భద్రాచలం, పినపాక ముంపు ప్రజలకు ఇళ్ల కాలనీ
ఇంకా వరద ముప్పు తప్పలేదు జాగ్రత్త
భగవంతుడి దయవల్లే కడెం ప్రాజెక్టు బతికింది
భద్రాచలం సమావేశంలో సిఎం కెసిఆర్
ప్రజాపక్షం/భద్రాచలం ప్రతీ ఏటా గోదావరి వరదల వల్ల భద్రాచలం, పినపాక నియోజకవర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందలు పడుతున్నారని, ఇక ఎలాంటి ఇబ్బందులు లేకుండా శాశ్వత పరిష్కారాన్ని చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. గోదావరి వరదల వల్ల నీటమునిగిన ప్రాంతాలను స్వయంగా పరిశీలించేందుకు ఆదివారం భద్రాచలం చేరుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక ఐటిడిఏ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ముంపు ప్రత్యేక సమావేశంలో సిఎం మాట్లాడారు. గోదావరి వరదలను ఎదుర్కునేందుకు అధికారులు సమర్థవంతంగా పనిచేస్తున్నారని చెప్పారు. వరదల వల్ల ఏ ఒక్క ప్రాణ నష్టం కూడా వాటిల్లరాదని తాము ఆదేశాలు జారీ చేశామని, ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడం అధికారుల పనితీరుకు అద్దం పడుతోందన్నారు. యుద్ద ప్రాతిపదికన 275 కుటుంబాల వారిని పునరావాస కేంద్రాలకు తరలించి సౌకర్యాలు కల్పించామని చెప్పారు. వరదల వల్ల ఇబ్బంది పడ్డ ఒక్కొక్క కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సహాయాన్ని అందించడంతో పాటు నెలకు 20 కేజీల చొప్పున రెండు నెలల పాటు ఉచితగా బియ్యాని అందిస్తామన్నారు. గోదావరి వరదలు వచ్చినప్పుడల్లా సుబాష్‌నగర్, ఏఎంసి, కొత్తకాలనీల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వారందరిని ఇక్కడ నుండి వేరే ప్రాంతానికి తరలించి 2 వేల నుండి 3 వేల ఇళ్లతో పక్కా కాలనీని అనువైన ప్రదేశంలో నిర్మిస్తామని, ఇందు కోసం సింగరేణి సంస్థను కలుపుకుని రూ.1000 కోట్లు వెచ్చిస్తామని చెప్పారు. వరదలు పూర్తిగా తగ్గంగానే ప్రత్యేక అధికార బృంధాన్ని ఇక్కడికి పంపించి మాస్టర్ ప్లాన్ తయారు చేయిస్తామని, తానే స్వయంగా వచ్చిన ఇళ్ల కాలనీకి శంకుస్థాపన చేస్తానని చెప్పారు. బూర్గంపాడు, పర్ణశాల, దుమ్ముగూడెం వైపు కూడా కరకట్టల విషయంలో ఆలోచన చేస్తామని, 90 అడుగుల గోదావరి వచ్చినప్పటికీ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేలా శాశ్వత చర్యలుంటాయని అన్నారు. గుడి పరిసర ప్రాంతాల కూడా మాటిమాటికి నీటిలో మునుగుతున్నాయని, దానిపై కూడా దృష్టి సారిస్తామని చెప్పారు. మరో మూడు నెలల పాటు వర్ష ప్రభావం ఉంటుందని, ప్రస్తుతం గోదావరి తగ్గుముఖం పడుతున్నప్పటికీ ప్రమాదం తప్పినట్లు కాదని, ఈనెలాఖరు వరకు విరివిగా వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ తెలుపుతోందని, తద్వారా ప్రాజెక్టులు నిండి ప్రతీ చుక్కా గోదావరిలోకే వచ్చి కలుస్తుందని, గోదావరి నదికి మళ్లీ వరద ముప్పు పొంచి ఉందని, అధికారులు తస్మాత్ జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. ప్రస్తుత పునరావాస కేంద్రాల్లో ఉన్న ప్రజలు ఎవ్వరూ కంగారు పడి ఇళ్లకు వెళ్లవద్దని, పరిస్థితులన్నీ సాధారణ స్థితికి చేరిన తర్వాతే ఇంటి దారిపట్టాలని సూచించారు. పునరావాస కేంద్రాల్లో ఉండే వారికి ఇప్పటి లాగనే ముందురోజుల్లో కూడా సౌకర్యాలు కల్పించాలని, ఇందుకోసం జిల్లా అధికార యంత్రంగంతో పాటు పోలీస్‌శాఖ కూడా సహాయ సహకారాలు అందించాలని సూచించారు. గోదావరి పరివాహక ప్రాంతాల్లో అంటు వ్యాధులు ప్రభలే అవకాశం ఉందని, నిరంతరం బ్లీచింగ్ చల్లడంతో పాటు అవసరమైన మందులను అందుబాటులో ఉంచుకోవాలని, ప్రత్యేక వైద్యబృంధాలను అందుబాటులో ఉంచుకోవాలని, ఖమ్మం కలెక్టర్ ఆధ్వర్యంలో పర్యవేక్షణ ఉంటుందన్నారు. ఏపిలోని గుండాల సమీపంలో గోదావరి నదిపై కరకట్ట లేకపోవడం వల్లే అధిక వరద బయటకు వచ్చి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని విలేకరులు అడిగిన ప్రశ్నకు సిఎం సమాధానం ఇస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమేమి పాకిస్తాన్‌లో లేదు కాదా, దీనిపై ఆ రాష్ట్ర ప్రభుత్వం చర్చిస్తామని బదులిచ్చారు.
భగవంతున దయవల్లే కడెం ప్రాజెక్టు బ్రతికింది /// – వరద ముంపుకు శాశ్వత పరిష్కారం అవసరమని, 1986 తర్వాత ఇంతపెద్ద వరద గోదావరికి వచ్చిందని, మారిన పరిస్థితుల కారణంగానే ఇలా జరుగుతోందని చెప్పారు. చరిత్రలో కనీ వినీ ఎరుగని రీతిగా కడెం ప్రాజెక్టుకు భారీ వరద నీరు వచ్చిందని, దాని వాస్తవ సామర్ధ్యం 2.50 లక్షల టిఎంసిలు కాగా 5 లక్షల టిఎంసిల కంటే అధిక ఇన్‌ఫ్లో నమోదైందన్నారు. ఒకానొకదశలో ప్రాజెక్టు ఏంవుతుందో అనే ఆందోళన నెలకొందని, భగవంతుని దయవల్లే ప్రాజెక్టు బ్రతికిందని ముఖ్యమంత్రి కేసిఆర్ అన్నారు.
ఈ సమావేశంలో రాష్ట్ర రవాణాశాఖా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, వైద్యఆరోగ్యశాఖామంత్రి తన్నీరు హరీష్ రావు, పంచాయితీ రాజ్ మంత్రి యర్రబెల్లి దయాకర్ రావు, సిఎస్ సోమేష్ కుమార్, డిజిపి మహేంధర్ రెడ్డి, సిఎంఓ కార్యదర్శి స్మితా సబర్వాల్, సిసిఎల్‌ఏ డైరెక్టర్ రజత్‌కుమార్‌షైనీ, సింగరేణి సిఎండి శ్రీధర్, పంచాయితీ రాజ్ కమీషనర్ హనుమంతరావు, ఎమ్మెల్సీలు తాతా మధు, పల్లా రాజేశ్వరరెడ్డి, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిషత్ చైర్మన్ కోరం కనకయ్య, ఖమ్మం జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు, ఎమ్మెల్యేలు పొదెం వీరయ్య, వనమా వెంకటేశ్వరరావు, హరిప్రియ, మెచ్చా నాగేశ్వరరావు, సండ్రా వెంకటవీరయ్య, ఏడిజి నాగిరెడ్డి, జిల్లా కలెక్టర్ అనుదీప్, ఎస్పి డా. వినిత్, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.
గోదావరి తల్లికి ప్రత్యేక పూజలు
ఎవ్వరూ అధైర్యపడొద్దు… గోదావరి వరదల భారిన పడి పునరావాస కేంద్రాల్లో ఉన్న ప్రతీ ఒక్కరికీ ప్రభుత్వం అండగా ఉంటుందని, మంత్రి పువ్వాడ అజయ్ కుమార్,అధికారులు దగ్గరుండి అన్ని సౌకర్యాలు కల్పిస్తారని ముఖ్యమంత్రి కల్వకంట్ల చంద్రశేఖర్ రావు వరదబాధితులకు భరోసా ఇచ్చారు. వారం రోజులుగా కంటిమీద కునుకు లేకుండా చేస్తూ పలు ప్రాంతాలను గోదావరి ముంచెత్తడంతో ఆ ప్రాంతాలను స్వయంగా పరిశీలించేందుకు సిఎం కేసిఆర్ ఆదివారం భద్రాచలం చేరుకున్నారు. శనివారం రాత్రి వరంగల్‌లో బస చేసిన ఆయన ఆదివారం ప్రత్యేక హెలీకాప్టర్ ద్వారా భద్రాచలం చేరుకోవాల్సి ఉన్నప్పటికీ వాతావరణ అననుకూల పరిస్థితుల దృష్ట్యా రోడ్డు మార్గం ద్వారా విచ్చేశారు. ఈసందర్భంగా బూర్గంపాడు మండలం సారపాక పరిసర ప్రాంతాల్లో గోదావరి ముంచెత్తిన ప్రదేశాలను చూశారు. అనంతరం గోదావరి వంతెనపైకి చేరుకున్న ఆయన శాంతించిన గోదారి మాతకు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా నూతన వస్త్రాలతో పాటు పసుపు, కుంకుమలను నదీమతల్లి ఒడిలో వదిలారు. బ్రిడ్డీపై నుండే గోదావరి వరద ప్రవాహాన్ని పరిశీలించారు. కరకట్టపైకి చేరుకుని, కట్టపై నడుచుకుంటూ తిరుగుతూ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌తో పరిస్థితులపై చర్చించారు. అనంతరం పునరావాస కేంద్రాల్లో ఉన్న వరద బాధితులను సిఎం పరామర్శించి వారితో స్వయంగా ముచ్చటించారు. ప్రతీ ఒక్కరికీ ప్రభుత్వం అండగా ఉంటుందని ధైర్యం కల్పించారు. వరద భారి నుండి తప్పించేందుకు శాశ్వత పరిష్కారాన్ని కల్పిస్తామని, మరుగైన ప్రాంతంలో ప్రత్యేక కాలనీలను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఐటిడిఏలో నిర్వహించిన సమావేశం ముగిసిన అనంతరం ప్రత్యేక హెలీకాప్టర్‌లో ఏటూరునాగారం వరద ప్రభావతి ప్రాంతాలను పరిశీలించేందుకు వెళ్ళారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట జిల్లా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, పంచాయితీరాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, సిఎస్ సోమేష్ కుమార్, ఐజి నాగిరెడ్డి, ఎంఎల్‌సి తాతా మధు తదితరులున్నారు.
‘గోదావరి ముంపు’ శాశ్వత పరిష్కారానికి రూ.1000కోట్లు
RELATED ARTICLES