కఠిన చర్యలకు తెలంగాణ రాష్ర్ట రైతు సంఘం
అధ్యక్షురాలు పశ్య పద్మ డిమాండ్
ప్రజాపక్షం/ హైదరాబాద్ ధాన్యం కొనుగోలులో జరుగుతున్న అక్రమాలపై విచారణ జరిపి కఠినమైన చర్యలు తీసుకోవాలని, తడిసిన ధాన్యం మద్దతు ధరలకు కొనుగోలు చేయాలని తెలంగాణ రాష్ర్ట రైతు సంఘం అధ్యక్షురాలు పశ్య పద్మ డిమాండ్ చేశారు. రాష్ర్టంలో దాన్యం కొనుగోలు ఆలస్యంగా ఏప్రిల్ 14 నుంచి ప్రారంభమైందని, ఇప్పటివరకు కేవలం నాలుగు లక్షల రైతుల నుండి 16.6 లక్షల టన్నుల ధాన్యాన్ని మాత్రమే సేకరించారని శనివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. కొనుగోలు కేంద్రాలలో రోజుల తరబడి రైతులు ఎదురు చూస్తున్నారు అయినా కొనుగోలు కావడం లేదు వర్షానికి తడిసిన ధాన్యాన్ని ఆర పోసుకోవటం మళ్లీ వర్షాలు వస్తాయేమోనని బెంగతో 2, 3, 4, 8 కిలోలు తక్కువ తూకం వేస్తున్నా ఏమీ చేయలేని పరిస్థితులు కొనసాగుతున్నాయన్నారు. మహబూబ్ నగర్ జిల్లా మహమ్మదాబాద్ లో 5లక్షల విలువైన ధాన్యాన్ని
అక్రమంగా చేజిక్కించుకున్న ఐకెపి కేంద్రం సిబ్బంది పై రైతులు తిరగబడితే కేసు నమోదు చేయబడిందని తెలిపారు. కొనుగోలులో అక్రమంగా రెండు కిలోల ధాన్యాన్ని అదనంగా తూకం వేయడం ఇతర కేంద్రాలలో తూకంలో 2 నుండి 5 కిలోల వరకు ధాన్యాన్ని కట్ చేయటం ఇతరత్రా అక్రమాలకు కొనుగోలు కేంద్రాల సిబ్బంది పాల్పడుతున్నారని విమర్శించారు. కొనుగోలు కేంద్రాలలో అక్రమాలకు పాల్పడిన సిబ్బందిపై చర్యలు తీసుకోవటంతో పాటు కేంద్రాలను రద్దు చేయాలని తెలంగాణ పశ్య పద్మ డిమాండ్ చేశారు. నష్టపోయిన రైతులకు న్యాయం చేయడానికి చర్యలు తీసుకోవాలన్నారు. రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం మామిడిపల్లి గ్రామం లో దేవుడి మాన్యం టెండర్లలో దళితులు పాల్గొన్నందుకు టెండర్ వాయిదా వేశామని చెప్పిన అధికారులపై తక్షణం విచారణ జరిపి కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ధాన్యం కొనుగోలులో అక్రమాలపై విచారణ
RELATED ARTICLES