HomeNewsBreaking Newsరాబోయేది రైతు ప్రభుత్వం

రాబోయేది రైతు ప్రభుత్వం

మోటార్లకు కాదు… నరేంద్ర మోడీకే మీటర్‌ పెట్టాలి
సాగుకు వాడేది 20.8 శాతం విద్యుత్తే
పెద్దపల్లి కలెక్టరేట్‌ ప్రారంభోత్సవంలో సిఎం కెసిఆర్‌
ప్రజాపక్షం/పెద్దపల్లి ప్రతినిధి
దేశంలో రాబోయేది రైతు ప్రభుత్వమని, ప్రస్తుతం ఉన్న బిజెపి ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో తీసి పారేయాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు అన్నారు. సోమవారం పెద్దపల్లిలో సమీకృత కలెక్టరేట్‌ భవన సముదాయాన్ని ప్రారంభించారు. టిఆర్‌ఎస్‌ జిల్లా కార్యాలయాన్ని కూడా ప్రారంభించారు. కలెక్టరేట్‌ ప్రారభించిన అనంతరం భారీ బహిరంగ సభలో సిఎం కెసిఆర్‌ మాట్లాడారు. 26 రాష్ట్రాల నుండి రైతు సంఘాల నేతలు వచ్చి తనను కలిశారని, జాతీయ రాజకీయాల్లోకి రావాలని కోరుతున్నారనాన్రు. ప్రధాని నరేంద్రమోడీ చెప్పేదంతా గోల్‌మాల్‌ ముచ్చట్లేనని విమర్శించారు. రైతుల పొలాల వద్ద మీటర్లు పెట్టాలని చూస్తున్న ప్రధాని మోడీకే మీటర్‌ పెట్టాలని, వచ్చే ఎన్నికల్లో బిజెపికి తగిన గుణపాఠం చెప్పాలన్నారు. గాంధీ పుట్టిన రాష్ట్రం.. తమ వద్ద మద్యం నిషేధించామంటూ చెబుతున్న బిజెపి పాలిత గుజరాత్‌లో కల్తీ మద్యం ఏరులై పారుతోందని, ఆ కల్తీ మద్యానికి ఎందరో అమాయకులు బలయ్యారని దీనికి మోడీ సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. కేంద్ర ప్రభుత్వం వల్ల గోధుమలు, బియ్యం దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని, బిజెపి గజదొంగలు, లంచగొండులు తెలంగాణకు వచ్చి నీతులు చెబుతున్నారని, నోటికి ఎంత వస్తే అంతే మాట్లాడి మత విద్వేశాలు రెచ్చగొడుతున్నారని అసహనం వ్యక్తం చేశారు. తెలంగాణలో ఉండే ఏ ఒక్క మంచి కార్యక్రమం కూడా ప్రధాని రాష్ట్రమైన గుజరాత్‌లో లేవని, 24 గంటల కరెంటు, రూ.2 వేల పెన్షన్‌, పేదలకు ఆరోగ్యశ్రీ వంటి పథకాలు లేవని, అక్కడ దోపిడీ తప్ప మరేమీ లేదన్నారు. ఇరిగేషన్‌ ప్రాజెక్టులకు కలిపి వ్యవసాయానికి వాడే కరెంటు కేవలం 20.8 శాతం మాత్రమేనని, దాని ఖరీదు రూ.1.45లక్షల కోట్లే అని చెప్పారు. రైతులకు మీటర్లు పెట్టాలని వెంటపడే బిజెపి, నరేంద్రమోడీకి అందరం కలిసి మీటర్‌ పెట్టాలని వ్యాఖ్యానించారు. ఎన్‌పిఎల పేరుతో కార్పొరేట్లకు రూ.12 లక్షల కోట్లు దోచిపెట్టారని, రైతులకు ఇవ్వడానికి మాత్రం కేంద్రానికి చేతులు రావడం లేదని, సింగరేణి ప్రైవేటీకరణ కుట్రను భగ్నం చేయాలన్నారు. బిజెపి ముక్త్‌ భారత్‌ కోసం అందరూ సన్నద్ధ కావాలని కెసిఆర్‌ పిలుపునిచ్చారు. కలలో కూడా పెద్దపల్లి జిల్లా అవుతుందని అనుకోలేదని, తెలంగాణ వచ్చింది కనుక జిల్లా ఏర్పాటుతో పాటు అద్భుతమైన కలెక్టరేట్‌ను నిర్మించుకున్నామని అన్నారు. సింగరేణిలో వేల మందికి ఉద్యోగాలు దొరుకుతున్నాయని, సింగరేణి కార్మికులకు భారీగా బోనస్‌ అందజేస్తున్నామని తెలిపారు. పెద్దపల్లి జిల్లాలో మున్సిపాలిటీలు ఏర్పాటు చేసుకున్నామని, రామగుండం పట్టణాన్ని కార్పొరేషన్‌గా, పెద్దపల్లి, సుల్తానాబాద్‌, మంథని పట్టణాలను మున్సిపాలిటీలుగా ఏర్పాటు చేసుకున్నామని పేర్కొన్నారు.
బస్సులు లేక ప్రయాణికుల ఇక్కట్లు
ఇదిలా ఉండగా, సిఎం కెసిఆర్‌ సభ కోసం బస్సులను మళ్లించడంతో సామాన్యులు గమ్యస్థానాలకు చేరుకోలేకపోయారు. సభకు ఉమ్మడి జిల్లా నుండి భారీగా జనసమీకరణ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న నాయకులు ఆర్‌టిసి బస్సులను బుక్‌ చేసుకున్నారు. బస్సులపై ఆశలు పెట్టుకొని బస్‌స్టేషన్‌లకు చేరుకున్న ప్రయాణికులు గంటల తరబడి ఎదురుచూసి ప్రైవేటు వాహనాలను ఆశ్రయించారు. ఇదే అదునుగా భావించి ప్రైవేటు వాహనాలు ఆర్‌టిసి బస్సు చార్జీలకు అదనంగా రూ.40 నుండి రూ.60వరకు ఎక్కువగా వసూలు చేశారని ప్రయాణికులు వాపోయారు.
ప్రశ్నించే గొంతులను అరెస్టు చేయడం హేయమైన చర్య..
పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్‌ కార్యాలయం ప్రారంభోత్సవానికి సిఎం కెసిఆర్‌ రాక సందర్భంగా ప్రజా సమస్యలు, విద్యార్థి సమస్యలను పరిష్కరించాలని ప్రశ్నించినందుకు ప్రజాసంఘాల నాయకులను ముందస్తు అరెస్టు చేశారు. తెల్లవారుజామున అరెస్టు చేయడం సిగ్గుచేటని, తెలంగాణలో నిరంకుశ పాలన కొనసాగుతుందని సిపిఐ జిల్లా కార్యదర్శి తాండ్ర సదానందం అన్నారు. అరెస్టు చేసిన వారిలో మాజీ ఎంఎల్‌ఎ చింతకుంట విజయరమణారావు, సిపిఐ మండల కార్యదర్శి సతీష్‌, ఎఐఎస్‌ఎఫ్‌ జిల్లా నాయకులు మానస్‌, తీన్మార్‌ మల్లన్న జిల్లా కన్వీనర్‌ స్వామి, బిఎస్‌పి నాయకులు బొంకూరి సాగర్‌, చంద్రశేఖర్‌, అన్వేష్‌, సాగర్‌, గోదావరిఖనిలో సిపిఐ నగర కార్యదర్శి కె.కనకరాజు, మద్దెల దినేష్‌, మడ్డి ఎల్లాగౌడ్‌, ఏఐవైఎఫ్‌ విజయ్‌, రేణికుంట్ల ప్రీతంలు, తదితరులను ముందస్తు అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments