ఢిల్లీలో కొత్తగా కేసు నమోదు
ఎలాంటి విదేశీ ప్రయాణం చేయకున్నా వ్యాధి నిర్ధారణ
భారత్‌లో నాలుగుకు చేరిన సంఖ్య
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలోని మంకీపాక్స్ కలకలం రేపింది. ఎలాంటి విదేశీ ప్రయాణా లు చేయని 34 ఏళ్ల వ్యక్తికి మంకిపాక్స్ సోకింది. దీంతో దేశంలో మంకీపాక్స్ కేసుల సంఖ్య నాలుగు చేరింది. ఇప్పటికే కేరళలో మూడు కేసులు బయపడిన విషయం తెలిసిందే. కాగా, తాజాగా మంకీపాక్స్ సోకిన వ్యక్తి ఇటీవల హిమాచల్ ప్రదేశ్ మనాలీలో జరిగిన ఒక పార్టీకి వెళ్లి వచ్చినట్లు అధికార వర్గా లు తెలిపాయి. పశ్చిమ ఢిల్లీకి చెందిన నివాసి మూడు రోజుల క్రితం మంకీపాక్స్ లక్షణాలు కనిపించడంతో లోక్ నాయక్ జైప్రకాష్ ఆసుపత్రిలో చేరాడు. అతనికి వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు శాంపిల్స్‌ను నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి శనివారం నాడు పంపించారు. ఈ శాంపిల్స్‌ను పరీక్షించిన అనంతరం అతనికి మంకీపాక్స్ సోకినట్లు నిర్ధారణ అయిందని కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ అధికారులు తెలిపారు. ఐసోలేషన్ కేంద్రంగా గుర్తించబడిన లోక్‌నాయక్ ఆసుపత్రిలో ఈ వ్యక్తి చికిత్స పొందుతున్నాడన్నారు. ఈ వ్యక్తికి దగ్గరి కాంటాక్ట్‌లను గుర్తించి మార్గదర్శకాలకు అనుగుణంగా వారిని క్వారంటైన్‌లో ఉంచామని చెప్పారు. ఇదిలా ఉండగా.. మంకీపాక్స్ లక్షణాలతో కూడిన ఇద్దరి, ముగ్గురి శాంపిల్స్ ప్రతి వారం ముంబయికి వస్తున్నాయని.. కానీ తాజాగా రోజుకు రెండు, మూడు శాంపిల్స్ వైరాలజీ ల్యాబ్‌కు వస్తున్నాయని విశ్వసనీయ వర్గాల సమాచారం. దేశవ్యాప్తంగా 16 ల్యాబొరేటరీలు మంకీపాక్స్ కేసులను నిర్ధారించే పనిలో ఉన్నాయి. వీటిలో రెండు కేరళలో ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా 75 దేశాల్లో మంకీపాక్స్ కలకలం రేపుతోంది. దాదాపు 16,000కి పైగా మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయి. ఆఫ్రికాలో మంకీపాక్స్ కారణంగా ఐదుగురు మృత్యువాత పడ్డారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ మంకీపాక్స్‌ను గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా కూడా ప్రకటించింది. మంకీ పాక్స్ అంత ప్రమాదకరం కాదని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ వ్యాధి ఇతరులకు వ్యాపించే అవకాశం తక్కువగా ఉంటుందన్నారు. ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. వ్యాధి నిర్ధారణ అయిన తర్వాత రోగిని నాలుగు వారాల పాటు ఐసోలేషన్‌లో ఉంచాలని సూచించారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలే ప్రమాదముందని, జ్వరం, తలనొప్పి వంటి లక్షణాలు ఉంటాయని వివరించారు. ఇవే లక్షణాలు మంకీపాక్స్ ఉన్న వారిలో ఉంటాయని తెలిపారు. మెడ భాగం, చంకలు, గజ్జల్లో బిళ్లలు కట్టడమనేది ఈ వ్యాధి ప్రత్యేకతని వెల్లడించారు. రోగికి అతి దగ్గరగా ఉన్న వారికి సోకే అవకాశం ఎక్కువగా ఉంటుందని వైద్య నిపుణులు తెలిపారు. వ్యాధి సోకిన వ్యక్తి నోటి నుంచి వచ్చే తుంపర్లు, దుస్తులు, వాడే వస్తువులను నుంచి ఈ వ్యాధి సోకుతుందని వెల్లడించారు. చిన్నపిల్లలు, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు, గర్భిణులు వైద్యుల పర్యవేక్షణలో ఉండాలని సూచించారు. స్మాల్ పాక్స్ వ్యాధికి, మంకీపాక్స్ వ్యాధికి దగ్గర సారూప్యత ఉందని తెలిపారు. వ్యాధి లక్షణాలుమంకీపాక్స్ సోకిన వ్యక్తికి 1 నుంచి 2 వారాలు జ్వరం, తలనొప్పి, గొంతునొప్పి, అలసిపోవడం లాంటి లక్షణాలు ఉంటాయి. చంకలు, మెడ భాగం, గజ్జల్లో బిళ్లలు కట్టడం ఈ వ్యాధి ప్రత్యేక లక్షణం రోగికి లక్షణాలు పెరిగేకొద్ది ముఖం, చేతులు, ఛాతీ భాగాల్లో చిన్న చిన్న పొక్కులు కనిపిస్తాయి. తర్వాత వాటి స్థానంలో గోతులు ఏర్పడతాయమంకీపాక్స్ అంత ప్రమాదకరం కాదు ఈ వ్యాధి అంత ప్రమాదకరం కాదు. వ్యాధి నిర్ధారణ అయిన తర్వాత రోగిని నాలుగు వారాల పాటు ఐసొలేషన్‌లో ఉంచాలి. పిపిఇ కిట్లు, మాస్కులు తప్పనిసరిగా ధరించాలి. ఈ వ్యాధికి సంబంధించి మరణాల రేటు చాలా తక్కువగా ఉంది. వైద్యుల పర్యవేక్షణలో ఉండి మందులు వాడితే తొందరగా కోలుకుంటారు. ఇతర దేశాల నుంచి వచ్చిన వారు వ్యాధి లక్షణాలు ఉంటే దగ్గర్లోని ప్రభుత్వాస్పత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకోవడం మంచిది.
కేంద్ర ప్రభుత్వం ఉన్నతస్థాయి సమీక్ష
తాజాగా దేశంలో మంకీపాక్స్ నాల్గొవ కేసు నమోదు కావడంతో కేంద్రం అప్రమత్తమైంది. ఆదివారం ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించింది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సైన్సెస్ (డిజిహెచ్‌ఎస్) ఆధ్వర్యంలో జరిగిన ఈ సమీక్షా సమావేశానికి ఆరోగ్యమంత్రిత్వశాఖ, నేషనల్ సెంటర్ ఫర్ డీసీస్ కంట్రోల్ (ఎన్‌సిడిసి), ఐసిఎంఆర్ సహా ఇతర అధికారులు హాజరయ్యారు. ఈ భేటీలో మంకీపాక్స్ నివారణకు, ముందుజాగ్రత్త చర్యగా ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలపై అధికారులు చర్చించినట్లు తెలుస్తోంది. దేశంలో కరోనా తగ్గుముఖం పట్టిందని భావిస్తున్న సమయంలో మరో కొత్త వ్యాధి వెలుగుచూస్తుండటం ఆందోళనకు గురి చేస్తోంది.
RELATED ARTICLES