సిపిఐ రాష్ర్ట సహాయ కార్యదర్శి కూనంనేని విమర్శ
ప్రజాపక్షం / హైదరాబాద్ మనుస్మృతికి చట్టరూపం తీసుకువచ్చేందుకు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం క్రమపద్ధతిలో భారత రాజ్యాంగ విలువలు, ప్రజాస్వామ్య పనితీరును నాశనం చేస్తోందని సిపిఐ తెలంగాణ రాష్ర్ట సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివ రావు విమర్శించారు. హైదరాబాద్ హిమాయత్ నగర్‌లోని సత్యనారాయణ రెడ్డి భవన్ లో సిపిఐ హైదరాబాద్ జిల్లా సమితి సమావేశం జిల్లా కార్యవర్గ సభ్యులు బి. స్టాలిన్ అధ్యక్షతన బుధవారం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన కూనంనేని సాంబశివ రావు ప్రసంగిస్తూ సమానత్వం, న్యాయం, స్వేచ్ఛ , సౌభ్రాతృత్వం సూత్రాలపై ఆధారపడిన ప్రగతిశీల పత్రం భారత రాజ్యాంగం అని, దీనిని నిర్వీర్యం చేసేందుకు బీజేపీ – ఆర్‌ఎస్‌ఎస్ లు కుట్రలు పన్నుతున్నాయని మండిపడ్డారు. భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి ఉద్యమించాలని అయన పిలుపునిచ్చారు. ప్రజా సమస్యలు పరిస్కారం చేయడంలో కేంద్ర రాష్ర్ట ప్రభుత్వలు పూర్తిగా విఫలం చెందాయని,రోజురోజుకు నిరుద్యోగులు పెరుగుతున్నారని, ఇంధన, నిత్యావసర ధరలు పెంచి సామాన్య ప్రజల నడ్డి విరుస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ నగరంలో పేదలకు డబుల్ బెడ్ రూం ఇళ్ళు, పెన్షన్ లు, రేషన్ కార్డులు తదితర స్ధానిక సమస్యలు పరిష్కారం చేయడంలో టిఆర్‌ఎస్ ప్రభుత్వం విఫలం అయిందని విమర్శించారు. పేద ప్రజలకు కావలసిన మౌలిక సౌకర్యాలు ప్రభుత్వం కల్పించేవరకు పోరాటాలు నిర్వహించాలని కూనంనేని సాంబశివ రావు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సిపిఐ హైదరాబాద్ జిల్లా కార్యదర్శి ఈ.టి. నరసింహా, కార్యవర్గ సభ్యులు ఏం. నరసింహ, ఎస్. ఛాయాదేవి, జి. చంద్రమోహన్ గౌడ్, ఎస్.ఏ. మన్నన్, నిర్లేకంటి శ్రీకాంత్, సమితి సభ్యులు ఎండి సలీం, మామిడిచెట్ల వెంకటయ్య, శక్రి భాయి, అమీనా, మహమూద్ తదితరులు పాల్గొన్నారు.
మోడీ పాలనలో రాజ్యాంగ విలువలు ధ్వంసం
RELATED ARTICLES