి,ఎంపి రోమన్ కొనొనెంకో తెలిపారు. దురదృష్టవశాత్తు సోవియెట్ యూనియన్ విచ్ఛినమైందని, తరువాత రష్యా పీకలలోతు సంక్షోభంలో కూరుకుపోయిందని గుర్తు చేశారు. సోవియెట్ యూనియన్లో భాగంగా ఉన్న లూహాన్స్క్, డోన్సెక్ రిపబ్లిక్లో ప్రతి రోజు బాంబు దాడులు చేస్తున్నారని, వాటి బారి నుండి బయటపడిన వారు భయంతో బతుకుతున్నారని తెలిపారు. గతంలో జరిగిన యుద్ధంలో ఫాసిస్టులను సోవియెట్ యూనియన్ ఓడించిందన్నారు. ఇప్పటికీ పశ్చిమ దేశాలు డబ్బులు వెదజల్లుతూ, ఉక్రేయిన్లో సైన్యాన్ని మోహరిస్తూ సామ్రాజ్యవాద కాంక్షను చాటుకుంటున్నాయని తెలిపారు. ఉక్రేయిన్ సమాఖ్యను నాజీల కబంధ హస్తాల నుండి విముక్తం చేయాల్సిన అవసరం ఉన్నదని నొక్కి చెప్పారు.
బ్రిక్స్ కమ్యూనిస్టు పార్టీలు దగ్గరవ్వాలి: దక్షిణాఫ్రికా
అర్థవలసవాద ఆర్థిక వ్యవస్థల నుండి రూపాంతరం చెందేందుకు పరస్పర ఆర్థిక సంబంధాల బలోపేతం కోసం బ్రిక్స్ (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌతాఫ్రికా) సమూహం ఏర్పడిందని దక్షిణాఫ్రికా కమ్యూనిస్టు పార్టీ ప్రతినిధి ప్రిమ్రోజ్ కలూజా తెలిపారు. అదే తరహాలో బ్రిక్స్ దేశాల కమ్యూనిస్టు పార్టీలు కూడా పేదలు, శ్రామిక వర్గం కోసం సంబంధాలు బలోపేతం చేసుకొని పని చేయాలని దక్షిణాఫ్రికా కమ్యూనిస్టు పార్టీ ఆకాంక్షిస్తుందని తెలిపారు. సోషలిస్టు విప్లవం దిశగా అడుగులు వేసేందుకు బ్రిక్స్ దేశాల కమ్యూనిస్టు పార్టీలు సహకరించుకోవాలని సూచించారు. నయా ఉదారవాద దాడులు, సామ్రాజ్యవాద వ్యాప్తి నుండి మన ఆర్థిక వ్యవస్థలను కాపాడుకునేందుకు ఇప్పుడుకాకపోతే మరెన్నడూ కాదు (నౌ ఆర్ నెవర్) అని, అందుకు ప్రగతిశీల, వామపక్షశక్తులు సహకరించుకోవాలని తమ పార్టీ భావిస్తోందన్నారు. 1917 అక్టోబర్ విప్లవ స్ఫూర్తితో ‘భూమి, భుక్తి, పని’ అనే నినాదంతో 2023 అక్టోబర్ వరకు ప్రచార కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు.
క్యూబాకు అండగా నిలిచారు : క్యూబా
క్యూబా విప్లవానికి, అలాగే అమెరికా నేరపూరిత ఆర్థిక, వాణిజ్య ఆంక్షలకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటానికి సిపిఐ నిరంతర సంఘీభావంగా ఉండడం పట్ల కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ క్యూబా ప్రతినిధి అలెజాండ్రో సైమాన్కాస్ మారిన్ ధన్యవాదాలు తెలిపారు. ప్రపంచ శాంతి కోసం భారత కమ్యూనిస్టులు చేస్తున్న కృషిని అభినందించారు.
సిపిఐ ప్రతిపాదనపై హర్షం: శ్రీలంక
భారత కమ్యూనిస్టు ఉద్యమ ఏకీకరణ తక్షణ అవసరమని సిపిఐ చేసిన ప్రతిపాదన సంతోషకరమైనదని కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ శ్రీలంక ప్రతినిధి డి.ఎం.పి.దిసనాయకే అన్నారు. దక్షిణాసియా ప్రజల మధ్య బలమైన ఐక్యత అవసరమని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ ప్రాంతంలో శూన్యతను అమెరికా సామ్రాజ్యవాద విస్తరణకు వినియోగించుకుంటోందన్నారు. దీనిని ప్రతిఘటించేందుకు దక్షిణాసియా ప్రాంత కమ్యూనిస్టులు మరింత ప్రభావవంతమైన పాత్ర పోషించాలన్నారు. శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం కాస్తా రాజకీయ సంక్షోభానికి, ఆ తరువాత సామాజిక, రాజకీయ సంక్షోభాలకు దారి తీసిందని తెలిపారు.
ఏకధృవ ప్రపంచ స్వాప్నికులకు చుక్కెదురు: అమెరికా
ఏకధృవ ప్రపంచం సాధ్యమని విశ్వసించిన శక్తులు పతనమవుతున్నాయని కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ యుఎస్ఎ ప్రతినిధి హీలే స్కాట్ జోసెఫ్ అన్నారు. భారత్ సహా ప్రపంచంలో వందకు పైగా దేశాలు శక్తివంతంగా మారాయని తెలిపారు. మానవులకు మాత్రమే స్థానమున్న ఈ భూమి ప్రస్తుతం మిలిటరీ, పారిశ్రామిక శక్తుల నుండి పెను ముప్పు ఎదుర్కొంటున్నదని హెచ్చరించారు. అమెరికాలో ఆరోగ్య చికిత్సకు అయ్యే ఖర్చు కంటే తుపాకీ కొనేందుకు తక్కువ ఖర్చు అవుతుందన్నారు. అక్కడ కూడా పేదరికం ఉన్నదని, అక్కడ కనీస వేతనాలు తక్కువేనని, ఆ వేతనంతో పూర్తి సమయం పనిచేసినా డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు కిరాయికి తీసుకోవడం అసాధ్యమన్నారు.
పరస్పర సహకారం అవసరం: చైనా
చైనా సంబంధాలలో బలమైన, స్థిరమైన పురోగతిని ప్రోత్సహించేందుకు వీలుగా భారత కమ్యూనిస్టు పార్టీతో పాటు భారత్లోని ఇతర ప్రధాన రాజకీయ పార్టీలతో చైనా కమ్యూనిస్టు పార్టీ కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నదని కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ చైనా (సిపిసి) తెలిపింది. ఈ మేరకు సిపిసి కేంద్ర కమిటీ అంతర్జాతీయ విభాగం పంపిన సందేశాన్ని సిపిఐ జాతీయ మహాసభలో సిపిఐ జాతయ కార్యదర్శి పల్లభ్ సేన్ గుప్తా చదివి వినిపించారు. ప్రస్తుతం ప్రపంచమంతా శతాబ్ద కాలంలో చూడనటువంటి పెను మార్సులు, మహమ్మారి ప్రభావాలను ఎదుర్కొంటున్నదన్నారు. ఉభయ దేశాల ఉమ్మడి ప్రయోజనం కోసం చైనా, భార్ ఉమ్మడి కృషి, సహకారం అవసరమని తెలిపింది. ఇంకా మహ్మద్ షా ఆలం (కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ బంగ్లాదేశ్), ఇనాముల్ హఖీ అలీ అహ్మద్ ( వర్కర్స్ పార్టీ ఆఫ్ బంగ్లాదేశ్), లీ గౌర్య్రీరెక్ మ్లున్ మ్యారీ (ఫ్రెంచ్ కమ్యూనిస్టు పార్టీ), నికోస్ సెరిటాకిస్ (కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ గ్రీస్), చోయ్ హుయ్ చోల్(వర్కర్స్ పార్టీ ఆఫ్ కొరియా), బౌన్నెమెచౌఆన్గామ్ (లావోస్ పీపుల్స్ రివల్యూషనరీ పార్టీ), యుబరాజ్ గ్యావలి(కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ నేపాల్(యుఎంఎల్), అవెల్ మహమద్ అహ్మద్ టుగోజ్ (పీపుల్స్ పార్టీ ఆఫ్ పాలస్తీనా), పెడ్రో మిగ్యుల్ (పోర్చుగీస్ కమ్యూనిస్టు పార్టీ), అకడ్ మురాద్ (కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ టర్కీ), లామ్ వాన్ మన్ (కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ వియత్నాం)లు సందేశాలిచ్చారు.
పెట్టుబడిదారీ వ్యవస్థకు సోషలిజమే ప్రత్యామ్నాయం
RELATED ARTICLES