కీలక అంశాలపై చర్చిస్తామని
పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి వెల్లడి
ప్రజాపక్షం/హైదరాబాద్ సిపిఐ రాష్ట్ర మూడవ మహాసభలు సెప్టెంబర్ 4 నుండి 7వ తేదీ వరకు నిర్వహించనున్నట్టు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి తెలిపారు. అత్యంత కీలకమైన ఈ మహాసభలలో రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, రాబోయే ఎన్నికలు, ప్రజల సమస్యలు, భవిష్యత్ కార్యాచరణ తదితర కీలకమైన అంశాలపై మహాసభలలో చర్చ జరుగుతుందన్నారు. హైదరాబాద్ హిమాయత్‌నగర్, మగ్ధూంభవన్‌లోని రాజ్‌బహదూర్‌గౌర్ హాల్‌లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ, రాష్ట్ర సహాయ కార్యదర్శి పల్లా వెంకట్ రెడ్డిలతో కలిసి చాడ వెంకట్ రెడ్డి మాట్లాడారు. సిపిఐ రాష్ట్ర మూడవ మహాసభలు రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో జరుగుతాయని, వచ్చేనెల 4వ తేదీన భారీ బహిరంగ సభను నిర్వహిస్తామని వివరించారు. ఈ మహాసభకు సిపిఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా, జాతీయ కార్యదర్శులు అతుల్ కుమార్ అంజాన్, డాక్టర్ కె.నారాయణ, పార్లమెంట్ సభ్యులు బినోయ్ విశ్వమ్ ముఖ్య అతిథులుగా హాజరవుతారన్నారు. ఈ మహాసభలకు పల్లా వెంకట్ రెడ్డి ఆహ్వాన సంఘం అధ్యక్షులుగా వ్యవహరిస్తారని, ఈ మహాసభలలో వివిధ అంశాలపై చర్చించి, తీర్మానాలు చేస్తామని అన్నారు.
హద్దు మీరి వ్యవహరిస్తున్న బిజెపి
బిజెపి హద్దులు మీరి వ్యవహరిస్తోందని చాడ వెంకట్ రెడ్డి విమర్శించారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఒక ఎంపీగా బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని, ఇలాంటి పరిస్థితులు ప్రజాస్వామ్యంలో మంచిపద్దతి కాదని అన్నారు. ఇళ్ల మీదకు పోయి దాడులు చేయడం, ఆటంకాలు కల్పించుకోవడం దుష్ట సంప్రదాయమని వెంకట్ రెడ్డి అన్నారు. బిజెపి ప్రజాస్వామ్య విలువలకు పాతరేస్తుందన్నారు. ఎంఎల్‌సి కవిత నివాసంపై బిజెపి కార్యకర్తలు దాడులు చేయడాన్ని ఆయన ఖండించారు. మునుగోడు ఎన్నికల కోసం బిజెపి హద్దులు మీరి వ్యవహరిస్తోందని విమర్శించారు. మునుగోడు ఉప ఎన్నికకు ఇంకా నోటిఫికేషన్ కూడా వెలువడక ముందే, ఎవరికి వారు పాగా వేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. రాజాసింగ్ ముస్లీంలను కించపర్చేలా మాట్లాడటం అభ్యంతరకరమన్నారు. రాజాసింగ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎవరి హక్కులను కించపర్చి, భంగపర్చే హక్కు ఎవ్వరికీ లేదని చాడ వెంకట్ రెడ్డి అన్నారు
సెప్టెంబర్ 4 నుంచి 7 వరకు సిపిఐ రాష్ట్ర మూడవ మహాసభలు
RELATED ARTICLES