HomeNewsBreaking Newsఅక్కాచెల్లెళ్లపై హత్యాచారం

అక్కాచెల్లెళ్లపై హత్యాచారం

చెట్టుకు వేలాడదీసి ఆత్మహత్యగా చిత్రీకరణ: ఆరుగురు అరెస్టు
లఖింపూర్‌ ఖేరీ :
ఉత్తరప్రదేశ్‌లో మరో దారు ణం వెలుగుచూసింది. ఇద్దరు దళిత అక్కాచెల్లెళ్లపై కొందరు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం వారిని చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు చెట్టుకు వేలాడదీశారు. లఖింపుర్‌ ఖేరీ జిల్లాలో చోటుచేసుకొన్న ఈ అమానుష ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ ఘటనలో ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. మృతులిద్దరూ మైనర్లేనని పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది. వివరాల్లోకి వెళితే… లఖింపుర్‌ ఖేరీ జిల్లాలోని లాల్‌ పుర్వా గ్రామానికి చెందిన అక్కాచెలెళ్లను అదే గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు జునైద్‌, సోహైల్‌ కొంతకాలంగా పెళ్లిచేసుకోమని వేధిస్తున్నారు. ఆ యువకులను పెళ్లి చేసుకునేందుకు వారు ఒప్పుకోలేదు. దీంతో ఆ అక్కాచెల్లెళ్లపై కోపం పెంచుకున్న ఆ యువకులు తమ మిత్రులతో కలిసి దారుణానికి పాల్పడ్డారు. బుధవారం మధ్యాహ్నం నిం దితులు ఆ బాలికలను మాట్లాడాలని చెప్పి బైక్‌లపై ఎక్కించుకొని సమీపంలోని పొలాల్లోకి తీసుకెళ్లారు. అక్కడ మరోసారి పెళ్లి ప్రతిపాదన తీసుకురాగా.. అమ్మాయిలు ఒప్పుకోలేదు. దీంతో నలుగురు యువకులు బాలికలపై అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం వారిని చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు చెట్టుకు వేలాడదీశారు. బాలికలు ఇంట్లో కన్పించకపోవడంతో కుటుంబసభ్యులు గాలింపు చేపట్టారు. తమ ఇంటికి కిలోమీటర్‌ దూరంలో ఓ చెట్టుకు వీరి మృతదేహాలు వేలాడుతూ కన్పించాయి. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘటనకు పాల్పడిన నలుగురు యువకులతో పాటు అందుకు సహకరించిన మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనతో గ్రామంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చెలరేగాయి. దర్యాప్తు నిమిత్తం వెళ్లిన పోలీసులను గ్రామస్థులు అడ్డుకొన్నారు. మృతుల అంత్యక్రియల లోపే నిందితులను ఉరి తీయాలని, వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని డిమాండ్‌ చేశారు. ఈ క్రమంలో ఒకింత ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకొంది. అయితే పోలీసులు వారికి సర్దిచెప్పి మృతదేహాలను పోస్ట్‌ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
తప్పుడు ప్రకటనలతో భద్రత పెరగదు: ప్రియాంక గాంధీ
మరోవైపు ఈ ఘటన రాజకీయంగా తీవ్ర దుమారానికి దారితీసింది. కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ ట్విటర్‌ వేదికగా రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. లఖింపుర్‌ ఖేరీలో చోటుచేసుకున్న ఘటన దురదృష్టకరమని విచారం వ్యక్తం చేశారు. యుపిలో శాంతిభద్రతలు మెరుగ్గా ఉన్నాయని ప్రభుత్వం టీవీలు, పేపర్లలో తప్పుడు ప్రచారం చేస్తోందని, అంతా బాగానే ఉంటే రాష్ట్రంలో మహిళలపై నేరాలు ఎందుకు పెరుగుతున్నాయని ప్రియాంక గాంధీ ప్రశ్నించారు. వీటిపై ప్రభుత్వం ఎప్పుడు మేల్కొంటుందని ఎద్దేవా చేశారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments