HomeNewsBreaking Newsమోడీ సర్కార్‌ విధానాలను ఐక్య ఉద్యమాలతో తిప్పికొట్టాలి

మోడీ సర్కార్‌ విధానాలను ఐక్య ఉద్యమాలతో తిప్పికొట్టాలి

సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు
ప్రజాపక్షం/హైదరాబాద్‌
ప్రజాస్వామ్యాన్ని బలహీన పర్చే విధంగా ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వ విధానాలను ఐక్య ఉద్యమాలతో తిప్పి కొట్టాలని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. మోడీ ప్రభుత్వ దగాకోరు దోపిడీ విధానాలతో ప్రజలు దేశ సంపదలో తమ హక్కును కోల్పోతున్నారని మండిపడ్డారు. హైదరాబాద్‌ హిమాయత్‌నగర్‌ సత్యనారాయణరెడ్డిభవన్‌లో గురువారం నిర్లేకంటి శ్రీకాంత్‌ అధ్యక్షతన సిపిఐ హైదరాబాద్‌ జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కూనంనేని సాంబశివరావు ముఖ్యఅథితిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ వివాదాస్పద నిర్ణయాలు, అణిచివేతలు, నిరుద్యోగం, అధిక ధరలు, పెరుగుతున్న అసమానతలు, ప్రజాస్వామిక హక్కుల నిరాకరణ, శ్రామిక ప్రజల జీవనోపాధిపై దాడులు వంటి సమస్యలపై పోరాటాలకు దేశ వ్యాప్తంగా కమ్యూనిస్టులకు ప్రజల మద్దతు లభిస్తుందన్నారు. ఈ తరుణంలో ప్రజలను సమీకరించి విజయవంతమైన పోరాటాలు ప్రారంభించాలన్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలకు నిరనసగా ఉద్యమాలు
గత ఉద్యమాల స్ఫూర్తితో సామూహిక ఉద్యమాలు నిర్మించాలని సాంబశివరావు పిలుపునిచ్చారు. ప్రజల కనీస అవసరాలను తీర్చడంలో, వారి హక్కులను కాపాడడంలో ముందుండాలన్నారు. ప్రజానుకూల విధానాలు అవలంబిస్తూ దేశంలో భారత కమ్యూనిస్టు పార్టీ కీలకమైన పాత్ర పోషిస్తుందన్నారు. న్యాయమైన పోరాటాలన్నింటిలో సిపిఐ అగ్రగామిగా కొనసాగుతుందన్నారు. మోడీ ప్రభుత్వ భయంకరమైన విధానా లు ఉపాధి, వ్యవసాయం, ఆరోగ్యం, విద్య, పరిశ్రమల పతనానికి దారితీసిందని చెప్పారు. మోడీ ప్రభుత్వం నిరుద్యోగం, నేరాలు, ఆకలి, నిరాశ్రయత, అభద్రతలను పెంచిపోషిస్తూ ప్రజలను తీవ్రమైన కష్టాల్లోకి నెట్టుతుందని సాంబశివరావు మండిపడ్డారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి కెసిఆర్‌ కేవలం ప్రకటనలకే పరిమితమయ్యారని, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రజావ్యతరేక విధానాలను నిరసిస్తూ బలమైన పోరాటాలు నిర్మించాలని సాంబశివ రావు సూచించారు.
కబ్జాతోనే చెరువులకు ముంపు : ఇటి నరసింహ
గ్రేటర్‌ హైదరాబాద్‌లో వరద ముంపునకు చెరువులు, కుంటల కబ్జాలే కారణమని సిపిఐ హైదరాబాద్‌ జిల్లా కార్యదర్శి ఇటి నరసింహ అన్నారు. చెరువులు, కుంటలను పరిరక్షించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. చెరువులు, కుంటల కబ్జాలకు పాల్పడినవారికే సర్కార్‌ వత్తాసు పలుకుతుందని దుయ్యబట్టారు. మీరాలం చెరువు కబ్జాకు గురికావడంతో వరదనీరు వెళ్ళడానికి వేరే దారిలేక జూ పార్క్‌లోకి నీరు ప్రవేశించిందన్నారు. హైదరాబాద్‌ నగరంలో చెరువులు, కాలువలు, నాలాలు ఆక్రమణకు గురై వరద నీరు దిగువ ప్రాంతాలకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. నగరంలోని చాలా నాలాలు ఇప్పటికి చెత్త, పూడికతో మూసుకుపోయాయన్నారు. నాలాలకు ప్రహరీగోడలు కూడా లేవని, కొద్దిపాటి వర్షానికి ఇళ్ళు, రోడ్లు అన్నీ జలమయమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇళ్లల్లోకి వరద నీరు చేరడంతో ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని జీవనం సాగిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ఇటి నరసింహ డిమాండ్‌ చేశారు. ఈ సమావేశంలో సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు ఎస్‌.ఛాయాదేవి, జిల్లా కార్యవర్గసభ్యులు జి.చంద్ర మోహన్‌, కమతం యాదగిరి, బి.స్టాలిన్‌, ఆర్‌.మల్లేష్‌, ఎండి.సలీం తదితరులు పాల్గొన్నారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments