ప్రజాపక్షం/హైదరాబాద్ వివాదస్పద వ్యాఖ్యల కేసులో బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్ట్ అయ్యారు. షాహినాయత్ గంజ్ పోలీసులు అదుపులోకి తీసుకుని, బొల్లారం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అక్కడి నుండి నాంపల్లి కోర్ట్‌లో హాజరుపర్చగా, 14వ అదనపు మెట్రో పాలిటన్ మేజిస్ట్రేట్ ఆయనకు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. దీంతో అతనిని పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు. బెయిల్ పిటిషన్ వేయగా, నాంపల్లి కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. ఇదిలా ఉండగా, రాజాసింగ్‌ను కోర్ట్ వద్దకు తీసుకువస్తున్నారన్న సమాచారంతో రాజాసింగ్ అనుకూల, వ్యతిరేక వర్గాలు కోర్ట్ వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకునినినాదాలు చేశారు. రెండు వర్గాలు పోటీపోటీగా నినాదలు చేశారు. కాగా నిరసన కారులు కోర్ట్ ప్రాంగణంలోపలికి దూసుకెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో పరస్పర తోపు లాటలు జరిగాయి. పోలీసులు వారిపైన లాఠీచార్జ్ చేశారు. దీంతో స్థానికంగా ఉద్రికత్త పరిస్థితి నెలకొన్నది. అంతకుముందు పాతబస్తీలోని పలు ప్రాంతాల్లో కూడా నిరసన కార్యక్రమాలు జరిగాయి. కాగా రాజాసింగ్ వ్యాఖ్యలకు నిరసనగా ఆబిడ్స్‌లోని జగదీష్ మార్కెట్ వ్యాపారులు బంద్ పాటించి, మార్కెట్ నుండి ఆడిడ్స్ పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీగా వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్‌లలో రాజాసింగ్ వ్యాఖ్యలపై పలువురు ఫిర్యాదు చేశారు.హైదరాబాద్‌లోని మంగళ్‌హాట్, బహదూర్‌పూర,డబీర్‌పూర, బాలానగర్, పంజాగుట్ట, బాలాపూర్‌తో పాటు, సంగారెడ్డి, నిజామాబాద్‌లో ఫిర్యాదులు అందాయి.
రాజాసింగ్‌ను సస్సెండ్ చేసిన బిజెపి
వివాదస్పద వ్యాఖ్యలు చేసిన రాజాసింగ్‌ను బిజెపి సస్పెండ్ చేసింది. క్రమశిక్షణ చర్యల కింద సస్పెండ్ చేస్తూ బిజెపి కేంద్ర క్రమశిక్షణ కమిటీ మెంబర్ సెక్రెటరీ ఒం పాతక్ మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. పార్టీ నుండి ఎందుకు బహిష్కరించకూడదో సెప్టెంబర్ 2వ తేదీలోపు వివరణ ఇవ్వాలని ఆయన స్పష్టం చేశారు. అప్పటి వరకు బిజెఎల్‌పి పదవితో పాటు పార్టీలో ఉన్న ఇతర బాధ్యతల నుండి తప్పిస్తున్నుట్టు ప్రకటించారు.
పోలీస్ కమిషనర్ కార్యాలయం ఎదుట ఎంఐఎం నిరసన
ఒక వర్గం మనోబావాలు దెబ్బతీసేలా సామాజిక మాధ్యమాల్లో వీడియో పోస్ట్ చేసిన రాజాసింగ్‌ను తక్షణమే అరెస్ట్ చేయాలని ఎంఐఎం శ్రేణులు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. సామాజిక మాధ్యమాల్లో రాజాసింగ్ పోస్ట్ చేసిన వీడియోను తక్షణమే తొలగించాలని వారు డిమాండ్ చేశారు. వారు సిపి కార్యాలయం లోపలికి వెళ్లేందుకు యత్నించగా పోలీసులు వారిని అరెస్ట్ చేశారు.
రాజాసింగ్ అరెస్ట్… బెయిల్
RELATED ARTICLES