పిడి యాక్ట్ కింద కేసు నమోదు
ప్రజాపక్షం / హైదరాబాద్
గోషామహల్ ఎంఎల్‌ఎ రాజాసింగ్‌ను గురువారం పోలీసులు పిడి యాక్ట్ కింద అరెస్ట్ చేశారు. దీనికి ముందు పోలీసులు 41 (ఏ) సిఆర్‌పిసి కింద రాజాసింగ్‌కు నోటీసులు జారీచేశారు. రాజాసింగ్ ఇంటి వద్దకు వెళ్లి పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన ఇంటి వద్ద హైటెన్షన్ నెలకొన్నది. రాజాసింగ్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు అతడిని గాంధీ హాస్పిటల్‌కు తీసుకువెళ్లి వైద్యపరీక్షలు చేయించారు. పిడి యాక్ట్ నమోదైన కారణంగా ఆయన్ను నేరుగా చర్లపల్లి జైలుకు తరలించారు. ఫిబ్రవరి,ఏప్రిల్‌లో షాహనాయత్‌గంజ్, మంగళ్‌హాట్ పోలీస్ స్టేషన్‌లలో రాజాసింగ్‌పై నమోదైన కేసుల ఆధారంగా ఆయన్ను అరెస్ట్‌చేశారు. మంగళ్‌హాట్ పోలీస్‌స్టేషన్‌లో ఆయనపై గతంలో రౌడీషీట్ నమోదైంది. తెలుగు రాష్ట్రాల చరిత్రలో ఒక ఎంఎల్‌ఎపై పిడియాక్ట్ నమోద్ కావడం ఇదే తొలిసారి. అరెస్ట్‌కు ముందు రాజాసింగ్‌కు 32 పేజీల డాక్యుమెంట్‌ను అందించినట్లు గురువారం హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ మీడియాకు తెలియజేశారు. ఈ నెల 22వ తేదీన ఓ యూట్యూబ్ ఛానల్‌లో రాజాసింగ్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని తెలిపారు. శ్రీరామనవమి సందర్భంగా ఒక వర్గాన్ని రెచ్చగొట్టేలా పాటలు పడారనే ఫిర్యాదుపై కూడా ఆయనపై కేసు నమోదైనది. ఇటీవల హైదరాబాద్ నగరంలో మునావర్ షోను అడ్డుకుంటామని రాజాసింగ్ హెచ్చరించిన విషయం తెలిసిందే. హిందూ దేవతలను కించపరిచే వ్యక్తి షోను ఎలా అనుమతిస్తారని ప్రభుత్వాన్ని తీవ్రస్థాయిలో హెచ్చరించారు. మహ్మద్ ప్రవక్తకు వ్యతిరేకంగా అభ్యంతరకరంగా రాజాసింగ్ మాట్లాడారని వివరించారు. కాగా, 2004 నుంచి రాజాసింగ్‌పై 101 క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. ఇందులో మతపరమైనవి 18 కేసులు ఉన్నాయి. వీటిలో కొన్ని సరైన సాక్ష్యాధారాలు లేకపోవడంతో వీగిపోయాయి. మరికొన్ని కోర్టు విచారణలో ఉన్నాయి. రాజాసింగ్ అరెస్ట్‌ను నిరసిస్తూ ఎంజె మార్కెట్ వద్ద వ్యాపారస్తులు నిరసనలు తెలిపారు. బేగంబజార్, ముక్తార్‌గంజ్, మహరాజ్‌గంజ్ బంద్ చేశారు. బేగంబజార్‌లో, కిషన్‌గంజ్ మార్కెట్‌లో వెయ్యికిపైగా షాపులు మూసివేశారు. గోషామహల్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఉద్రిక్తవాతావరణం చోటు చేసుకుంది.
ఎంఎల్‌ఎ రాజాసింగ్ అరెస్టు
RELATED ARTICLES