దాడులు ఆపకపోతే ఆత్మహత్య చేసుకుంటాం : సాగుదారులు
ప్రజాపక్షం/ అశ్వారావుపేట నియోజకవర్గ వ్యాప్తంగా పోడు సాగుదారులు తీవ్రంగా ఆందోళన చేస్తున్నారు. దీంతో అశ్వారావుపేట నియోజకవర్గంలో ఏ మండలంలో చూసినా పోడుభూముల వ్యవహారం రగులుతుంది. దాడులు ఆపకపోతే పురుగుల మందు తాగి సామూహిక ఆత్మహత్యలు చేసుకుంటామని పోడుసాగుదారులు మందు డబ్బాలను చేతిలో పట్టుకుని అటవీశాఖ అధికారుల వాహనాలను అడ్డగించి నిర్భందించిన సంఘటన ఆదివారం మండల పరిధిలోని గాండ్లగూడెంలో చోటు చేసుకుంది. దీంతో అటవీశాఖ అధికారులు పోలీస్, రెవెన్యూ శాఖ సహకారంతో బయటపడ్డారు. అశ్వారావుపేట మండలంలో సుమారు 6వేల ఎకరాల్లో పోడు భూములు సాగులో ఉన్నాయి. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతమైన గాండ్లగూడెం అటవీ ప్రాంతంలో సుమారు 1500 ఎకరాల వరకు మినుము పంట సాగు చేశారు. ఆ పంటలోకి పోడు సాగుదారులను వెళ్లనివ్వకుండా అటవీశాఖ అధికారులు సుమారు నెలకు పైగా ఆ ప్రాంతంలో టెంటులు ఏర్పాటు చేసి ప్రత్యేక చెక్పోస్ట్ ఏర్పాటు చేసి బేస్ క్యాంపుల్లో సిబ్బంది కలిసి షిప్టుల వారీగా అక్కడే ఉండి పోడుసాగుదారులను పంట చేలల్లోకి వెళ్లకుండా నిర్భందిస్తున్నారు. ఆదివారం గాండ్లగూడెం గ్రామానికి చెందిన గిరిజనులు అటవీశాఖ అధికారుల వాహనాలను గ్రామంలో నిలిపివేసి చుట్టుముట్టారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీస్ రెవెన్యూ సిబ్బంది అక్కడికి చేరుకుని సాగు చేసిన పంటలు జోలికి రాకుండా ఉన్నతాధికారులతో మాట్లాడి రెండు రోజుల్లో సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. దీంతో అటవీశాఖ అధికారులకు
విముక్తి లభించింది. నియోజకవర్గ వ్యాప్తంగా వేలాది ఎకరాలు పోడు భూములను వేలమంది గిరిజన నిరుపేదలు సాగు చేసుకుంటున్నారు. ప్రభుత్వ ఆదేశాలతో అటవీశాఖ అధికారులు పోడు సాగుదారులను అప్పగిస్తున్నారు. దీంతో నియోజకవర్గంలోని దమ్మపేట, ములకలపల్లి, చండ్రుగొండ, అన్నపురెడ్డిపల్లి, అశ్వారావుపేట మండలంలో ఏదో ఒక చోట పోడు పోరు రగులుతూనే ఉంది. దీనికి తోడు కొంత రాజకీయ జోక్యం కూడా ఉండటంతో ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. రాష్ట్రప్రభుత్వం పోడుసాగుదారులకు హక్కులు కల్పిస్తామని దరఖాస్తులు తీసుకోవటం దీని తోడు జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో 140 జివో ద్వారా పోడు భూములకు పట్టా హక్కులు కల్పిస్తాం అని తీర్మానం చేయటం జిల్లాస్థాయిలో కమిటీలు వేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక మీటింగ్ ఏర్పాటు చేస్తున్న సమయంలో ఒక్కసారిగా పోడుపోరు రగులుతుండంతో ప్రభుత్వానికి మిగుడు పడటం లేదు. ఇప్పటికే అనేకసార్లు స్థానిక శాసనసభ్యులు మెచ్చా నాగేశ్వరరావు దృష్టికి పోడుసాగుదారులు అటవీశాఖ అధికారులు సాగులో ఉండి పంట వేసుకున్న పొలాలను సైతం అటవీశాఖ అధికారుల వెళ్లన్వికుండా పంటలను పాడు చేస్తూ ప్లాంటేషన్లు వేస్తున్నారే విషయం తెచ్చారు. శాసనసభ్యులు సైతం అటవీశాఖ అధికారులకు సాగులో ఉన్న భూములు జోలికి, వేసిన పంటల జోలికి వెళ్లవద్దని హెచ్చరిస్తూ వస్తున్నారు. అయినప్పటికీ అటవీశాఖ అధికారులు ఎదో ఒక దాడులు నిర్భందాలు వాంటి కవింపు చర్యలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలోనే దమ్మపేట రేంజి జిల్లాలోని అశ్వారావుపేట మండలం బండారుగుంపు , రెడ్డిగూడెం గ్రామాల సమీపంలోని పోడు భూముల్లో నెలకొన్న వివాదం చాల్లరకముందే మరో వివాదం గాండ్లగూడెంలో తలెత్తడంతో అటవీశాఖ అధికారుల్లో ఒక రకమైన నిర్లప్తత మొదలైంది. ఒక పక్క ప్రభుత్వం అటవీభూములు కాపాడాలంటునే మరో పక్క జివోలు తేవటం లాంటి సంఘటనలు అటవీశాఖ అధికారుల్లోను పోడు సాగుదారల్లో నిద్ర పట్టకుండా చేస్తున్నాయి. పోడు భూముల విషయంలో ప్రభుత్వం నిర్ధిష్టమైన నిర్ణయం తీసుకోకుండా ఉంటే ఇటువంటి ఆందోళను ఎటువైపుగా దారితీస్తాయోనని ప్రచారం సాగుతుంది.