హైదరాబాద్ జిల్లా సిపిఐ 23వ మహాసభల ప్రారంభోత్సవంలో రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి
ప్రజాపక్షం / హైదరాబాద్ ప్రధాని మోడీ నిరంకుశ పాలనలో ప్రజాస్వామ్యం అపహాస్యానికి గురువుతూ మతోన్మాదం, అడ్డూఅదుపులేని అవినీతిఅక్రమాలు, ప్రజలకు ఆర్థికకష్టాలు రోజురోజుకూ పెచ్చుమీరిపోతున్నాయని సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి ఆరోపించారు. ప్రజా సంక్షేమం గాలికొదిలేసి కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం లక్షల కోట్ల రూపాయలను కార్పొరేట్ శక్తులకు అప్పనంగా దోచిపెడుతున్నదని ధ్వజమెత్తారు. మోడీ పాలనలో విద్యార్థి యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కరవయ్యాయన్నారు. ఇంధన, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో మునుపెన్నడూ లేని రీతిలో ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారని, అవేవీ పట్టించుకోకుండా మోడీ ప్రభుత్వం వైవిధ్యభరితమైన, సుసంపన్నమైన సంస్కృతీ సాంప్రదాయాలు కలిగిన భారతదేశాన్ని మతతత్వ దేశంగా మార్చేందుకు కుట్రలు పన్నుతోందని నిప్పులు చెరిగారు. మతోన్మాదం భారతదేశ ప్రజల ఐక్యతకు గొడ్డలిపెట్టుగా మారిందని చాడ వెంకట్ రెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో దళితులు, ముస్లింలు లక్ష్యంగా దాడులు తీవ్రతరమవుతున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. మతోన్మాదుల అరాచకాలను అడ్డుకునే శక్తి ఒక్క ఎర్రజెండాకు మాత్రమే ఉందన్నారు. హైదరాబాద్ జిల్లా సిపిఐ 23వ మహాసభల ప్రారంభం సందర్భంగా రాంకోఠిలోని షాలిమార్ ఫంక్షన్ హాల్‌లో బహిరంగసభ జరిగింది. అంతకుముందు హిమాయత్ నగర్‌లోని సత్యనారాయణ రెడ్డి భవన్ నుంచి ఫంక్షన్ హాల్ వరకూ భారీ కవాతు నిర్వహించారు. అనంతరం షాలిమార్ ఫంక్షన్ హాల్ లోని కామ్రేడ్ ఎల్‌ఎస్.ప్రకాష్ ప్రాంగణంలో సిపిఐ హైదరాబాద్ జిల్లా కార్యదర్శి ఈటి.నరసింహ అధ్యక్షతన బహిరంగ సభ జరిగింది. ఈ బహిరంగ సభకు సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు ఎస్.ఛాయాదేవి స్వాగతం పలికారు. ముఖ్యఅతిథిగా చాడ వెంకట్ రెడ్డి, గౌరవ అతిథులుగా సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ ఎంపీ సయ్యద్ అజీజ్ పాషా, సిపిఐ తెలంగాణ రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివ రావు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వి.ఎస్.బోస్ వేదికను అలంకరించారు. కరతాళధ్వనులు, రెడ్‌శెల్యూట్ టూ కామ్రేడ్ చాడ వెంకట్ రెడ్డికి రెడ్ శెల్యూట్ రెడ్‌శెల్యూట్ అంటూ సిపిఐ శ్రేణులు హోరెత్తిన నినాదాల నడుమ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి ప్రసంగించారు. బడా పారిశ్రామికవేత్తలు, కార్పొరేట్లకు మోకరిల్లుతూ జాతీయ ఆస్తులను కాపాడడంలో విఫలమైన నరేంద్రమోడీ ప్రభుత్వానికి ఇక ఎంతమాత్రం అధికారంలో కొనసాగే హక్కులేదన్నారు. అన్నిరంగాల్లో కేంద్రంలోని బిజెపి సర్కార్ పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. హిందూ ముస్లింలు భాయ్‌భాయ్‌గా ఉంటూ మతసామరస్యాన్ని పాటించాలని, బిజెపి ప్రభుత్వ మతోన్మాద, ప్రజావ్యతిరేక విధానాలపై కలిసికట్టుగా పోరాడాల్సిన తరుణం ఆసన్నమైందన్నారు. హైదరాబాద్ జిల్లాలో సిపిఐ పార్టీ విస్తరణకు ప్రతీ కార్యకర్తా సుశిక్షితులైన సైనికుల్లా పనిచేయాలన్నారు. కమ్యూనిస్టు పార్టీకి చెందిన ఏఐఎస్‌ఎఫ్,ఏఐవైఎఫ్, మహిళా సమాఖ్య, ఏఐటియుసి తదితర ప్రజాసంఘాలను హైదరాబాద్ జిల్లాలో మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. హైదరాబాద్ జిల్లాలో ప్రజల సమస్యలపై సిపిఐ లడాయ్ కర్నే పార్టీగా అగ్రభాగాన నిలవాలని సిపిఐ నూతన నాయకత్వం దీనిపై కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకుని ఉద్యమించాలని సూచించారు. రాబోయే రోజుల్లో రేషన్‌కార్డులు, పెన్షన్లు, ఇళ్లు, ఇళ్ల స్థలాల కోసం సిపిఐ పెద్దయెత్తున సమరశీల ఉద్యమాలు, పోరాటాలు చేస్తుందన్నారు. సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివ రావు మాట్లాడుతూ బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం జాతీయ ఆస్తులు , దేశ భవిష్యత్తుపై దాడి చేస్తున్నదని, ప్రధాని మోడీ తన ‘వ్యాపార స్నేహితుల‘ ప్రయోజనం చేకూర్చేందుకు భారతదేశాన్ని ‘క్లియరెన్స్ సేల్”లో పెట్టాడని ఆరోపించారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ ‘తిరోగమన విధానాలు‘ దేశ ప్రాథమిక నిర్మాణాన్ని దెబ్బతీశాయని పేర్కొన్నారు. పేదోడి తరపున ప్రశ్నించే గొంతుక సిపిఐ అని సాంబశివరావు అన్నారు. అజీజ్ పాషా మాట్లాడుతూ భారతదేశ రాజ్యాంగం ప్రమాదంలో పడిందని, కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. లౌకికవాదం కూడా ప్రమాదంలో పడిందని చెప్పడంలో సందేహం లేదన్నారు. బిల్కిస్ బానో సామూహిక అత్యాచారం కేసులో జీవిత ఖైదు పడిన 11 మంది దోషులను గుజరాత్‌లోని బిజెపి ప్రభుత్వం విడుదల చేయడం సిగ్గుచేటన్నారు. బిజెపి మత ఉన్మాదం వల్ల భారతదేశంలోని ప్రతి గ్రామంలో, ప్రతి వీధిలో ఉద్రిక్తత నెలకొందని, దళిత, మైనారిటీల పై దాడులు జరుగుతూనే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజానాట్యమండలి ప్రధాన కార్యదర్శి పల్లె నర్సింహ నేతృత్వంలో పాడిన పాటలు, నృత్య ప్రదర్శనలకు పలువురు నాయకులు సైతం జతకట్టడం పార్టీ శ్రేణులను ఉత్సాహపరిచింది. ఈ బహిరంగసభలో సిపిఐ హైదరాబాద్ జిల్లా కార్యవర్గ సభ్యులు బి.స్టాలిన్ వందన సమర్పణ చేశారు.