ఢిల్లీ జమా మసీదు కేసులో ఇద్దరు అరెస్టు
రాంచీలో వేలాదిమందిపై 25 కేసులు
సున్నిత ప్రాంతాల్లో భద్రత మరింత కట్టుదిట్టం
33 గంటల తర్వాత ఇంటర్నెట్ పునరుద్ధరణ
భద్రతాబలగాల మోహరింపు : 50 మంది సంచార గస్తీ
న్యూఢిల్లీ : మహ్మద్ ప్రవక్తకు వ్యతిరేకంగా బిజెపి నాయకులు నుపూర్ శర్మ, నవీన్ కుమార్ జిందాల్ ఉన్మాద వ్యాఖ్యలు చేసిన తరువాత ఈనెల 10వ తేదీన శుక్రవారం ప్రార్థనల సందర్భంగా నిరసనలతోపాటు పలువురు పలుచోట్ల హింసాత్మక చర్యలకు పాల్పడటంతో హింసకు పాల్పడిన వారిపై జూన్ 11న దేశవ్యాప్తంగా పలుచోట్ల కేసులు నమోదయ్యాయి. దానికి కొనసాగింపుగా ఈ రోజు ఆదివారంనాడు కూడా పలుచోట్ల కేసులు, అరెస్టులపర్వం కొనసాగింది. ఢిల్లీలో చరిత్రాత్మకమైన జమా మసీదు వద్ద మతసామ రస్యానికి భంగం కలిగించేవిధంగా ఎలాంటి అనుమతులు లేకుండా నిరసన ప్రదర్శనలు చేసిన ఘటనలో బాధ్యులైన మహ్మద్ నదీమ్ (43)క, ఫాహీమ్ (37)అనే ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు పోలీసులు ఆదివారంనాడు చెప్పారు. పశ్చిమ బెంగాల్లో ఇప్పటివరకూ 100 మందిని అరెస్టు చేశారు. ఉత్తరప్రదేశ్‌లో ఇప్పటివకూ 304 మందిని అరెస్టు చేశారు. జమ్మూ కశ్మీరులో ఆదివారం నాడు కర్ఫ్యూ సడలించారు. చీనాబ్ లోయలో
ఆదిల్ గఫూర్ గానై అనే ఒక వ్యక్తిని అరెస్టు చేశారు. నిరసన ప్రదర్శనలో గానై రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారు. ఈ అల్లర్లకు సంబంధించి కశ్మీరులో అరెస్టయినది గానై ఒక్కరే. హౌరా జిల్లాలో పోలీసు పహారా నీడన బలవంతపు నిశ్శబ్దం ఆవరించచింది. ఢిల్లీలో అరెస్టు చేసిన ఇద్దరు నిందితులూ జమా మసీదు, తుర్క్‌మన్ గేట్ ఏరియా నివాసితులే. సిసిటీవీలను, మొబైల్ ఫూటేజీ రికార్డులను పరిశీలించారు. ఈ ప్రాంతంలో మరింతమంది నిందితులను గుర్తించారు. సెక్షన్ 188 కింద జూన్ 11నే గుర్తు తెలియని నిందితులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇందులో భాగంగా వారిని అరెస్టు చేశారు. 153 ఎ ఐపిసి కింద మతసామరస్యాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేశారన్న కేసులు కూడా పెట్టారు. జూన్ 10న శుక్రవారం ప్రార్థనల రోజు ప్లకార్డులతో మసీదు మెట్లమీద నిరసన వ్యక్తం చేశారు. 1500 మంది ఆ రోజు ప్రార్థనలకు వచ్చారు. జార్ఖండ్ రాష్ట్రంలో ఆదివారంనాడు కూడా తీవ్ర ఉద్రిక్త వాతావరణం కొనసాగింది. దీంతో రాష్ట్రంలోని సున్నిత ప్రాంతాలలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. రాంచీలో వేలాదిమందిపై 25 ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. 22 మంది పేర్లు గుర్తించి వారిపై కేసులు పెట్టారు. రాంచీలో ఇప్పటివరకూ అరెస్టులుచేయలేదు. కేసును ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు.అయితే 33 గంటల విరామం తరువాత రాజధాని రాంచీలో ఇంటర్నెట్ సేవలను పునరుద్ధరించినట్లు రాంచీ డిప్యూటీ కమిషనర్ ఛవి రంజన్ చెప్పారు. 12 పోలీస్ స్టేషన్లకుగాను ఆరు పోలీస్టేషన్ల పరిధిలో 144వ సెక్షన్ ఆంక్షలు ఎత్తివేశారు. గుంపులను నిషేధించారు. సుమారు 3,500 మంది భద్రతా సిబ్బంది సున్నిత ప్రాంతాలలో రాంత్రింబగళ్ళు కాపలా ఉన్నారని చెప్పారు. డైలీ మార్కెట్లో 1100 దుకాణాలు ఇంకా మూతపడే ఉన్నాయి.జూన్ 10న అల్లర్ల సందర్భంగా రాంచీలో పోలీసులు జరిపిన కాల్పల్లో అనేకమంది గాయపడ్డారు. వారిలో ఇద్దరు చికిత్స పొందుతూ జూన్ 11న మరణించారు. ప్రవక్తకు వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలతో చెలరేగిన నిరసనలు, అల్లర్లు రాంచీని కుదిపేశాయి. రాంచీ సీనియర్ ఎస్.పి సురేంద్ర కుమార్ ఝా మాట్లాడుతూ, సత్వర కార్యాచరణ బృందాలు, ఉగ్రవాద వ్యతిరేక స్వాడ్లు, ప్రత్యేక టాస్క్ ఫోర్స్, జిల్లా పోలీసు యంత్రాంగం వ్యూహాత్మక ప్రాంతాలలో మోహరించి ఉందని చెప్పారు. వీటిల్లో గుర్తించిన 38 అతి సున్నితమైన ప్రాంతాలు కూడా ఉన్నాయన్నారు.మొన్నటివరకూ బిజెపి అధికార ప్రతినిధిగా వ్యవహరించిన నుపూర్ శర్మను, ఆమెకు మద్దతు ఇస్తున్న ఢిల్లీ బిజెపి మీడియా ఇన్చార్జి నవీన్ కుమార్ జిందాల్‌ను అరెస్టు చేయాలని దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శకులు డిమాండ్ చేశారు. 57 దేశాల సభ్యత్వం గల ఇస్లామిక్ కూటమి కూడా భారతదేశం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేయడంతో దానిని భారత్ గట్టిగా తిప్పికొట్టింది. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కారణంగా భారతదేశం మూల్యం చెల్లించుకోవలసి వస్తోందని కూడా దేశంలోని ప్రతిపక్షాలు నిశితంగా తీవ్ర విమర్శలు చేస్తున్నాయి.
నేరస్తుల్ని అణచేస్తాం
వారి ఆస్తుల్ని నేలమట్టం చేస్తాం
ప్రవక్త వ్యతిరేక వ్యాఖ్యలపై అల్లర్లకు సంబంధించి ఉత్తర ప్రదేశ్ తొమ్మిది జిల్లాలో 13 కేసులు నమోదు చేశారు. 304 మందిని అరెస్టు చేశారు. ప్రయాగలో 91 మందిని, సహరాన్‌పూర్‌లో 71 మందిని, హత్రాస్‌లో 51 మందిని, అంబేద్కర్ నగర్, మొరాదాబాద్లలో 34 మంది చొప్పున, ఫిరోజాబాద్‌లో 15 మందిని,అలీఘడ్, జలాన్‌లో ఎనిమిదిమందిని అరెస్టు చేశారు. రాష్ట్రంలో ప్రతి సమయంలో ఎలాంటి అల్లర్లు లేకుండా చూడాలని ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ పోలీసు వ్యవస్థకు ఆదేశించారు. సంఘ వ్యతిరేక శక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. తరచు ఆయన పోలీసు ఉన్నతాధికారులతో పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ముఖ్యమంత్రి సలహాదారు మృత్యుంజయ కుమార్ ట్వీట్ చేస్తూ, “ప్రతి శుక్రవారం తరువాత మరునాడు ఒక శనివారం వస్తుందని నిబంధనలను ఉల్లంఘించే శక్తులు గుర్తుంచుకోవాలి” అని పోస్టు చేశారు. దానికితోడుగా ఒక భవనాన్ని ధ్వసం చేస్తున్న బుల్డోజర్ ఫోటోను ఆయన పోస్టు చేశారు. ఆదిత్యనాథ్ పాలనలో ప్రభుత్వ యంత్రాంగం నేరస్తులను, అల్లర్లకు పాల్పడిన వారిని అణచివేస్తుందని,వాచి ఆస్తులు స్వాధీనం చేసుకోవడమో లేక ఆస్తులు ధ్వంసం చేయడమో చేస్తామన్నారు.
ప్రయాగ్‌రాజ్‌లో జూన్ 10న అల్లర్లకు పాల్పడినవారు పోలీసులపై రాళ్ళు రువ్వారు. కొన్ని మోటారు వాహనాలను, బండ్లను సంఘ వ్యతిరేక శక్తులు దగ్ధం చేశాయి. పోలీసు వాహనాలు కూడా దగ్ధం చేసే ప్రయత్నం చేశారని, పోలీసులు కూడా ఈ అల్లర్లలో గాయపడ్డారని పోలీసు అధికారులు చెప్పారు.
బెంగాల్లో బలవంతపు నిశ్శబ్దం
హింసాత్మక చర్యలతో కూడిన అల్లర్లు చెలరేగిన పశ్చిమ బెంగాల్ హౌరా జిల్లాలో 144 సెక్షన్ కింద నిషేధాజ్ఞలు కొనసాగుతూ ఉండటంతో ఈ ప్రాంతంలో బలవంతపు నిశ్శబ్దం ఆవరించుకుంది. ముర్షీదాబాద్‌లోని బెల్దాంగా, రెజనగర్, షాకిత్పూర్ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఇంటర్నెట్ సేవలు నిషేధించారు. ఇప్పటివరకూ 100 మందిని అరెస్టు చేశారు. దుకాణాలు, మార్కెట్లను తెరిచారు. నేషనల్ హైవే పై రోజువారీ వాహనాలు తిరుగుతున్నాయి. సోమవారం వరకూ హౌరా జిల్లాలో ఇంటర్నెట్ సేవలు రద్దు చేశారు. నిషేధ ఉత్తర్వులు జూన్ 15 వరకూ అమలులో ఉంటాయి. ఉనెబెరియా, పంచ్లా, జగద్బల్లాపూర్, ధూల్గఢ్ ప్రాంతాలలో పోలీసులు శనివారం రాత్రి రూట్ మార్చ్ నిర్వహించారు. భద్రతా బలగాలను భారీగా మోహరించారు.ముర్షీదాబాద్‌లో ప్రవక్తపై అమర్యాదకరమైన వ్యాఖ్యలకు నిరసనగా గృహదహనాలు జరిగాయి. కాలేజీ విద్యార్థులు సోషల్ మీడియాల్లో పోస్టులు చేశారు. కోల్‌కతాలోని పార్క్ సర్కిల్, కిద్దెర్పోర్, రాజా బజార్, మల్లిక్ బజార్ ప్రాంతాలలో భద్రత కట్టుదిట్టం చేశారు. నుపూర్ శర్మకు వ్యతిరేకంగా కాంథి పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. హౌరా జిల్లాలో పర్యటించవద్దని పోలీసులు ప్రతిపక్ష నాయకుడు సువేందు అధికారిని కోరారు.
కొనసాగుతున్న కేసులు, అరెస్టుల పర్వం
RELATED ARTICLES