బెంగళూరు: దేశవాళీ క్రికెట్లో మధ్యప్రదేశ్ జట్టు చారిత్రక విజయాన్ని నమోదు చేసింది. ఈ సీజన్ రంజీ ట్రోఫీలో టైటిల్ ఫేవరిట్‌గా ముద్ర వేయించుకున్న ముంబయి జట్టును ఫైనల్లో ఆరు వికెట్ల తేడాతో ఓడించి, తొలిసారి ఈ ప్రతిష్టాత్మక దేశవాళీ ట్రోఫీని తన ఖాతాలో వేసుకుంది. ముంబయి తొలి ఇన్నింగ్స్‌లో 374 పరుగులు సాధించగా, అందుకు సమాధానంగా తొలి ఇన్నింగ్స్ ఆడిన మధ్యప్రదేశ్ 536 పరుగుల భారీ స్కోరు సాధించిన విషయం తెలిసిందే. మొదటి ఇన్నింగ్స్‌లో 162 పరుగులు వెనుకంజలో ఉన్న ముంబయి, రెండో ఇన్నింగ్స్ ప్రారంభించి, మ్యాచ్ నాలుగో రోజు, శనివారం ఆట ముగిసే సమయానికి రెండు వికెట్లకు 113 పరుగులు చేసింది. ఆ పరిస్థితుల్లో మ్యాచ్ డ్రాగా ముగియడం ఖాయమని, తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కారణంగా మధ్యప్రదేశ్ విజేతగా నిలవడం లాంఛమని అంతా అనుకున్నారు. కానీ, అందుకు భిన్నంగా ఈ మ్యాచ్‌లో ఫలితం వెలువడింది. ముంబయి రెండో ఇన్నింగ్సలో 57.3 ఓవర్లు ఆడి, 269 పరుగులకు ఆలౌటైంది. పృథ్వీ షా (44), హార్దిక్ తమోరే (25) పరుగులకు అవుట్‌కాగా, అర్మాన్ జాఫర్, సువేద్ పార్కర్ క్రీజ్‌లో ఉన్నారు. మ్యాచ్ చివరి రోజైన ఆదివారం ఉదయం ఆటను కొనసాగించిన ముంబయి 139 పరుగుల వద్ద అర్మాన్ జాఫర్ (37) వికెట్‌ను కోల్పోయింది. ఆ తర్వాత సువేద్ పార్కర్ (51), సర్ఫ్రాజ్ ఖాన్ ౯45) తప్ప ఎవరూ చెప్పుకోదగిన స్థాయిలో ఆడలేకపోయారు. ఫలితంగా మధ్యప్రదేశ్ ముందు ముంబయి కేవలం 108 పరుగుల లక్ష్యాన్ని ఉంచగలిగింది. మధ్యప్రదేశ్ బౌలర్లలో కుమార్ కార్తికేయ 98 పరుగులకు నాలుగు వికెట్లు పడగొట్టాడు. గౌరవ్ యాదవ్, పార్థ్ సహానీ చెరి రెండు వికెట్లు తమతమ ఖాతాల్లో వేసుకున్నారు. కాగా, స్వల్ప లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో మధ్యప్రదేశ్ జట్టు రెండో ఓవర్లోనే యష్ డూబే వికెట్ కోల్పోయింది. అతను కేవలం ఒక పరుగు చేసి ధవళ్ కులకర్ణి బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఓపెనర్ హిమాంశు మంత్రి 37 పరుగుల వ్యక్తిగత స్కోరువద్ద పెవిలియన్ చేరగా, పార్థ్ శర్మ కేవలం ఐదు పరుగులకు వెనుదిరిగాడు. శభం శర్మ 30 పరుగులు చేసి, షమ్స్ ములానీ బౌలింగ్‌లో అర్మాన్ జాఫర్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యడు. అనంతరం రాజత్ పటీదార్ (30 నాటౌట్), కెప్టెన్ ఆదిత్య శ్రీవాత్సవ (1 నాటౌట్) మరో వికెట్ కూలకుండా జట్టును విజయపథంలో నడిపారు. 29.5 ఓవర్లలో నాలుగు వికెట్లకు 108 పరుగులు చేసిన మధ్యప్రదేశ్, ఆరు వికెట్ల తేడాతో విజయభేరి మోగించి, మొదటిసారి రంజీ టైటిల్‌ను అందుకుంది.
సంక్షిప్త స్కోర్లు
ముంబయి తొలి ఇన్నింగ్స్: 127.4 ఓవర్లలో ఆలౌట్ 374 (పృథ్వీ షా 47, అశస్వి జైస్వాల్ 78, సర్ఫరాజ్ ఖాన్ 134, గౌరవ్ యాదవ్ 4/106, అనుభవ్ అగర్వాల్ 3/81, సారాంశ్ జైన్ 2/47).
మధ్యప్రదేశ్ తొలి ఇన్నింగ్స్: 177.2 ఓవర్లలో 536 ఆలౌట్ (యష్ డూబే 133, శుభం శర్మ 116, రజత్ పటీదార్ 122, సారాంశ్ జైన్ 57, షమ్స్ ములానీ 5/173, తుషార్ దేశ్‌పాండే 3/116, మోహిత్ అవస్థి 2/93).
ముంబయి రెండో ఇన్నింగ్స్ (ఓవర్‌నైట్ స్కోరు 22 ఓవర్లలో 2 వికెట్లకు 113): 57.3 ఓవర్లలో 269 ఆలౌట్ (పృథ్వీ షా 44, హార్దిక్ తమోరే 25, అర్మాన్ జాఫర్ 37, సువేద్ పార్కర్ 51, సర్ఫ్రాజ్ ఖాన్ 45, కుమార్ కార్తికేయ 4/98, గౌరవ్ యాదవ్ 12/53, పార్థ్ సహానీ 2/43).
మధ్యప్రదేశ్ రెండో ఇన్నింగ్స్: 29.5 ఓవర్లలో నాలుగు వికెట్లకు 108 (హిమాంశు మంత్రి 37, శుభం శర్మ 30, రజత్ పటీదార్ 30 నాటౌట్, షమ్స్ ములానీ 3/41, ధవళ్ కులకర్ణి 1/7).
నాడు హోల్కర్.. నేడు మధ్యప్రదేశ్
ఇప్పటి మధ్యప్రదేశ్ క్రికెట్ జట్టు స్థానంలోనే చాలాకాలం హోల్కర్ జట్టు ఉండేది. 1944 నుంచి 1954 సీజన్ వరకూ కొనసాగిన హోల్కర్ జట్టు నాలుగు పర్యాయాలు టైటిల్‌ను సాధించింది. ఆరుసార్లు రన్నరప్ ట్రోఫీని అందుకుంది. అనంతరం మధ్యప్రదేశ్ జట్టుగా గుర్తింపు పొందిన తర్వాత అదే స్థాయిలో రాణించలేకపోయింది. 1998- సీజన్లో ఒకసారి ఫైనల్ చేరింది. అప్పట్లో జట్టుకు చంద్రకాంత్ పండిత్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. టైటిల్ పోరులో కర్నాటక చేతిలో 96 పరుగుల తేడాతో ఓటమిపాలుకావడంతో, మధ్యప్రదేశ్‌కు రన్నరప్ ట్రోఫీతో సంతృప్తి చెందక తప్పలేదు. అయితే, అప్పుడు జట్టుకు కెప్టెన్‌గా ఉన్న చంద్రకాంత్ పండిత్ ఇప్పుడు జట్టు కోచ్. అతని మార్గదర్శకంలోనే మధ్యప్రదేశ్ రంజీ ట్రోఫీని మొదటిసారి కైవసం చేసుకుంది. కెప్టెన్‌గా సాధించలేకపోయిన రంజీ టైటిల్‌ను కోచ్‌గా చంద్రకాంత్ పండిత్ సంపాదించాడు. ఇప్పటి వరకూ 46 సీజన్లలో ఫైనల్ చేరి, 41 పర్యాయాలు టైటిల్ సాధించిన ముంబయి ఈసారి ఫేవరిట్‌గా బరిలోకి దిగింది. కానీ, మధ్యప్రదేశ్ చేతిలో అనూహ్యంగా ఓటమిపాలైంది. ఆ జట్టు 42వ రంజీ ట్రోఫీ టైటిల్ కలకు గండికొట్టిన మధ్యప్రదేశ్ విజేతగా నిలిచింది. మొదటిసారి ట్రోఫీని దక్కించుకుంది.
మధ్యప్రదేశ్ చారిత్రక విజయం తొలిసారి రంజీ ట్రోఫీ కైవసం
RELATED ARTICLES