దీపాంకర్ భట్టాచార్య
ప్రజాపక్షం/కామ్రేడ్ గురుదాస్ దాస్‌గుప్తా నగర్ (విజయవాడ) : భారతదేశాన్ని బిజెపి దాని అనుబంధ సంస్థలు మతపరమైన దేశంగా మార్చేందుకు కుట్ర పన్నాయని సిపిఐ (ఎంఎల్) లేబరేషన్ ప్రధాన కార్యదర్శి దీపాంకర్ భట్టాచార్య విమర్శించారు. 1925లో ఆర్‌ఎస్‌ఎస్ ఆవిర్భవించిన నాటి నుంచి ఇదే రకమైన కలలు కంటున్నదని ఆయన తెలిపారు. విజయవాడలో జరుగుతున్న భారత కమ్యూనిస్టు పార్టీ 24వ జాతీయ మహాసభల్లో శనివారం సౌహార్థ సందేశాన్ని ఇచ్చారు. భట్టాచార్య మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం అధికార కేంద్రీకరణ ద్వారా భారతదేశంలోని ప్రజాస్వామ్య సంస్థలను బలహీనపరుస్తూ సంఘ్ పరివార్ శక్తులను ప్రోత్సహిస్తుందన్నారు. ఇదే సందర్భంలో సంపద కేంద్రీకరణకు కూడా బిజెపి ప్రభుత్వం ప్రయత్నిస్తుందని అన్నారు. బిజెపి ద్వారా కలుగుతున్న సామాజిక రాజకీయ ఆర్థిక విపత్తు నుండి భారతదేశాన్ని రక్షించేందుకు పోరాట శక్తులన్నీ ఐక్యం కావాలని పిలుపునిచ్చారు. భగత్‌సింగ్, అంబేడ్కర్, పూలే, పేరియార్ మొదలైన మహానేతల కలలను సాకారం చేయడానికి, శక్తివంతమైన ప్రజాస్వామ్య పునాదుల ఆధారంగా భారతదేశాన్ని పునర్ నిర్మించాలని ఆయన కోరారు. ఆర్‌ఎస్‌ఎస్ ఆలోచనలను విఫలం చేసి స్వేచ్ఛా సమానత్వం అనే రాజ్యాంగ వాగ్దానాన్ని నెరవేర్చే దిశగా భారతదేశాన్ని నడిపించాల్సిన బాధ్యత కమ్యూనిస్టులపైనే ఉందన్నారు. ఈ ప్రక్రియ మరో స్వాతంత్య్ర ఉద్యమంలా సాగుతుందని ఆశిస్తున్నానని దీపాంకర్ భట్టాచార్య తెలిపారు. కమ్యూనిస్టుల శక్తినంతా ఏకం చేయాలని ఆ శక్తిని వినియోగించుకుని మరింతగా ఎదగడానికి కమ్యూనిస్టుల కృషి జరగాలన్నారు. భారతదేశం సంస్కృతి పైన వ్యవహారిక ఆచారాల పైన బిజెపి దాని అనుబంధ సంస్థలు దాడి చేస్తున్నాయన్నారు. ఒక పక్క పాలనలో ప్రైవేటీకరణ ఊపు అందుకుంటుందని, అదే సమయంలో కులం, మతం, ఆర్థిక ప్రాతిపదికన ప్రజల మధ్య విభజన జరుగుతుందని ఆయన తెలిపారు. ఐక్య పోరాటాలను నిర్మించడం ద్వారా నిర్ణయాత్మక ప్రత్యామ్నాయ శక్తిగా కమ్యూనిస్టులు ఎదగాలని, ఆ లక్ష్యాన్ని పరిపూర్తి చేసేందుకు ఈ మహాసభలు ఉపయోగపడాలని ఆయన కోరారు.
మతపరమైన దేశంగా మార్చే కుట్ర
RELATED ARTICLES