కు.ని. చికిత్సలు చేసిన వైద్యుడి లైసెన్స్ తాత్కాలికంగా రద్దు
ఘటనపై దర్యాప్తునకు ప్రత్యేక కమిటీ :
డిహెచ్‌ఒ శ్రీనివాసరావు
నాలుగుకు చేరిన మృతుల సంఖ్య
ప్రజాపక్షం/హైదరాబాద్/రంగారెడ్డి ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఆస్పత్రి ఘటనలో దర్యాప్తునకు ప్రత్యేక కమిటీని నియమించినట్లు రాష్ట్ర ప్రజా ఆరోగ్య డైరక్టర్ డాక్టర్ శ్రీనివాస్ రావు తెలిపారు. ఇబ్రహీంపట్నం ఆస్పత్రి సూపరింటెండెంట్‌ను సస్పెండ్ చేయడంతో పాటు, శస్త్రచికిత్సలు చేసిన వైద్యుడి లైసెన్సును తాత్కాలికంగా రద్దు చేసినట్టు తెలిపారు. మృతుల కుటుంబ సభ్యులకు రూ.5 లక్షల పరిహారం, డబుల్ బెడ్ రూమ్ ఇల్లు మంజూరు, వారి పిల్లల విద్య బాధ్యతను ప్రభుత్వమే తీసుకుంటుందని వెల్లడించారు. మృతుల పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే వారి
మరణానికి కారణాలు తెలుస్తాయన్నారు. కేంద్ర మార్గదర్శకాల మేరకే ఆపరేషన్లు నిర్వహించామన్నారు. హైదరాబాద్,కోఠిలోని డిహెచ్ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డాక్టర్ శ్రీనివాస్ రావు మాట్లాడుతూ ఇబ్రహీంపట్నంలో నిపుణులైన వైద్యులతోనే మహిళలకు కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలు చేయించామని, నలుగురు మహిళలు తమకు గ్యాస్ట్రో లక్షణాలున్నట్లు చెప్పారని, తగిన చికిత్స అందించినా నలుగురు చనిపోవడం దురదృష్టకరమన్నారు. మహిళల మృతదేహాలకు శవపరీక్ష నిర్వహించామని, కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్న 30 మందికీ కూడా చికిత్సను అందిస్తున్నామని, అందులో ఏడుగురికి పలు ఆరోగ్య సమస్యలను గుర్తించి అపోలో ఆస్పత్రికి పంపించామని, మిగతా వారి ఆరోగ్య పరిస్థితి బాగానే ఉన్నదని తెలిపారు. ఈ ఘటనపైన అన్ని కోణాల్లో నిష్పక్షపాతంగా విచారణ జరుపుతున్నామన్నారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జూలై వరకు 111 క్యాంపుల్లో 38,656 సర్జరీలు నిర్వహించగా, ఇలాంటి ఘటనలు నమోదు కాలేదన్నారు. 2016 నుంచి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లను టార్గెట్లు లేవని, ప్రజలే స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారని తెలిపారు. 2021 1.10 లక్షల ఆపరేషన్లు నిర్వహించామని వివరించారు. ఈ నెల 25న ఇబ్రహీంపట్నం పరిధిలో 34 మందికి డబుల్ పంచర్ లాప్రోస్కోపి నిర్వహించామన్నారు. కుటుంబ నియంత్రణకు సంబంధించి దేశ వ్యాప్తంగా డీబీఎల్ అనేది అడ్వాన్స్ మెథడ్ అని అన్నారు. ఈ ఘటనకు సంబంధించి వారంలోగా నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం సూచించినట్టు తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటామన్నారు. ఈ ఘటనకుసంబంధించి వారంలో నివేదిక వస్తుందన్నారు.
నాలుగుకు చేరిన మృతుల సంఖ్య
జిల్లాలోని ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఆస్పత్రిలో కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స ఆపరేషన్ వికటించిన ఘటనలో మృతుల సంఖ్య మంగళవారం నాటికి నాలుగుకు చేరింది. వివిధ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆది,సోమవారం ఇద్దరు మృతి చెందగా మంగళవారం తెల్లవారుజామున మరో ఇద్దరు మరణించినట్లుగా వైద్య అధికారులు ప్రకటించారు. కాగా మరో ఇద్దరి పరిస్థితి\ సెతం ఆందోళనకరంగా ఉంది. ఈ విషయంపై సీరియస్ గా తీసుకున్న ప్రభుత్వం,జిల్లా కలెక్టర్ అమయ్ కుమార్ తో పాటు ఉన్నత స్థాయి వైద్యాధికారులు కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్స ఆపరేషన్ల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆస్పత్రి సూపరింటెండెంట్ సహా వైద్యుడి ని ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. శస్త్రచికిత్సలు వికటించేందుకు దారితీసిన పరిస్థితులపై ప్రాథమిక విచారణ జరిపిన వైద్య , ఆరోగ్యశాఖ ఈ మేరకు చర్యలు తీసుకుంది. ఈ సంఘటనకు సంబంధించి రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో ఈ నెల 25 న 34 మంది మహిళలకు కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు నిర్వహించారు. ఆ తర్వాత రోజు నుంచి పలువురు మహిళలకు వాంతులు, విరోచనాలతో తీవ్ర అస్వస్థతకు గురికావడం…దీంతో నలుగురు మహిళలు మృతి చెందడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. చికిత్సకు ముందే క్యాంపునకు వచ్చిన మహిళలందరికీ రక్త, మూత్ర, గర్భస్థ నిర్ధారణ పరీక్షలు చేశారు. శస్త్ర చికిత్స తర్వాత కూడా బి.పి చెక్ చేశారు.అన్ని సాధారణంగా ఉన్నట్లు నిర్ధారించుకున్న తర్వాత వారిని డిశ్చార్జ్ చేశారు. కాగా, రెండో రోజు నలుగురు మహిళలు వాంతులు, విరేచనాలు, బి.పి సమస్యతో బాధపడుతూ ప్రెవేటు ఆస్పత్రుల్లో చేరగా..అప్పటికే ఆరోగ్య పరిస్థితి పూర్తిగా విషమించింది.కోమాలోకి వెళ్లిపోయారు.మాడ్గుల మండలం కొల్కులపల్లికి చెందిన మమత (28) ఆదివారం మృతి చెందగా, సోమవారం మంచాల మండలం లింగంపల్లికి చెందిన సు(26),మంగళవారం తెల్లవారుజామున మాడ్గుల మండలం గుడితండాకు చెందిన మౌని(22), ఇబ్రహీంపట్నం మండలం సీతారాంపేటకు చెందిన లావ(22)లు మృతి చెందారు. ఇలా కేవలం 35 గంటల వ్యవధిలోనే నలుగురు మహిళలు మృత్యువాత పడడం కలకలం సృష్టించింది.
ఇదిలా ఉంటే కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్స ల తర్వాత ఇంటి వద్దే ఉండిపోయిన మిగిలిన మహిళలకు కూడా మంగళవారం వైద్య పరీక్షలు నిర్వహించారు. ఇన్‌ఫక్షన్‌తో ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా వీరిని కూడా నిమ్స్‌కు తరలించినట్లు తెలిసింది.
ఇబ్రహీంపట్నం ఆసుపత్రి సూపరింటెండెంట్ సస్పెన్షన్
RELATED ARTICLES