HomeNewsBreaking Newsనమ్మబలికి… నట్టేట ముంచాడు

నమ్మబలికి… నట్టేట ముంచాడు

కోట్లాది రూపాయలతో ఉడాయించిన ఎల్‌ఐసి ఉద్యోగి..
న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు
ప్రజాపక్షం/ చుంచుపల్లి
“వందలు కాదు వేలు కాదు లక్షలు కాదు ఏకంగా కోట్లాది రూపాయలను ఒక వడ్డీ వ్యాపారి దండుకుని టోకరా పెట్టాడు. నమ్మబలికి నట్టేట ముంచాడు. ఇచ్చిన డబ్బులకు అధిక వడ్డీ ఇస్తానని ఆశ చూపెట్టాడు. దీంతో ఆశపడిన బాధితులు పైసా పైసా కూడా పెట్టుకొని దాచుకున్న సొమ్మును అతడి చేతిలో పెట్టారు. ఇంకేముంది… వసూ లు చేసిన సొమ్ము మొత్తం కోట్లను చేరడంతో కొత్తగూడెం నుంచి ఉడాయించాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న బాధితులు లబోదిబోమంటూ కన్నీరుమున్నీరయ్యారు.” తామంతా మోసపోయామని ఆ మోసకారిపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని కోరుతూ సోమవారం కొంతమంది బాధితులు జిల్లా కలెక్టర్‌ కార్యాలయానికి తరలివచ్చి ఫిర్యాదు చేశారు. ఇది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం రామాంజనేయ కాలనీ పంచాయతీ సమీపంలోని ఎక్స్‌ సర్వీస్‌ మెన్‌ కాలనీలో ఉంటున్న ఎల్‌ఐసి ఉద్యోగి అమరోజీ రామారావు, అతని భార్య లావణ్య తాము భవనాన్ని నిర్మిస్తున్నామని అవసరమైన డబ్బులు ఇస్తే తిరిగి వడ్డీతో సహా చెల్లిస్తానని కొందరు వ్యక్తులకు ఆశ చూపడంతో కొందరు అతని మాటలు నమ్మి లక్షలాది రూపాయలను అప్పుగా ఇచ్చారు. మరి కొంతమంది చిట్టిల రూపంలో చెల్లించారు. కొన్ని నెలలపాటు సక్రమంగా వడ్డీలు చెల్లించిన రామారావు ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ కాలనీలో ఖరీదైన భవనాలు నిర్మించడమే కాకుండా సుమారు 300 మంది బాధితుల వద్ద నుంచి లక్షల రూపంలో డబ్బులు అప్పుగా తీసుకుని కొత్తగూడెం నుంచి రామారావు అతని భార్య లావణ్య పరారయ్యారు. దీంతో బాధితులు లబోదిబోమంటూ జిల్లా కలెక్టర్‌ కార్యాలయానికి తరలివచ్చి జరిగిన సంఘటనపై అధికారుల వద్ద మొరపెట్టుకున్నారు. మోసం చేసిన రామారావుపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. ఇదిలా ఉంటే అందమైన రంగుల భవనాన్ని చూపెట్టి వడ్డీ ఇస్తామని ఆశ చూపెట్టి కొందరు వ్యక్తుల నుంచి లక్షల రూపాయలు వసూలు చేసుకోవడమే కాకుండా అతను నిర్మించుకున్న భవనాన్ని కూడా గుట్టుచప్పుడు కాకుండా కొంతమంది బడాబాబులకు విక్రయించారని బాధితులు ఆరోపించారు. ఎల్‌ఐసి ఉద్యోగి పేరుతో ఉన్న భవనాన్ని అతను విక్రయించి వెళ్లిపోవటమే కాకుండా ఆ భవనాన్ని కొనుగోలు చేసిన కొంతమంది వ్యక్తులకు పంచాయతీ ఎలా ఇంటి నెంబర్‌ ఇస్తుందని బాధితులు ప్రశ్నించారు. ఇందులో పంచాయతీ అధికారులకు కూడా బాధ్యత ఉందని వారిపై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments