HomeNewsBreaking Newsవంటగ్యాస్‌పై మూడోసారి వడ్డన

వంటగ్యాస్‌పై మూడోసారి వడ్డన

వెయ్యిరూపాయలకు చేరిన ధర
తాజాగా రూ.3.50లు పెంపు
న్యూఢిల్లీ : వంటగ్యాస్‌ ఎల్‌పిజి సిలిండర్‌ ధరను మళ్ళీ పెంచారు. ఎల్‌పిజి వంటగ్యాస్‌ సిలిండర్‌ ధర వెయ్యిరూపాయలుకు చేరుకుంది. తాజాగా గురువారంనాడు సిలిండర్‌ధరపై మరో రూ.3.50లు పెంచడంతో రౌండ్‌ ఫిగర్‌ రూ.1,000 లకు చేరుకుంది. ఈ నెలలో వంటగ్యాస్‌ ధర పెంచడం ఇది రెండోసారి. అంతర్జాతీయ ఇంధన ధరల పెరుగుదలకు అనుగుణంగా ఈ ధరలు పెరిగాయని ప్రభుత్వం పేర్కొంది. రెండు నెలల లోపే ఈ ధర ఇప్పటికి మూడుసార్లు పెంచారు. దేశరాజధానిలో సబ్సిడీ లేని ఎల్‌పిజి 14.2 కేజీల సిలిండరు ధర రూ.1,003 లకు చేరుకుంది. ఇప్పటివరకూ ఈ ధర రూ.999.50లుగా ఉండేది. మార్చి 22వ తేదీన ఎల్‌పిజి సిలిండరు ధరను ఒకేసారి రూ.50లు పెంచారు. అప్పటినుండే పెట్రోలు, డీజిలు ధరలపై కూడా వరుస పెరుగుదల మోత మోగడం ప్రారంభమైంది. మార్చి 22న, మే 7వ తేదీన మరో రూ.50 లు పెంచారు. 12 రోజుల తరువాత తిరిగి ఇప్పుడు మే 19వ తేదీన మూడోసారి కూడా వంటగ్యాస్‌ ధర పెంచారు. వంటగ్యాస్‌ ధరలు 2021 ఏప్రిల్‌లో ఒక సిలిండరుపైన రూ.193.50 లు ధర పెంచారు. పెట్రోలు, డీజిలు ధరల విషయమైతే చెప్పనక్కరలేదు. మార్చి 22 నుండి ఇప్పటి వరకూ రికార్డుస్థాయిలో 16 రోజులపాటు లీటరుకు రూ.10 వంతున ధరలు పెంచారు. ఏడాదికి 12 సిలిండరులు వినియోగదారులకు సబ్సిడీపై సరఫరా చేస్తారు. ఆ కోటా దాటితే సబ్సిడీ లేకుండా కొనుగోలు చేయాలి. చాలా నగరాల్లో ప్రభుత్వం ఎల్‌పిజిపై సబ్సిడీలు చెల్లించడం లేదు. ఉజ్వల పథకం కింద కేంద్రం మహిళలకు ఉచిత గ్యాస్‌ కనెక్షన్లు ఇస్తోంది. అయితే వాటిపై కూడా ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వడం లేదు. సబ్సిడీలేని వంటగ్యాస్‌ 14.2 కేజీల సిలిండర్‌ ధర ముంబయిలో రూ.1,002.50లు ఉండగా, చెన్నైలో ఈ ధర రూ 1,018.50లు, కోల్‌కతాలో రూ.1,029లు గా ఉంది. వ్యాట్‌ ధరలకు అనుగుణంగా ఒక రాష్ట్రానికీ మరొక రాష్ట్రానికీ మధ్య ఈ వంటగ్యాస్‌ సిలిండరు ధరల్లో మార్పులు ఉన్నాయి. ఎక్కువ వ్యాట్‌ వసూలు చేసే రాష్ట్రాలలో ఈ ధరలు ఎక్కువగా ఉన్నాయి. ఆయిల్‌ కంపెనీలు కూడా కమర్షియల్‌ ఎల్‌పిజి సిలిండరు ధరలను గణనీయంగా పెంచేశాయి. హోటల్స్‌, రెస్టారెంట్లు వాడే గ్యాస్‌ 19 కేజీల సిలిండరు ధరను రూ.2,354లకు పెంచారు. మే 1వ దీన వాణిజ్య అవసరాలకు ఉపయోగించే ఎల్‌పిజి సిలిండరు ధర ఒక్కసారిగా రూ.102.50 లు పెరిగింది. దీంతో ఈ ధర రూ.2,355.50లకు చేరుకుంది. మే 7వ తేదీన ఈ ధరను రూ.2,346 లకు తగ్గించారు. ఈ ఏడాదిలో అంతర్జాతీయంగా చమురు ధరలు గణనీయంగా పెరిగిపోయాయి. గడచిన 13 సంవత్సరాలలో ఏనాడూ లేనిరీతిలో ఈ ధరలు పెరిగాయి. మార్చినెలలో ఒక బ్యారెల్‌ ముడి చమురు ధర 140 డాలర్లకు చేరుకుంది. బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌ ధర గురువారంనాడు 110.13 డాలర్లుగా ఉంది. భారత రూపాయి విలువను అమెరికా డాలరుతో పోల్చి చూస్తే ఒక డాలరు విలువ రూ.77.74 రూపాయలుగా లెక్క తేలింది. భారతదేశం తన అవసరాల కోసం 85 శాతం చమురును విదేశాల నుండే దిగుమతి చేసుకుంటున్నది. దేశీయ అవసరాలకు అనుగుణంగా ఎల్‌పిజిని కూడా భారత్‌ పూర్తిగా ఉత్పత్తి చేయలేకపోతోంది. బుధవారంనాడు కేంద్ర చమురు మంత్రిత్వశాఖ సూచనా ప్రాయంగా సౌదీలో ఎల్‌పిజి ధరలు 33 శాతం పెరిగాయని పేర్కొంది. అదే సమయంలో మన దేశంలో ధరలు కేవలం 11 శాతం మాత్రమే పెరిగాయని పేర్కొంది.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments