వామపక్ష లౌకిక శక్తుల ఐక్యతే ప్రత్యామ్నాయం
సిపిఐ జాతీయ మహాసభలో వామపక్ష నాయకుల హెచ్చరిక
ఏనుగు వెంకటేశ్వర్రావు
గురుదాస్ దాస్గుప్త నగర్ (విజయవాడ) భారతదేశ ప్రజాస్వామ్యం మునుపెన్నడు లేని రీతిలో సరికొత్త సవాళ్లను ఎదుర్కొంటున్నదని సిపిఐ (ఎం) జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారామ్ ఏచూరి, సిపిఐ(ఎం.ఎల్) లిబరేషన్ ప్రధాన కార్యదర్శి దీపాంకర్ భట్టాచార్య, అఖిలభారత ఫార్వర్డ్ బ్లాక్ ప్రధాన కార్యదర్శి దేవరాజన్ వక్కానించారు. అత్యంత తీవ్రమైన సవాళ్లను ఎదుర్కోవడానికి వామపక్ష ఐక్యతను మరింత బలోపేతం చేయాలని వారు కోరారు. సిపిఐ 24వ జాతీయ మహాసభల ప్రారంభ కార్యక్రమంలో వారు సౌహార్ధ సందేశాలిచ్చారు. ఈ సందర్భంగా ఏచూరి మాట్లాడుతూ దేశంలో బిజెపి ప్రభుత్వం హిందుత్వ వాదా న్ని దూకుడుగా ముందుకు తీసుకుపోతున్నదని, ఆర్ఎస్ఎస్ మత పరమైన ఎజెండాను బిజెపి అమలు చేస్తున్నదని ఆయ న తెలిపారు. మతపరమైన మైనార్టీలను ముఖ్యంగా ముస్లింలను లక్ష్యంగా చేసుకుని విషపూరిత ద్వేషం, హింసకు పాల్పడుతున్నదని అన్ని కోణాల నుంచి దాడికి పూనుకున్నదని ఏచూరి విమర్శించారు. భారతదేశ ఆర్థిక వ్యవస్థ పతనమవుతున్నదని కోవిడ్ మహమ్మరి సందర్బంగా ప్రభుత్వం చేసిన తప్పిదాలు ప్రజలకు శాపంగా మారి జీవనోపాధిపై తీవ్ర ప్రభావం చూపిందన్నారు. దేశ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా నిరుద్యోగం అత్యథిక స్థాయిలో నమోదైందని, పెరిగిపోతున్న ద్రవ్యోల్బణంతో లక్షలాది మందిని పేదరికంలోకి నెట్టి వేసిందని ఆయన తెలిపారు. నిరంకుశత్వం, ప్రజల జీవనోపాధిపై ప్రభుత్వ దాడులకు వ్యతిరేకంగా ప్రజల నుంచి ప్రతిఘటన తీవ్రమవుతుందన్నారు. ఏడాది పొడవునా సాగిన రైతాంగ పోరాటం వలన మోడీ ప్రభుత్వం వ్యవసాయ చట్టాలను రద్దు చేయాల్సి వచ్చిందని ఏచూరి తెలిపారు. ప్రైవేటీకరణ, లేబర్ కోడ్లను రద్దు చేయాలని, కేంద్ర కార్మిక సంఘాలు సమ్మె నిర్వహించాయని, రైతులు, కార్మికులు పోరాటాల సందర్భంగా భారీ సమీకరణలు జరిగాయని, ఇటువంటి ప్రజా పోరాటాలను మరింత ఉధృతం చేసేందుకు వామపక్ష శక్తుల ఐక్యత అవసరం అన్నారు. ప్రజాతంత్ర శక్తుల ఐక్యత విశ్లేషణాత్మక విధాన దిశతో రూపొందించాలని ఆయన తెలిపారు. కేరళలో రెండవ సారి ఎన్నుకోబడిన ఎల్డిఎఫ్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు ఆర్ఎస్ఎస్ కేంద్ర ప్రభుత్వం ఎటువంటి అవకాశం దొరికిన వదిలి పెట్టడం లేదని ఆయన తెలిపారు. భారతదేశ వ్యాప్తంగా లౌకిక ప్రజాస్వామ్య లక్షణాన్ని కాపాడేందుకు వామపక్ష లౌకిక ప్రజాతంత్ర శక్తుల ఐక్యత అత్యంత అవసరమని సిపిఐ (ఎం) విశ్వసిస్తుందని ఏచూరి తెలిపారు. భూస్వామ్య అణచివేతకు వ్యతిరేకంగా సాగిన తెలంగాణ సాయుధ పోరాటానికి ఊతమిచ్చిన ప్రాంతం విజయవాడ అని ఆయన తెలిపారు. జమీందారి వ్యవస్థ రద్దును వేదికపైకి తెచ్చిన ఈ ప్రాంతంలో కమ్యూనిస్టు పార్టీకి లోతైన మూలాలు ఉన్నాయని ఏచూరి తెలిపారు. ఈ ప్రాంతంలో కమ్యూనిస్టు పార్టీ మహాసభలను నిర్వహించడం ద్వారా వామపక్ష శక్తుల ఐక్యత మరింత బలపడుతుందని ఆయన తెలిపారు. ఆర్ఎస్ఎస్, బిజెపి ప్రభుత్వాన్ని తరిమి కొట్టేందుకు వామపక్ష ఐక్యతను బలోపేతం చేసేందుకు ఈ మహాసభలు దోహదపడాలని ఆయన కోరారు
ప్రజాస్వామ్యానికి కొత్త సవాళ్లు
RELATED ARTICLES