జి.దేవరాజన్
ప్రజాపక్షం/కామ్రేడ్ గురుదాస్ దాస్‌గుప్తా నగర్ (విజయవాడ): దేశంలో మోడీ ప్రభుత్వ వినాశకర విధానాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, అన్ని రంగాలు సంక్షోభంలో చిక్కుకున్నాయని అఖిలభారత ఫార్వర్డ్ బ్లాక్ ప్రధాన కార్యదర్శి జి.దేవరాజన్ అన్నారు. మతోన్మాద మోదీ ప్రభుత్వాన్ని 2024 ఎన్నికల్లో గద్దెదించాల్సిందేనన్నారు. కమ్యూనిస్టు ఉద్యమ ఏకీకరణను నాయకులు కోరుకుంటున్నప్పుడు అభ్యంతరం ఏమి ఉంటుందన్నారు. దేశవ్యాప్తంగా ఐక్య ఉద్యమాలు అవసరమని, దేశ కార్మిక సంఘాలు మోదీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాడుతున్నాయని చెప్పారు. కార్మిక హక్కుల్ని, చట్టాలను మోదీ ప్రభుత్వం కాలరాస్తోందని అన్నారు. ఆయన శనివారం సిపిఐ 24వ జాతీయ మహాసభల్లో సౌహార్థ్ర సందేశం ఇచ్చారు. ప్రజా వ్యతిరేక విధానాలపై వామపక్షాలు ఐక్య ఉద్యమాలు చేపట్టి ప్రజలందరినీ సమీకరించాలని, ఇందుకు ప్రతి ఒక్కరు తమ వంతు కృషి చేయాలని దేవరాజన్ అన్నారు. దేశంలో వామపక్ష ఐక్య సంఘటన కోసం లౌకికవాద రాజకీయ పార్టీలన్నింటినీ ఏకతాటిపైకి తీసుకురావాల్సిన బాధ్యత సిపిఐపై ఉందన్నారు. ఆ దిశగా భవిష్యత్తు కార్యాచరణను మహాసభల సందర్భంగా సిపిఐ రూపొందిస్తుందని ఆకాంక్షిస్తున్నట్లు దేవరాజన్ తెలిపారు. ఆర్థిక వృద్ధి రోజురోజుకూ క్షీణిస్తోందని, ద్రవ్యోల్బణం పెరిగిపోతోందని, సామాన్యులు ఏమీ కొనలేని.. ఏమీ తినలేని పరిస్థితి ఉన్నదని ఆందోళన వ్యక్తంచేశారు. నోట్ల రద్దు, జీఎస్టీ అమలు తర్వాత లఘు, చిన్న, మధ్యస్థాయి సంస్థలు మూసేశారన్నారు. లక్షాలాది మంది కార్మికులు ఉద్యోగాలు, జీవనోపాధిని కోల్పోయారని, రూపాయి మారక విలువ క్షీణించిందని, నిరుద్యోగం తారాస్థాయికి చేరిందని అన్నారు. మోదీ పాలనలో ప్రజల కష్టాలు అనేకరెట్లు పెరిగినట్లు దేవరాజన్ తెలిపారు. అగ్నిపథ్ పథకాన్ని, రైతులు, కార్మికులకు సంబంధించిన నల్ల చట్టాలను ప్రస్తావించారు. దేశ సంపద ప్రైవేటుపరం కావడం, కార్మిక చట్టాల కోడీకరణ గురించీ మాట్లాడారు. బ్యాంకులు, బీమా కంపెనీలు, బొగ్గు, తపాలా, టెలిగ్రాఫ్, పోర్టు, డాక్‌లు, రక్షణ పరికరాల ఉత్పత్తి, రైల్వే, అసంఘటిత రంగాల కార్మికులలో తిరుగుబాటు వస్తోందని, తమ మనుగడ కోసం కార్మికవర్గం ఉద్యమ బాట పట్టక తప్పడం లేదని దేవరాజన్ తెలిపారు. ప్రజాస్వామ్యం మోదీ పాలనలో అనేక సవాళ్లను ఎదుర్కొంటోందని అన్నారు. పత్రికా స్వేచ్ఛ హరణను ప్రస్తావిస్తూ ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచీలో 150వ స్థానంలో భారత్ ఉందని, గతేడాది 142వ ర్యాంకులో ఉందని చెప్పారు. మొత్తం 180 దేశాల్లో భారత్‌లో పత్రికా స్వేచ్ఛ దారుణమని అన్నారు. భావ ప్రకటన స్వేచ్ఛను హరిస్తున్నట్లు తెలిపారు. దేశంలో మహిళలు, కార్మికులు, ఉద్యోగులు ఇలా అన్ని వర్గాల వారు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో వామపక్షాల ఐక్యత అవసరమని దేవరాజన్ పిలుపునిచ్చాను.
కార్మిక హక్కులు హరిస్తున్న మోడీ ప్రభుత్వం
RELATED ARTICLES